Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పిన్నర్లు చెలరేగిన ఢాకా పిచ్‌పై టీమ్ ఇండియా విలువైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. రిషబ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) ఐదో వికెట్‌కు 159 పరుగుల భారీ భాగస్వామ్యంతో కదం తొక్కారు. 94/4తో కష్టాల్లో పడిన భారత్‌ను ఆదుకున్న జోడీ.. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో దంచి కొట్టింది. ఆధిక్యం ఇరు జట్లతో దోబూచులాడిగా.. పంత్, అయ్యర్ భారత్‌ను ముందంజలో నిలిపారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 314 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 7/0తో ఆడుతోంది. ప్రస్తుతం భారత్ 80 పరుగుల ముందంజలో నిలిచింది.
- పంత్, అయ్యర్ దూకుడు
- భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
- బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు రెండో రోజు
నవతెలంగాణ-ఢాకా
రిషబ్ పంత్ (93, 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (87, 105 బంతుల్లో 10 ఫోరఉల, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో అదరగొట్టారు. రెండో రోజు ఆటలోనే పిచ్ స్పిన్‌కు సహకరించటంతో భారత్‌ను బంగ్లాదేశ్ ఇరకాటంలో పడేసింది. కానీ, బంగ్లాదేశ్‌పై ఎదురుదాడి చేసిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ జోడీ రెండో రోజు ఆటలో టీమ్ ఇండియాను ముందంజలో నిలిపారు. రాహుల్ (10), గిల్ (20), పుజారా (24), కోహ్లి (24) విఫలమైన వేళ పంత్, అయ్యర్ 159 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసిన భారత్.. విలువైన 87 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. బంగ్లాదేశ్ స్ప్నిర్లు షకిబ్ (4/79), తైజుల్ (4/74) నాలుగేసి వికెట్లతో మాయ చేశారు. టీ సెషన్ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 7/0తో ఆడుతోంది. బంగ్లాదేశ్ మరో 80 పరుగుల తొలి ఇన్నింగ్స్ వెనుకంజలో కొనసాగుతోంది.
టాప్ విఫలం : ఓవర్‌నైట్ స్కోరు 19/0తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు తొలి సెషన్లో నిరాశే మిగిలింది. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం వరుస ఓవర్లలో మాయ చేశాడు. కెప్లెన్ కెఎల్ రాహుల్ (10), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (20)ను సాగనంపాడు. ఓ ఎండ్‌లో బంగ్లా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన పుజారా (24)ను సైతం తైజుల్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇన్సైడ్ ఎడ్జ్ బంతిని షార్ట్ లెగ్‌లో మోమినుల్ అందుకున్నాడు. ఇది బంగ్లా శిబిరంలో రెట్టించిన ఉత్సాహానికి దారితీసింది. కోహ్లి, పంత్ జాగ్రత్తగా ఆడటంతో లంచ్ విరామానికి భారత్ 86/3తో నిలిచింది. రెండో సెషన్ ఆరంభంలో విరాట్ (24) సైతం నిష్క్రమించటంతో భారత్ కష్టాల్లో కూరుకుంది. 94/4తో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయేలా కనిపించింది.
దంచి కొట్టారు : స్పిన్ అండతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంపై బంగ్లాదేశ్ కన్నేయగా.. దూకుడు మంత్రతో పంత్, అయ్యర్ భారత్‌కు పైచేయి అందించారు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి చేసిన రిషబ్ పంత్ వేగంగా పరుగులు పిండుకున్నాడు. అయ్యర్ సైతం పంత్‌కు తోడవటంతో పరుగుల వేగం పెరిగింది. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన పంత్ ఆ తర్వాత టాప్ గేర్‌లోకి వచ్చాడు. అయ్యర్ ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఈ జోడీ ధనాధన్ ఇన్నింగ్స్‌లో లంచ్ సెషన్లో భారత్ మరో వికెట్ కోల్పోలేదు. ఐదో వికెట్‌కు ఏకంగా 159 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. పంత్ తనదైన శైలిలో ఐదు సిక్సర్లతో అదరగొట్టాడు. టీ విరామ సమయానికి భారత్ 226/4తో పటిష్ట స్థితిలో నిలిచింది.
