Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆల్‌రౌండర్లు హాట్‌కేక్ తరహాలో అమ్ముడైన వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ఆటగాళ్ల మినీ వేలం సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ శామ్ కరణ్ రూ.18.5 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. కామెరూన్ గ్రీన్, బెన్ స్టోక్స్, నికోలస్ పూరన్ సైతం రికార్డు ధర సొంతం చేసుకున్నారు. రూ.13.25 కోట్లతో మినీ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు.
- శామ్ కరణ్ కోసం పంజాబ్ రికార్డు ధర
- గ్రీన్‌కు రూ.17.50 కోట్లు, స్టోక్స్‌కు రూ.16.25 కోట్లు
- పూరన్‌కు రూ.16 కోట్లు, బ్రూక్‌కు రూ.13.25 కోట్లు
నవతెలంగాణ-కోచి
అంచనాలను తగినట్టుగానే, ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆల్‌రౌండర్ల కోసం వెళ్లగా.. 2023 మినీ ఆటగాళ్ల వేలం రికార్డులు బద్దలుకొట్టింది. నాణ్యమైన పేస్ ఆల్‌రౌండర్ల కోసం ఎదురుచూసిన ప్రాంఛైజీలు కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న శామ్ కరణ్‌పై కోట్ల వర్షం కురిపించాయి. రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతమైన శామ్ కరణ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ రూ.17.5 కోట్లతో ముంబయి ఇండియన్స్ సొంతమవగా.. బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లతో చెన్నై సూపర్‌కింగ్స్ గూటికి చేరాడు. నికోలస్ పూరన్‌ను రూ.16 కోట్లతో లక్నో సూపర్‌జెయింట్స్ దక్కించుకోగా.. హ్యారీ బ్రూక్ రూ.13.25 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెంతకు చేరుకున్నాడు. ఐపీఎల్ 2023 ఆటగాళ్ల మినీ వేలంలో 405 మంది క్రికెటర్లు నిలువగా.. 80 మంది అమ్ముడుపోయారు. అందులో 29 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. 80 మంది క్రికెటర్ల కోసం పది ప్రాంఛైజీలు రూ.167 కోట్లు ఖర్చు చేశాయి.
ఆల్‌రౌండర్ల కోసం..
మినీ ఆటగాళ్ల వేలంలో ఎప్పుడైనా ఆల్‌రౌండర్ల వశమే. 2023 వేలం అందుకు భిన్నం కాదు. గాయంతో గత సీజన్లో చెన్నై తరఫున ఆడలేకపోయిన శామ్ కరణ్ వేలంలోకి వచ్చేందుకు మొగ్గుచూపాడు. 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన శామ్ కరణ్ కోసం ప్రాంఛైజీలు ఎగబడ్డాయి. కరణ్ కోసం చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ తుది వరకు పోటీపడినా రూ.18.5 కోట్ల రికార్డు ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ ధరతో విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ కంటే అధిక మొత్తాన్ని కరణ్ అందుకోనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 14 టీ20ల్లో 25 వికెట్లు కూల్చిన కరణ్.. 2020 నుంచి స్పిన్‌పై 31 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 27.07 సగటు, 154 స్ట్రయిక్‌రేట్‌తో మెరిశాడు. దీంతో వేలంలో కరణ్ ధర ఆకాశాన్నంటింది.
ఈ ఏడాది భారత్‌తో టీ20లో సిరీస్‌లో దంచికొట్టిన కామెరూన్ గ్రీన్ ప్రాంఛైజీ దృష్టిలో పడ్డాడు. గ్రీన్ కోసం ముంబయి ఇండియన్స్ గట్టిగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ నుంచి పోటీ ఎదురైనా వెనక్కి తగ్గలేదు. రూ.17.50 కోట్లతో కామెరూన్‌ను దక్కించుకుంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను చెనై సూపర్‌కింగ్స్ తీసుకుంది. ధోనితో కలిసి గతంలో పుణె తరఫున ఆడిన స్టోక్స్ రూ.16.25 కోట్లకు సూపర్‌కింగ్స్ సొంతమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడినా బెన్ స్టోక్స్‌ను చెన్నై వదల్లేదు. సూపర్ కింగ్స్ వేలంలో 80 శాతం బడ్జెట్‌ను స్టోక్స్‌పైనే ఖర్చు చేసింది. కీలక ఆటగాళ్లను వదిలేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. వేలంలో ఆకర్షణీయ బిడ్లు వేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లను కొనుగోలు చేసింది. తొలి సారి ఐపీఎల్లో ఆడనున్న బ్రూక్ రికార్డు ధరతో ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కోసం ఆరెంజ్ ఆర్మీ రూ.8.25 కోట్లు ఖర్చు చేసింది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ కోసం సైతం రూ.5.25 కోట్లు వెచ్చించింది. ఇక హైదరాబాద్ వదిలేసిన నికోలస్ పూరన్ ఊహించని ధర దక్కించుకున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్ పూరన్‌ను రూ.16 కోట్లతో కొనుగోలు చేసింది. యువ పేసర్ శివం మావిని గుజరాత్ టైటాన్స్ రూ.6 కోట్లకు దక్కించుకోగా.. ముకేశ్ కుమార్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ.5.5 కోట్లు వెచ్చించింది. సన్‌రైజర్స్ మాజీ సారథి కేన్ విలియమ్సన్‌ను రూ.1 కనీస ధరకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. జేసన్ హోల్డర్ రూ.5.75 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ సొంతమయ్యాడు.
