Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాతో రెండో టెస్టుకూ దూరం
ముంబయి : భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా చేతి బొటన వేలి గాయానికి గురైన రోహిత్ శర్మ.. గాయం నొప్పి వేధిస్తున్నా బ్యాటింగ్‌కు వచ్చి అసమాన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. బొటన వేలి గాయం తదుపరి స్కానింగ్ పరీక్షల కోసం ముంబయికి చేరుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం వేగంగానే కోలుకుంటున్నాడు. దీంతో డిసెంబర్ 14 నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టుకు రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధిస్తాడనే అంచనాలు ఉన్నాయి. రెండో టెస్టుకు అందుబాటులో ఉండగలిగే ఫిట్నెస్ రోహిత్ శర్మలో ఉన్నప్పటికీ.. రానున్న స్వదేశీ సీజన్లో మూడు దేశాలతో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. దీంతో రోహిత్ శర్మ మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన బీసీసీఐ వైద్య బృందం వెలిబుచ్చినట్టు సమాచారం. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. మూడు ఫార్మాట్ల కెప్టెన్ రానున్న మూడు ఫార్మాట్ల ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఫిట్‌గా ఉండేందుకు వైద్య బృందం జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఇక జనవరిలో శ్రీలంకతో ఆరంభం కానున్న వన్డే, టీ20 సిరీస్‌కు నూతన సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేయనుంది. సెలక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు బీసీసీఐ ఇప్పటికే త్రి సభ్య క్రికెట్ సలహా సంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. సెలక్షన్ కమిటీ కోసం ధరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఈ వారంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అవకాశం కనిపిస్తోంది.