Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీమ్ ఇండియా తీన్మార్!. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడోసారి భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వర్షం అంతరాయం కలిగించిన చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించిన హర్మన్‌సేన నాకౌట్‌కు చేరుకుంది. 2018, 2020 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీస్‌కు చేరుకున్న భారత్ ముచ్చటగా మూడో వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
- ఐర్లాండ్‌పై 5 పరుగులతో భారత్ పైచేయి
- వర్షం అంతరాయం, డక్‌వర్త్ పద్దతిలో ఫలితం
- ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2023
నవతెలంగాణ-గాబెరా
భారత్ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడోసారి భారత్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. గాబెరాలో సోమవారం జరిగిన గ్రూప్-2 మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ 5 పరుగుల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజయం సాధించింది. గ్రూప్-2లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్న భారత్.. రెండో స్థానంలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నాలుగు విజయాలతో ఇంగ్లాండ్ అగ్రస్థానం సాధించింది. గ్రూప్-1 అగ్రజట్టు ఆస్ట్రేలియాతో భారత్ సెమీఫైనల్లో పోటీపడనుంది. స్మృతీ మంధాన (87, 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ అర్థ సెంచరీతో తొలుత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారీ ఛేదనలో ఐర్లాండ్ మహిళల జట్టు 8.2 ఓవర్లలో 54/2 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం ఆటంకం కలిగించింది. చిరుజల్లులు, బలమైన గాలులతో మొదలైన వర్షం ఎడతెరపి లేకుండా కురిసింది. ఆట పున ప్రారంభమయ్యే పరిస్థితులు లేకపోవటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఛేదనలో ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 59 పరుగులు చేయాలి. కానీ ఐర్లాండ్ 54 పరుగులే చేసింది. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
మంధాన మెరుపుల్
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్ స్మృతీ మంధాన (87) ధనాధన్ ఆరంభాన్ని అందించింది. షెఫాలీ వర్మ (24, 29 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించిన మంధాన.. భారీ స్కోరుకు గట్టి పునాది వేసింది. షెఫాలీ వర్మ సహజశైలికి భిన్నంగా ఆడింది. 29 బంతుల్లో 24 పరుగులే చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13), రిచా ఘోష్ (0) నిరాశపరిచారు. జెమీమా రొడ్రిగస్ (19, 12 బంతుల్లో 3 ఫోర్లు) తోడుగా రెచ్చిపోయిన మంధాన.. 40 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించింది. మంధాన అర్థ శతక ఇన్నింగ్స్‌తో భారత్ మంచి స్కోరు నమోదు చేసింది.
వరుణుడు వచ్చే!
156 పరుగుల లక్ష్యం ఐర్లాండ్‌కు అసాధ్యమైన ఛేదన. ఇన్నింగ్స్ తొలి బంతికే ఆమీ హంటర్ (1) నిష్క్రమించగా.. ఐదో బంతికి ఓర్లా (0) అవుటైంది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. అనూహ్యంగా తెగువ చూపించింది. ఓపెనర్ లెవిస్ (32 నాటౌట్, 25 బంతుల్లో 5 ఫోర్లు) దూకుడుగా పరుగులు సాధించింది. లెవిస్ ఎదురుదాడితో ఐర్లాండ్ వేగంగా పరుగులు పిండుకుంది. లారా డెలానీ (17 నాటౌట్, 20 బంతుల్లో 3 ఫోర్లు) సైతం రాణించింది. దీంతో 8.2 ఓవర్లలో ఆ జట్టు 54 పరుగులు చేసింది. వర్షంతో రద్దుగా ముగిసిన మ్యాచ్‌లో ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పరాజయం పాలైంది.
స్కోరు వివరాలు :
భారత మహిళలు : 155/6 (స్మృతీ మంధాన 87, షెఫాలీ వర్మ 24, రొడ్రిగస్ 19, ఓర్లా 2/22)
ఐర్లాండ్ మహిళలు : 54/2 (గాబీ లెవిస్ 32, లారా డెలానీ 17, రేణుక ఠాకూర్ సింగ్ 1/10)