Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మందితో జంబో జట్టు
- దిశా నిర్దేశం లేని రంజీ జట్టు
- ఆతిథ్య విలువలకు తిలోదకాలు
'హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంతకుమించి దిగజారదు అనుకున్న ప్రతిసారి.. అంచనాలు తప్పు అని హెచ్‌సీఏ నిరూపిస్తూనే ఉంది'. అంతర్గత కుమ్ములాటలు, జట్టు ఎంపికలో అవినీతి, నిర్వహణలో నిర్లక్ల్యం హెచ్‌సీఏలో నిత్యకృత్యం. కానీ ఇటీవల తమిళనాడుతో రంజీ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వటంలో సైతం హెచ్‌సీఏ చేతులెత్తేసింది. హెచ్‌సీఏ చరిత్రలో మునుపెన్నడు చూడని విధంగా.. ఆటగాళ్లకు భోజనాలను సైతం అందించలేక పరువు పోగొట్టుకుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
భోజనాలు సైతం పెట్టలేక..! : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారి ఓ రంజీ మ్యాచ్‌కు భోజనాలు సైతం అందించటంలో విఫలమైంది. పదవీ కాలం ముగిసినా మహ్మద్ అజహరుద్దీన్ ఇప్పటికీ హెచ్‌సీఏ పగ్గాలు పట్టుకునే ఉన్నాడు. ఆయన అనుచరులే రంజీ మ్యాచ్ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని కాంట్రాక్టులు దక్కించుకున్నారు. రంజీ మ్యాచ్‌లో లంచ్ విరామం 40 నిమిషాలు ఉంటుంది. విరామ సమయానికి ముందే భోజనాలు సిద్ధం చేస్తే ఆటగాళ్లు, అంపైర్లు, గ్రౌండ్స్‌మెన్, స్కోరర్లు సహా ఇతర అధికారులు తిరిగి మ్యాచ్ పనుల్లో నిమగమవుతారు. కానీ తమిళనాడుతో మ్యాచ్‌కు విరామ సమయంలో ఆటగాళ్లు, అంపైర్లకు సైతం భోజనాలు అందించలేకపోయారు. తొలి రెండు రోజు చేదు అనుభవంతో బీసీసీఐకి ఫిర్యాదు చేసిన ఆటగాళ్లు.. భోజనాలు బస చేస్తున్న హౌటల్ నుంచే తెప్పించుకోవాల్సి వచ్చింది. . 'బీసీసీఐ నుంచి మీకు డబ్బులు రావటం లేదా? ఎందుకని భోజనాలు కూడా పెట్టడటం లేదు. నా కెరీర్లో ఇంత చెత్త అనుభవం ఎక్కడా ఎదురుకాలేదు. దీనిపై బోర్డుకు ఫిర్యాదు చేస్తాను. అక్కడ సంజాయిషీ చెప్పుకోండి' అని తమిళనాడుతో రంజీ మ్యాచ్‌కు వచ్చిన బీసీసీఐ అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంజీకి జంబో జట్టు :హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మహ్మద్ అజహరుద్దీన్ సారథ్యంలో సరికొత్త చెత్త రికార్డులు బద్దలు కొడుతోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం రంజీ జట్టుకు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయాలి. కానీ రాజకీయాలు, అవినీతి, రానున్న ఎన్నికల్లో క్లబ్ కార్యదర్శుల ఓట్ల కోసం రంజీ జట్టుకు ఏకంగా 20 మంది క్రికెటర్లను ఎంపిక చేశారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం మ్యాచ్‌కు ముందు 15 మంది ఆటగాళ్లను సమర్పించాలి. డ్రెస్సింగ్‌రూమ్‌లో సైతం 15 మంది ఆటగాళ్లకే చోటు ఉంటుంది. దీంతో తమిళనాడుతో మ్యాచ్‌కు అదనంగా ఎంపిక చేసిన మరో ఐదు మంది క్రికెటర్లను స్టేడియంలోని ఇతర గదుల్లో ఉంచాల్సి వచ్చింది. నేడు ముంబయితో రంజీ మ్యాచ్‌కు సైతం హైదరాబాద్ క్రికెట్ సంఘం 20 మంది ఆటగాళ్లను పంపించింది. అక్కడా డ్రెస్సింగ్‌రూమ్‌లో 15 మంది క్రికెటర్లకే అనుమతి ఇస్తారు. దీంతో మిగిలిన ఐదుగురు ఆటగాళ్లు స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను చూడాల్సిన దుస్థితి ఎదురు కానుంది!.
