Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐకి బైజూస్, ఎంపీఎల్ లేఖ
ముంబయి : కొత్త ఏడాదిలో మూడు దేశాలతో స్వదేశీ సీజన్‌కు సిద్ధమవుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊహించని పరిణామం ఎదురైంది. భారత జట్టు ఇద్దరు కీలక స్పాన్సర్లు ఒప్పందం రద్దు చేసుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఈ బుధవారం సమావేశమైన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటిలో ఈ అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఎంపీఎల్ సంస్థ భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా కొనసాగుతుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఈ రెండు సంస్థలు బీసీసీఐతో స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. బీసీసీఐతో బైజూస్ నవంబర్ 2023 వరకు ఒప్పందం కుదుర్చుకుంది. జెర్సీ స్పాన్సర్‌గా తక్షణమే తప్పుకునేందుకు బైజూస్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. మార్చి 31, 2023 వరకు కొనసాగాలని బీసీసీఐ కోరినట్టు తెలుస్తోంది. ఇక ఎంపీఎల్ తమ స్పాన్సర్‌షిప్‌ను మరో సంస్థ కెకెసిఎల్ (కెవాల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెడ్)కు బదలాయించేందుకు బోర్డుకు లేఖ రాసింది. ఎంపీఎల్‌ను సైతం మార్చి 31, 2023 వరకు కొనసాగాలని కోరినట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్ అనంతరం ఐపీఎల్ ఆరంభం కానుంది. ఆ తర్వాత భారత జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లనుంది. ఈ సమయంలో కొత్త స్పాన్సర్లతో ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో బోర్డు ఉంది. ఇక ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను సైతం బీసీసీఐ అపెక్ కౌన్సిల్ ఖరారు చేయాల్సి ఉంది. నూతన సెలక్షన్ కమిటీ ఎంపికైన అనంతరం కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాపై స్పష్టత రానుంది.