Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ రిఫరీ కౌంటర్
దోహా : 2022 ఫిఫా ప్రపంచకప్ టైటిల్ పోరు సంగ్రామం ముగిసి వారం రోజులైంది. టైటిల్ పోరులో నెలకొన్న నాటకీయత మాత్రం అలాగే కొనసాగుతోంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సి అదనపు సమయంలో చేసిన గోల్‌ను రిఫరీ రద్దు చేయాల్సిందని ఫ్రెంచ్ మీడియా విమర్శలు చేసింది. ప్రపంచకప్ ఫైనల్‌కు రిఫరీగా వ్యవహరించిన సిమోన్ మార్సినియోక్ (పొలాండ్) మీడియా సమావేశంలో విమర్శలకు దీటుగా బదులిచ్చాడు. అదనపు సమయం అనంతరం అర్జెంటీనా, ఫ్రాన్స్ 3-3తో నిలువటంతో ఫలితాన్ని పెనాల్టీ షూటౌట్ ద్వారా తేల్చారు. 4-2తో అర్జెంటీనా విశ్వవిజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. మెస్సి రెండు గోల్స్ కొట్టగా, రెండు పెనాల్టీలతో ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. అదనపు సమయంలో మెస్సి గోల్ చేసినప్పుడు.. బంతి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడానికి ముందే ఇద్దరు అర్జెంటీనా సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెడుతున్న దృశ్యాలతో ఓ ఫ్రెంచ్ పత్రికా వార్త కథనం ప్రచురించింది. ఫ్రెంచ్ మీడియా ఇది చూపించలేదంటూ.. రిఫరీ సిమోన్ మార్సినియోక్ తన ఫోన్లోని ఓ ఫోటోను మీడియాకు చూపించాడు. కిలియన్ ఎంబాపె గోల్ చేసిన సందర్భంలో ఏకంగా ఏడుగురు ఫ్రెంచ్ సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. దీని పట్ల ఎందుకు ఫ్రెంచ్ మీడియా మౌనంగా ఉందని రిఫరీ సిమోన్ ప్రశ్నించారు. నిబంధనలు పాటించకుండా సాగిన ప్రపంచకప్ ఫైనల్‌ను మళ్లీ నిర్వహించాలని ఓ ఆన్లైన్ పిటిషన్‌పై సుమారు 2.2 లక్షల మంది సంతకాలు చేయటం గమనార్హం.