Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్
- మూడు వికెట్లతో అక్షర్ పటేల్ మాయ
- ఛేదనలో సెంచరీ కొట్టిన జాకిర్ హసన్
- బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 272/6
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ గెలుపు వాకిట నిలిచింది. 513 పరుగుల రికార్డు ఛేదనలో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 272/6తో కొనసాగుతోంది. అరంగేట్ర బ్యాటర్ జాకిర్ హసన్ (100) శతక విన్యాసంతో నాల్గో రోజు టీమ్ ఇండియా బౌలర్లను నిలువరించిన ఆతిథ్య జట్టు.. నేడు నాలుగు వికెట్లను కాచుకోవటం అసాధ్యమే! బంగ్లాదేశ్‌కు మరో 241 పరుగులు అవసరం కాగా, భారత్ మరో నాలుగు వికెట్లు కూల్చితే 1-0 ఆధిక్యం సొంతం చేసుకోగలదు. భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టులో నేడు ఆఖరు రోజు ఆట.
నవతెలంగాణ-చిట్టగాంగ్
తొలి టెస్టులో భారత్ విజయాన్ని బంగ్లాదేశ్ ఓ రోజు ఆలస్యం చేసింది!. 513 పరుగుల ఛేదనలో ఓపెనర్లు జాకిర్ హసన్ (100, 224 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), నజ్ముల్ శాంటో (67, 156 బంతుల్లో 7 ఫోర్లు) అసమాన ప్రతిఘటన చూపించారు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన జాకిర్ హసన్ బంగ్లాదేశ్ పోరాటాన్ని ముందుండి నడిపించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (3/50) మాయజాలంతో బంగ్లాదేశ్ చివరి రెండు సెషన్లలో మూడేసి వికెట్లు కోల్పోయింది. షకిబ్ అల్ హసన్ (40 బ్యాటింగ్, 69 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెహిది మిరాజ్ (9 బ్యాటింగ్, 40 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు. తొలి టెస్టులో నేడు చివరి రోజు ఆట కావటంతో ఉదయం సెషన్లోనే బంగ్లాదేశ్ కథ ముగించేందుకు భారత్ సిద్ధమవుతోంది.
జాకిర్, శాంటో జోరు
ఓవర్‌నైట్ స్కోరు 42/0తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ ఓపెనర్లు తొలి సెషన్లో వికెట్ ఇవ్వలేదు. జాకిర్ హసన్ (100), నజ్ముల్ శాంటో (67) తొలి వికెట్‌కు 124 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. అనూహ్యంగా ఉదయం సెషన్లో పిచ్ నుంచి బౌలర్లకు ఏమాత్రం సహకారం లభించలేదు. ఇది బంగ్లాదేశ్ ఓపెనర్లకు గొప్పగా ఉపయోగపడింది. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన ఓపెనర్లు 46.1 ఓవర్ల పాటు వికెట్ నిరాకరించారు. భారత్‌తో తాజా మ్యాచుల్లో ఏకంగా మూడు ఇన్నింగ్స్‌ల్లో సున్నా పరుగులకే నిష్క్రమించిన శాంటో.. ఛేదనలో మెరిశాడు. ఆరు ఫోర్ల సాయంతో 108 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. జాకిర్ హసన్ ఏడు ఫోర్లతో 101 బంతుల్లో తొలి అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్ల జోరుతో తొలి సెషన్‌ను బంగ్లాదేశ్ 119/0తో మెరుగ్గా ముగించింది.
లంచ్ తర్వాత షురూ!
లంచ్ తర్వాత మ్యాచ్‌ను మళ్లీ భారత్ గుప్పిట్లోకి తీసుకుంది. ఉమేశ్ యాదవ్ ఓవర్లో శాంటో నిష్క్రమించగా భారత్‌కు బ్రేక్ లభించింది. నం.3 బ్యాటర్ యాసిర్ అలీ (3)ని అక్షర్ పటేల్ లెంగ్త్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. ఫామ్‌లో ఉన్న లిటన్ దాస్ (19) క్రీజులో నిలువటమే కాదు, స్కోరు బోర్డునూ కదిలించేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో కుల్దీప్ యాదవ్‌పై షాట్‌కు వెళ్లిన దాస్ డీప్ మిడ్ఆన్లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. మూడు టాప్ ఆర్డర్ వికెట్లతో లంచ్ సెషన్లో భారత్ రేసులోకి వచ్చింది. టీ విరామ సమయానికి 176/3తో బంగ్లాదేశ్ నిలిచింది.