దిశా నిర్దేశం ఏదీ? : దేశవాళీ సర్క్యూట్లో ఎంత చిన్న జట్టైనా ఏదో ఒక్క లక్ష్యంతో సీజన్‌కు సిద్ధమవుతుంది. ప్లేట్ గ్రూప్‌లో ఆడే జట్లు సైతం వచ్చే సీజన్‌కు ఎలైట్‌కు ఎగబాకాలనే లక్ష్యంతో ఆడతాయి. కానీ ఏ లక్ష్యం లేకుండా ఆడుతున్న జట్టు హైదరాబాద్ మాత్రమే అనిపిస్తుంది. అందుకు కారణాలు సైతం లేకపోలేదు. తమిళనాడుతో మ్యాచ్‌లో హైదరాబాద్ ఎక్కడా విజయం కోసం ఆడాలనే ఆలోచనే చేయలేదు. ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు సాధించినా.. జట్టు ఆలోచన డిఫెన్స్‌లోనే ఉండిపోయింది. ఇక బౌలింగ్ విభాగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. వికెట్లు కూల్చగల సత్తా ఉన్న బౌలర్ జట్టులో ఉన్నాడా? అనే సందేహం కచ్చితంగా కలుగుతుంది. నాణ్యమైన పేసర్, నాణ్యమైన స్పిన్నర్‌కు హైదరాబాద్ జట్టులో చోటు లేదు. జట్టు మేనేజ్మెంట్ ఆటగాళ్లకు దిశా నిర్దేశం చేసినట్టు ఏమాత్రం కనిపించదు.
అక్కడ కన్నేసి.. ఇక్కడ ఆట! : ఇక హైదరాబాద్ రంజీ జట్టులో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ ఆటగాళ్ల వేలంపై కన్నేసి ఆడుతున్నారు. డిసెంబర్ 23న జరుగనున్న ఆటగాళ్ల వేలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఏడుగురు క్రికెటర్లు అందుబాటులో ఉండనున్నారు. దీంతో మ్యాచ్ పరిస్థితులతో సంబంధం లేకుండా దూకుడుగా ఆడేందుకు ఆ ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడుతో మ్యాచ్‌లో సైతం ఇదే జరిగింది. బౌలర్లు సైతం సిక్సర్లు వెళ్తోన్నా.. వికెట్ల కోసం షార్ట్ బంతులు సంధిస్తూనే ఉన్నారు. నేడు ముంబయితో మ్యాచ్‌లోనూ కొందరు ఆటగాళ్లు ఇదే తరహాలో ఆడే అవకాశం కనిపిస్తోంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ధనాధన్‌తో ఐపీఎల్ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు తహతహ లాడుతున్నారు.
పోటీ ఇవ్వగలరా? : రంజీ ట్రోఫీలో భాగంగా నేడు బలమైన ముంబయితో హైదరాబాద్ తలపడనుంది. ఆంధ్ర రంజీ జట్టుపై మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన ముంబయి.. హైదరాబాద్‌పైనా అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు ఎదురుచూస్తోంది. ముంబయి జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉండగా.. హైదరాబాద్ జట్టులో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం కలిగిన ఆటగాడే కరువయ్యాడు. ఇది జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.