Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన
- ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 135/10
విజయనగరం : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఆల్‌రౌండర్ టి. రవితేజ (5/34) మరోసారి నిప్పులు చెరిగాడు. సొంతగడ్డపై అస్సాంపై ఐదు వికెట్లు పడగొట్టిన రవితేజ.. ఆంధ్ర జట్టుపై అదే ప్రదర్శన పునరావృతం చేశాడు. రవితేజకు యువ పేసర్ కార్తికేయ కక్ (3/31) తోడవటంతో రంజీ ట్రోఫీ నాల్గో రౌండ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు అభిషేక్ రెడ్డి (81, 145 బంతుల్లో 15 ఫోర్లు) ఓ ఎండ్‌లో సమయోచిత ఇన్నింగ్స్‌తో మెరిసినా.. సహచర బ్యాటర్లు ఎవరూ సహకరించలేదు. తొలి వికెట్‌కు జ్ఞానేశ్వర్ (9)తో కలిసి 16 ఓవర్లలో 36 పరుగులు జోడించిన అభిషేక్ రెడ్డి ఆంధ్రకు శుభారంభం అందించాడు. జ్ఞానేశ్వర్ వికెట్‌తో ఆంధ్ర పతనం మొదలెట్టిన రవితేజ.. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ హనుమ విహారి (2) నిరాశపరచగా, సీనియర్ బ్యాటర్ రికీ భుయ్ (6) అజయ్ దేవ్ గౌడ్ మెరుపు ఫీల్డింగ్‌తో రనౌట్‌గా నిష్క్రమించాడు. కె.ఎస్ భరత్ (5), కరణ్ షిండె (3), తపస్వి (4), నితీశ్ కుమార్ రెడ్డి (13), శశికాంత్ (1), షోయబ్ (0)లు విఫలమయ్యారు. అభిషేక్ రెడ్డి అర్థ సెంచరీతో ఆంధ్ర మూడంకెల స్కోరు అందుకుంది. టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ తొలి రోజు ఆటలో 51.1 ఓవర్లలో ఆంధ్రను ఆలౌట్ చేసింది.
అగర్వాల్ అవుట్ : తొలి రోజు చివరి సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 79/3తో ఆడుతోంది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌కు మరో 56 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (35, 59 బంతుల్లో 4 ఫోర్లు) మెరుగ్గా ఆడినా.. వికెట్ నిలుపుకోలేదు. ప్రజ్ఞరు రెడ్డి (17)తో కలిసి తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించిన తన్మయ్ హైదరాబాద్‌ను దూకుడుగా నడిపించాడు. స్వల్ప విరామంలో ప్రజ్ఞయ్ రెడ్డి, రోహిత్ రాయుడు (6) సహా తన్మయ్ వికెట్ కోల్పోయిన హైదరాబాద్ తొలి రోజును సంతృప్తిగానే ముగించింది. అలంకృతి అగర్వాల్ (10 నాటౌట్), భవేశ్ సేత్ (4 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు.
స్కోరు వివరాలు :
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ : అభిషేక్ (బి) రవితేజ 81, జ్ఞానేశ్వర్ (సి) భవేశ్ (బి) రవితేజ 9, విహారి (సి) సహాని (బి) రవితేజ 2, రికీ భుయ్ (రనౌట్) 6, శ్రీకర్ భరత్ (బి) కార్తికేయ 5, షిండే (సి) భవేశ్ (బి) రవితేజ 3, తపస్వీ (సి) భవేశ్ (బి) రక్షణ్ 4, శశికాంత్ (సి) రోహిత్ (బి) కార్తికేయ 1, నితీశ్ కుమార్ (సి) సహాని (బి) కార్తికేయ 13, షోయబ్ (బి) రవితేజ 0, సుదర్శన్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (51.1 ఓవర్లలో ఆలౌట్) 135.
వికెట్ల పతనం : 1-36, 2-48, 3-62, 4-67, 5-81, 6-100, 7-111, 8-122, 9-122, 10-135.
బౌలింగ్ : రవితేజ 16-7-34-5, రక్షణ్ రెడ్డి 14-5-30-1, కార్తికేయ 13.1-4-31-3, శశాంక్ 8-2-30-0.
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ : తన్మయ్ (సి) జ్ఞానేశ్వర్ (బి) సుదర్శన్ 35, ప్రజ్ఞయ్ (సి) రషీద్ (బి) శశికాంత్ 17, రోహిత్ (బి) నితీశ్ 6, అలంకృత్ నాటౌట్ 10, భవేశ్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (30 ఓవర్లలో 3 వికెట్లకు) 79.
వికెట్ల పతనం : 1-53, 2-60, 3-74.
బౌలింగ్ : శశికాంత్ 9-3-19-1, సుదర్శన్ 9-1-26-1, నితీశ్ 9-2-26-2, తపస్వి 3-1-2-0.