అక్షర్ పటేల్ మాయ
పిచ్ నుంచి టర్న్, బౌన్స్ లభిస్తున్న వేళ ముగ్గురు స్పిన్నర్లను ప్రయోగించిన భారత్.. ఫీల్డర్లను బ్యాటర్లకు దగ్గరగా మొహరించింది. జాకిర్, ముష్ఫీకర్ రహీం (23) దూకుడుగా ఆడేందుకు మొగ్గుచూపారు. చివరి సెషన్ తొలి ఏడు ఓవర్లలో నాలుగు బౌండరీలు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు పిండుకున్నారు. కుల్దీప్పై ఓ సిక్సర్, అక్షర్‌పై వికెట్ల వెనకాల స్వీప్ షాట్‌తో కెరీర్ తొలి శతకం పూర్తి చేసుకున్నాడు జాకిర్ హసన్. సెంచరీ హీరో జాకిర్ నిష్క్రమణతో అశ్విన్ వికెట్ల ఖాతా తెరిచాడు. 85వ ఓవర్లో కొత్త బంతి అందుకున్న భారత్.. ఉమేశ్ యాదవ్‌కు అందించింది. కానీ ముష్ఫీకర్ రహీం క్యాచ్‌ను పంత్ వదిలేశాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ 88 ఓవర్లో రెండు వికెట్లతో భారత్‌కు విజయాన్ని చేరువ చేశాడు. తొలి బంతికి ముష్ఫీకర్ రహీం ఆఫ్ స్టంప్ట్ను గిరాటేసిన అక్షర్.. ఆరో బంతికి నురుల్ హసన్ (3)ను సాగనంపాడు. క్రీజు వదిలి ముందుకొచ్చిన నురుల్ హసన్‌ను వికెట్ కీపర్ పంత్ మళ్లీ క్రీజులోకి రానీయలేదు. నాల్గో రోజు చివరి డ్రింక్స్ విరామం అనంతరం షకిబ్ (40 బ్యాటింగ్) అభిమానులను అలరించే ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్‌పై ఎల్బీ సమీక్షలో బతికిపోయిన షకిబ్.. ఆ తర్వాతి రెండు బంతులను 4, 6 బాదాడు. మిరాకిల్ మ్యాన్ మిరాజ్ (9 బ్యాటింగ్)తో కలిసి 14 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన షకిబ్.. 34 పరుగుల భాగస్వామ్యం సైతం నిర్మించాడు. షకిబ్, మిరాజ్‌లను నేడు ఉదయం సెషన్లో అవుట్ చేయగలిగితే భారత్ లంచ్‌కు ముందే గెలుపు సంబురాలు చేసుకోవచ్చు!.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 404/10
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 150/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 258/2 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : నజ్ముల్ శాంటో (సి) పంత్ (బి) ఉమేశ్ 67, జాకిర్ హసన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 100, యాసిర్ అలీ (బి) అక్షర్ 5, లిటన్ దాస్ (సి) ఉమేశ్ (బి) కుల్దీప్ 19, ముష్ఫీకర్ (బి) అక్షర్ 23, షకిబ్ అల్ హసన్ బ్యాటింగ్ 40, నురుల్ హసన్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 3, మెహిది మిరాజ్ బ్యాటింగ్ 9, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం :(102 ఓవర్లలో 6 వికెట్లకు) 272. వికెట్ల పతనం : 1-124, 2-131, 3-173, 4-208, 5-234, 6-238.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 15-3-46-0, ఉమేశ్ యాదవ్ 15-3-27-1, అశ్విన్ 27-3-75-1, అక్షర్ పటేల్ 27-10-50-3, కుల్దీప్ యాదవ్ 18-2-69-1.