షకిబ్ మాయ : చివరి సెషన్లో మళ్లీ బంగ్లాదేశ్ పుంజుకుంది. షకిబ్ అల్ హసన్ మ్యాజిక్కు లోయర్ ఆర్డర్ కుప్పకూలింది. శతకానికి చేరువలో పంత్ (93) మిరాజ్ ఓవర్లో వికెట్ కోల్పోగా.. కొద్దిసేపటికే శ్రేయస్ (87)ను షకిబ్ బోల్తా కొట్టించాడు. అక్షర్ (4), అశ్విన్ (12), సిరాజ్ (7) షకిబ్ మాయలో పడ్డారు. దీంతో 61 పరుగులకే భారత్ చివరి ఐదు వికెట్లను చేజార్చుకుంది. 314 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
స్కోరు వివరాలు :
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 227/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : రాహుల్ (ఎల్బీ) తైజుల్ 10, గిల్ (ఎల్బీ) తైజుల్ 20, పుజారా (సి) మోమినుల్ (బి) తైజుల్ 24, కోహ్లి (సి) నురుల్ (బి) టస్కిన్ 24, పంత్ (సి) నురుల్ (బి) మిరాజ్ 93, శ్రేయస్ (ఎల్బీ) షకిబ్ 87, అక్షర్ (సి) శాంటో (బి) షకిబ్ 4, అశ్విన్ (ఎల్బీ) షకిబ్ 12, ఉనద్కత్ నాటౌట్ 14, ఉమేశ్ (సి) దాస్ (బి) తైజుల్ 14, సిరాజ్ (స్టంప్డ్) నురుల్ (బి) షకిబ్ 7, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (86.3 ఓవర్లలో ఆలౌట్) 314.
వికెట్ల పతనం : 1-27, 2-38, 3-72, 4-94, 5-253, 6-264, 7-271, 8-286, 9-305, 10-314.
బౌలింగ్ : టస్కిన్ అహ్మద్ 15-2-58-1, షకిబ్ 19.3-3-79-4, ఖలీద్ అహ్మద్ 10-1-41-0, తైజుల్ ఇస్లాం 25-3-74-4, మెహిది మిరాజ్ 17-2-61-1.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : నజ్ముల్ శాంటో బ్యాటింగ్ 5, జాకిర్ హసన్ బ్యాటింగ్ 2, ఎక్స్‌ట్రాలు :0, మొత్తం :(6 ఓవర్లలో) 7.
బౌలింగ్ : ఉమేశ్ యాదవ్ 2-1-4-0, అశ్విన్ 3-1-3-0, ఉనద్కత్ 1-1-0-0.
అటో ఇటో తేలేది నేడే!
ఢాకా టెస్టులో భారత్ ముందంజలో కొనసాగుతోంది. కానీ బంగ్లాదేశ్ ఇప్పటికీ రేసులోనే ఉంది. మూడో రోజుకు పిచ్ నుంచి బ్యాటర్లకు సహకారం లభిస్తోంది. పాత బంతిపై పరుగుల వేట సులువుగా మారింది. స్పిన్‌కు సహకరిస్తోన్న పిచ్‌పై భారత్‌కు మూడో స్పిన్నర్ సేవలు అందుబాటులో లేవు. ఇది బంగ్లాదేశ్‌కు అనుకూలంగా మారేందుకు వీలుంది. చివరి సెషన్లో బంగ్లా ఓపెనర్లు ఆరు ఓవర్ల ఉత్కంఠ స్పెల్‌ను ఎదుర్కొన్నారు. పది వికెట్లతో మూడో రోజు బరిలోకి దిగనున్న బంగ్లాదేశ్.. పిచ్ అనుకూలత, భారత్‌కు మూడో స్పిన్నర్ లేని బలహీనతను సొమ్ముచేసుకుంటే మంచి స్కోరు చేసేందుకు ఆస్కారం ఉంది. 200 లక్ష్యం ఈ పిచ్‌పై కఠినంగా సాగవచ్చు. ఇదే బంగ్లాదేశ్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరోవైపు క్లీన్‌స్వీప్ కోసం భారత్ నేడు రెండు సెషన్లలోనే బంగ్లాదేశ్‌ను కట్టడి చేయాలి. లేదంటే, ఆ జట్టును నిలువరించటం కష్టతరం అవుతుంది. శాంటో, జాకిర్, లిటన్, షకిబ్, మిరాజ్‌లను పెవిలియన్‌కు చేర్చగలిగితే ఢాకా టెస్టుపై భారత్ పట్టు నిలుస్తుంది.