Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. తొలి రెండు రోజుల ఆటలో పైచేయి సాధించిన టీమ్ ఇండియా.. మూడో రోజు ఆతిథ్య బంగ్లాదేశ్‌కు పట్టు కోల్పోయింది. లిటన్ దాస్ (73), జాకిర్ హసన్ (51) అసమాన అర్థ సెంచరీలతో బంగ్లాదేశ్ ఓటమి అంచుల నుంచి.. గెలుపు ఆశల తీరానికి చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులు చేసిన బంగ్లా.. 145 పరుగుల ఊరించే లక్ష్యాన్ని నిర్దేశించింది. స్పిన్ వలలో బ్యాటర్లు చిక్కుకోగా ఛేదనలో భారత్ 45/4తో ఎదురుదీతుంది. భారత్ విజయానికి 100 పరుగులు అవసరం కాగా, బంగ్లాదేశ్‌కు ఆరు వికెట్లు కావాలి. ఉత్కంఠ టెస్టులో విజయం వరించేదెవరినో చూడాలి!.
- రసకందాయంలో ఢాకా టెస్టు
- ఇరు జట్లను ఊరిస్తోన్న విజయం
- 145 పరుగుల ఛేదనలో భారత్ 45/4
నవతెలంగాణ-ఢాకా
టీమ్ ఇండియా వెనుకంజ!. టాప్ ఆర్డర్ బ్యాటర్లు తేలిపోయిన వేళ ఢాకా టెస్టులో భారత్ కష్టాల్లో కూరుకుంది. 145 పరుగుల ఛేదనలో భారత్ 45 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. విరాట్ కోహ్లి (1), కెఎల్ రాహుల్ (2), చతేశ్వర్ పుజారా (6), శుభ్‌మన్ గిల్ (7) చేతులెత్తేయగా.. స్పిన్ మాయతో బంగ్లాదేశ్ గెలుపు ఆశలతో ఉరకలేస్తోంది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (26 బ్యాటింగ్, 54 బంతుల్లో 3 ఫోర్లు), నైట్‌వాచ్‌మన్ జైదేవ్ ఉనద్కత్ (3 బ్యాటింగ్, 8 బంతుల్లో) అజేయంగా ఆడుతు న్నారు. భారత్ విజయానికి మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహిది హసన్ మిరాజ్ (3/12) మాయజాలంతో మెరువగా.. కెప్టెన్ షకిబ్ (1/21) సైతం మ్యాజిక్‌లో జతకట్టాడు. అంతకుముందు, బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్ జాకిర్ హసన్ (51, 135 బంతుల్లో 5 ఫోర్లు), లిటన్ దాస్ (73, 98 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీలతో ఆతిథ్య జట్టును గెలుపు కోసం పోరాడగలిగే స్థితిలో నిలబెట్టారు. తొలుత బ్యాటర్లు, ఆ తర్వాత బౌలర్లు రాణించటంతో మూడో రోజు బంగ్లాదేశ్ స్పష్టమైన పైచేయి సాధించింది.
టాప్ ఆర్డర్ విఫలం
స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై 145 పరుగుల లక్ష్యం. స్వల్ప టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత టాప్ ఆర్డర్ దారుణంగా తేలిపోయింది. బంగ్లాదేశ్ స్పిన్నర్లు మెహిది హసన్, షకిబ్లకు దాసోహం అయిపోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికే వికెట్ ఇచ్చేసిన కెప్టెన్ కెఎల్ రాహుల్ (2) బంగ్లా బ్రేక్‌కు మార్గం సుగమం చేశాడు. మెహిది హసన్‌పై క్రీజు వదిలి ఆడిన గిల్ (7), పుజారా (6) మళ్లీ క్రీజులో అడుగుపెట్టలేదు. విరాట్ కోహ్లి (1) ఆఫ్ స్పిన్ బలహీనతకు మరోసారి వికెట్ చేజార్చుకున్నాడు. 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.
టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఆత్మరక్షణలో పడి వికెట్లు సమర్పించుకోగా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (26 బ్యాటింగ్) ఎదురుదాడి చేశాడు. పరుగుల వేటపై కన్నేసిన అక్షర్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లటంతో పాటు వికెట్‌నూ కాపాడుకున్నాడు. నైట్‌వాచ్‌మన్ జైదేవ్ ఉనద్కత్ (3 బ్యాటింగ్) అక్షర్ పటేల్‌కు చక్కగా సహకరించాడు. మూడో రోజు చివర్లో 23 ఓవర్లలోనే 4 వికెట్లు చేజార్చుకున్న భారత్ 45 పరుగులు చేసింది. విజయానికి టీమ్ ఇండియా మరో 100 పరుగుల దూరంలో నిలిచింది. ఇదే సమయంలో స్పిన్ అస్త్రం అండతో బంగ్లాదేశ్ సిరీస్ సమం చేసేందుకు మరో ఆరు వికెట్ల దూరంలోనే నిలిచింది!.
లిటన్, జాకిర్ అదిరె!
ఓవర్‌నైట్ స్కోరు 7/0తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే ఓపెనర్ శాంటో (5) వికెట్ కోల్పోయింది. మోమినుల్ హాక్ (5), షకిబ్ అల్ హసన్ (13), ముష్ఫీకర్ రహీం (9)లు విఫలమయ్యారు. 87 పరుగుల వెనుకంజలో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బంగ్లాదేశ్.. తొలి ఇన్నింగ్స్ లోటు ఉండగానే టాప్ ఆర్డర్ 4 వికెట్లు చేజార్చుకుంది. ఇక్కడ మ్యాచ్‌ను భారత్ గుప్పిట పట్టినట్టే అనిపించింది. కానీ జాకిర్ హసన్ (51), లిటన్ దాస్ (73) బంగ్లాదేశ్‌ను నిలబెట్టారు. టాప్ ఆర్డర్లో జాకిర్ హసన్ కీలక ఇన్నింగ్స్ నమోదు చేశాడు. మిడిల్ ఆర్డర్లో లిటన్ దాస్ మూడు కీలక భాగస్వామ్యాలతో బంగ్లాదేశ్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. ఏడో వికెట్‌కు టస్కిన్ అహ్మద్ (31 నాటౌట్, 46 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి 60 పరుగులు, ఎనిమిదో వికెట్‌కు నురుల్ హసన్ (31, 29 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 46 పరుగులు జోడించాడు. జాకిర్ హసన్‌తో మరో 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మూడు భాగస్వామ్యాలతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లోటు అధిగమించి.. భారత్‌కు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐదు ఫోర్లతో 129 బంతుల్లో జాకిర్ హసన్ అర్థ సెంచరీ సాధించగా, లిటన్ దాస్ నాలుగు ఫోర్లతో 74 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. నురుల్ హసన్, టస్కిన్ అహ్మద్ విలువైన ఇన్నింగ్స్‌లతో కదం తొక్కగా రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 70.2 ఓవర్లలో 231 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ (3/68), సిరాజ్ (2/41), అశ్విన్ (2/66) రాణించారు.
అతడిపైనే ఆశలు!
విమర్శకు అభిమానం అడ్డుపడుతున్నా.. వాస్తవికత అందుకు ఊతం ఇస్తోంది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు తిరోగమన దిశగా పయనిస్తోందనే అనుమానం కలుగక తప్పదు!. అటు వైట్‌బాల్, ఇటు రెడ్‌బాల్ క్రికెట్లో దూకుడు మంత్ర రాజ్యమేలుతుంటే.. భారత్ రెండింటా ఆచితూచి ఆడాలనే శైలిని వదలటం లేదు. ఈ వైఖరితో వైట్‌బాల్ ఫార్మాట్లో టీ20 ప్రపంచకప్ ఆశలు ఆవిరైపోగా.. రెడ్‌బాల్ ఫార్మాట్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ముంచుకొస్తుంది. బంగ్లాదేశ్‌తో ఢాకా టెస్టులో భారత్ ఇరకాటంలో పడింది. 145 పరుగుల ఛేదనలో ఇప్పటికే 4 కీలక వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 100 పరుగుల దూరంలో నిలిచింది. బాజ్‌బాల్ మంత్ర కొనసాగుతున్న తరుణంలో 23 ఓవర్లలో ధనాధన్ మోత మోగిస్తే మూడో రోజే గెలుపు ముచ్చట ముగిసిపోయేది. కానీ అందుకు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించటంలో భారత బ్యాటర్లు ఆత్మరక్షణ ధోరణిలో ఆడారు. అందుకు భారీ మూల్యం చెల్లించారు. స్పిన్‌కు గొప్పగా అనుకూలించే పిచ్‌పై బ్యాటర్ల వైఫల్యం అర్థం చేసుకోవచ్చు. కానీ లక్ష్య ఛేదనలో డిఫెన్స్ వ్యూహం ఏమాత్రం సమర్థనీయం కాదు.