తెలుగు వెలుగు !
వేలంలో తెలుగు రాష్ట్రాల నుంచి 17 మంది క్రికెటర్లు బరిలో ఉండగా.. నలుగురు మాత్రమే ప్రాంఛై జీలను ఆకర్షించారు. కె.ఎస్ భరత్ రూ.1.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతమయ్యాడు. భగత్ వర్మ, షేక్ రషీద్‌లను రూ.20 లక్షల కనీస ధరతో చెన్నై సూపర్‌కింగ్స్ తీసుకుంది. నితీశ్ కుమార్ రెడ్డిని రూ.20 లక్షల కనీస ధరతో సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నుంచి వేలంలో నమోదైన క్రికెటర్లు ఎవరూ అమ్ముడుపోలేదు.
వేలంలో అమ్ముడైన ఆటగాళ్లు (ధర రూ. కోట్లలో)
చెన్నై సూపర్‌కింగ్స్ : బెన్ స్టోక్స్ (16.25), జెమీసన్ (1.0), నిశాంత్ (0.60), రహానె (0.50), భగత్ వర్మ (0.20), అజరు (0.20), షేక్ రషీద్ (0.20)
ఢిల్లీ క్యాపిటల్స్ : ముకేశ్ కుమార్ (5.50), రౌలీ రొసొ (4.60), మనీశ్ పాండే (2.4), ఫిల్ సాల్ట్ (2.0), ఇషాంత్ శర్మ (0.50)
గుజరాత్ టైటాన్స్ : శివం మావి (6.0), జోశ్ లిటిల్ (4.4), విలియమ్సన్ (2.0), కె.ఎస్ భరత్ (1.20), మోహిత్ శర్మ (0.50), ఒడీన్ స్మిత్ (0.50), ఉర్విల్ పటేల్ (0.20).
కోల్‌కత నైట్‌రైడర్స్ : షకిబ్ (1.5), డెవిడ్ విసే (1.0), జగదీశన్ (0.90), వైభవ్ అరోరరా (0.60), మన్దీప్ సింగ్ (0.50), లిటన్ దాస్ (0.50), కుల్వంత్ (0.20), సుయాశ్ శర్మ (0.20)
లక్నో సూపర్‌జెయింట్స్ : నికోలస్ పూరన్ (16.0), డానియల్ శామ్స్ (0.75), అమిత్ మిశ్రా (0.50), షెఫార్డ్ (0.50), నవీన్ ఉల్ హాక్ (0.50), ఉనద్కత్ (0.50), యశ్ ఠాకూర్ (0.45), స్వప్నిల్ సింగ్ (0.20), యుధ్వీర్ (0.20), ప్రేరక్ (0.20)
ముంబయి ఇండియన్స్ : కామెరూన్ గ్రీన్ (17.50), రిచర్డ్సన్ (1.50), పియూశ్ చావ్లా (0.50), నేహాల్ (0.20), రాఘవ్ (0.20), విష్ణు (0.20), జాన్సెన్ (0.20), ములాని (0.20)
పంజాబ్ కింగ్స్ : శామ్ కరణ్ (18.50), సికందర్ రజా (0.50), భాటియా (0.40), శివం సింగ్ (0.20), కావేరప్ప (0.20), మోహిత్ (0.20)
రాజస్థాన్ రాయల్స్ : జేసన్ హోల్డర్ (5.75), జంపా (1.50), రూట్ (1.0), ఫెరీరా (0.50), అసిఫ్ (0.30), అబ్దుల్ (0.20), ఆకాశ్ (0.20), కునాల్ (0.20), మురుగన్ అశ్విన్ (0.20)
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : విల్ జాక్స్ (3.20), టాప్లీ (1.90), రాజన్ (0.70), అవినాశ్ (0.60), సోను (0.20), హిమాన్షు (0.20), మనోజ్ (0.20)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : హ్యారీ బ్రూక్ (13.25), మయాంక్ (8.25), హెన్రిచ్ క్లాసెన్ (5.25), వివ్రాంత్ (2.6), ఆదిల్ రషీద్ (2.00), మయాంక్ డాగర్ (1.80), అకీల్ హోస్సేన్ (1.00), మయాంక్ మార్కండె (0.50), ఉపేంద్ర (0.25), శాన్విర్ (0.20), అన్మోల్ప్రీత్ (0.20), సమరాత్ (0.20), నితీశ్ కుమార్ రెడ్డి (0.20)