4 వికెట్ల ఉత్సాహం బంగ్లాదేశ్ గెలుపుపై ఆశలు రెట్టింపు చేసింది. నాల్గో రోజు ఆటలో ఆతిథ్య జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. అయితే, భారత్ అప్పుడే నిరుత్సాహపడాల్సిన పని లేదు. ధనాధన్ మెరుపుల మొనగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. సిరీస్‌లో పంత్‌తో పాటు నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ సైతం అందుబాటులో ఉన్నాడు. టెయిలెండర్లలో రవిచంద్రన్ అశ్విన్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌కు తక్కువగా చూడలేం. పరిస్థితులు బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. రిషబ్ పంత్ క్రీజులోకి వస్తే సమీకరణాలు షరవేగంగా మారిపోతాయి. అతడికి శ్రేయస్ అయ్యర్ తోడైతే క్లీన్‌స్వీప్ విజయం భారత్‌కు లాంఛనమే. అందుకు నేడు బంగ్లాదేశ్ స్పిన్ మాయను తిప్పికొట్టగలమా? ఆసక్తికరం.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 227/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : 314/10
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : శాంటో (ఎల్బీ) అశ్విన్ 5, జాకిర్ (సి) సిరాజ్ (బి) ఉమేశ్ 51, మోమినుల్ (సి) పంత్ (బి) సిరాజ్ 5, షకిబ్ (సి) గిల్ (బి) ఉనద్కత్ 13, ముష్ఫీకర్ (ఎల్బీ) అక్షర్ 9, లిటన్ దాస్ (బి) సిరాజ్ 73, మెహిది హసన్ (ఎల్బీ) అక్షర్ 0, నురుల్ హసన్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 31, టస్కిన్ నాటౌట్ 31, తైజుల్ (ఎల్బీ) అశ్విన్ 1, ఖలీద్ (రనౌట్) 4, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (70.2 ఓవర్లలో ఆలౌట్) 231. వికెట్ల పతనం : 1-13, 2-26, 3-51, 4-70, 5-102, 6-113, 7-159, 8-219, 9-220, 10-231.
బౌలింగ్ : ఉమేశ్ 9-1-32-1, అశ్విన్ 22-2-66-2, ఉనద్కత్ 9-3-17-1, సిరాజ్ 11-0-41-2, అక్షర్ 19.2-1-68-3.
భారత్ రెండో ఇన్నింగ్స్ : శుభ్‌మన్ (స్టంప్డ్) నురుల్ (బి) మెహిది హసన్ 7, రాహుల్ (సి) నురుల్ (బి) షకిబ్ 2, పుజారా (స్టంప్డ్) నురుల్ (బి) మెహిది హసన్ 6, అక్షర్ పటేల్ బ్యాటింగ్ 26, విరాట్ కోహ్లి (సి) మోమినుల్ (బి) మెహిది హసన్ 1, ఉనద్కత్ బ్యాటింగ్ 3, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (23 ఓవర్లలో 4 వికెట్లకు) 45. వికెట్ల పతనం : 1-3, 2-12, 3-29, 4-37.
బౌలింగ్ : షకిబ్ 6-0-21-1, తైజుల్ 8-4-8-0, మెహిది హసన్ 8-3-12-3, టస్కిన్ 1-0-4-0.