Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ క్యాపిటల్స్‌కి వరుసగా ఐదో ఓటమి
- విరాట్ కోహ్లి అర్థ శతక విన్యాసం
- మూడు వికెట్లతో మెరిసిన విజయ్
ఐదుకు ఐదు. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఐదో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. లక్ష్యం పెద్దదైనా, చిన్నదైనా.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చేతులెత్తేయటంతో ఆ జట్టు ఐపీఎల్16లో ఐదు మ్యాచులు ఆడినా గెలుపు రుచి చూడలేదు. 175 పరుగుల ఛేదనలో 151 పరుగులకే పరిమితమైంది. పేసర్లు సిరాజ్ (2/23). పార్నెల్ (1/28), విజయ్ కుమార్ వైశాక్ (3/20) రాణించటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లి (50) అర్థ సెంచరీతో తొలుత రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మంచి స్కోరు సాధించింది. సీజన్లో బెంగళూర్‌కు ఇది నాలుగు మ్యాచుల్లో రెండో విజయం.
నవతెలంగాణ-బెంగళూర్ :ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. చిన్నస్వామిలో ఊరించే లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. మహ్మద్ సిరాజ్ (2/23), వేనీ పార్నెల్ (1/28) పవర్‌ప్లేలో క్యాపిటల్స్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేయగా.. విజయ్ కుమార్ వైశాక్ (3/20) మిడిల్ ఓవర్లలో క్యాపిటల్స్ ఆశలను ఆవిరి చేశాడు. సీజన్లో తొలిసారి బెంగళూర్ పేసర్లు కండ్లుచెదిరే ప్రదర్శనతో ఆకట్టుకోగా డుప్లెసిస్‌సేన 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఛేదనలో మనీశ్ పాండే (50, 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (21, 14 బంతుల్లో 3 ఫోర్లు) పోరాటం సరిపోలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ 151 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత ఓవర్లలో 174 పరుగులు సాధించింది. ఓపెనర్ విరాట్ కోహ్లి (50, 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మరో అర్థ శతక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. డుప్లెసిస్ (22), మహిపాల్ (26), మాక్స్వెల్ (24) రాణించారు. అర్థ శతక విన్యాసానికి తోడు మూడు క్యాచులతో విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది ఐదో ఓటమి కాగా, బెంగళూర్‌కు ఇది రెండో విజయం.
సిరాజ్, విజయ్ విజృంభణ :
వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్.. చిన్నస్వామిలో గెలుపు ఖాతా తెరిచేందుకు మంచి అవకాశాలు కనిపించాయి. బెంగళూర్ ఓ మోస్తరు స్కోరు చేయటం, ఆ జట్టు బౌలర్లు ఫామ్‌లో లేకపోవటం క్యాపిటల్స్‌కు కలిసోస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణంగా ఆడారు. పవర్‌ప్లే ముగియకముందే క్యాపిటల్స్ కథ ముగిసింది. తొలి ఓవర్లో పృథ్వీ షా (0) రనౌట్ కాగా.. వరుస ఓవర్లలో మిచెల్ మార్ష్ (0), యశ్ ధుల్ (1)లను పార్నెల్, సిరాజ్‌లు వెనక్కి పంపించారు. ఓ ఎండ్‌లో క్రీజులో కుదురుకున్న కెప్టెన్ డెవిడ్ వార్నర్ (19)ను అరంగేట్ర పేసర్ విజయ్ కుమార్ వైశాక్ సాగనంపాడు. అభిషేక్ పోరెల్ (5) కథ హర్షల్ పటేల్ ముగించగా.. 53 పరుగులకే క్యాపిటల్స్ 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మనీశ్ పాండే (50), అక్షర్ పటేల్ (21) క్యాపిటల్స్‌ను రేసులో నిలిపే ప్రయత్నం చేశారు. కానీ బెంగళూర్ బౌలర్లు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. 100లోపే కుప్పకూలే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 151 పరుగులు చేయటం సైతం గొప్పే అనిపించింది. చివర్లో ఆమన్ హకీం ఖాన్ (18), ఎన్రిచ్ నోకియా (23 నాటౌట్) ఓటమి అంతరాన్ని బాగా కుదించారు. చివరి వికెట్‌కు కుల్దీప్ (7 నాటౌట్), నోకియా అజేయంగా 23 పరుగులు జోడించారు.
మెరిసిన విరాట్ :
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లేలో ఓపెనర్లు నెమ్మదిగానే ఆడారు. కెప్టెన్ డుప్లెసిస్ (22) వికెట్ కోల్పోయిన బెంగళూర్ ఆరు ఓవర్ల అనంతరం 47/1తో నిలిచింది. మిడిల్ ఆర్డర్లో మహిపాల్ (26), మాక్స్వెల్ (24) రాణించారు. ఈ ఇద్దరూ క్రీజులో నిలిచినా వికెట్ కాపాడుకోలేదు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగిన విరాట్ కోహ్లి 33 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అర్థ శతకం అనంతరం కోహ్లి వికెట్ కోల్పోయాడు. షాబాజ్ అహ్మద్ (20 నాటౌట్, 12 బంతుల్లో 3 ఫోర్లు), అనుజ్ రావత్ (15 నాటౌట్, 22 బంతుల్లో 1 ఫోర్) భిన్నమైన ఇన్నింగ్స్‌లతో బెంగళూర్‌కు ఆశించిన ముగింపు ఇవ్వలేదు. డెత్ ఓవర్లలో బెంగళూర్ వరుసగా 2, 5, 7, 8, 12, 8 పరుగులే చేయటం ఆ జట్టును బాగా దెబ్బతీసింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : విరాట్ కోహ్లి (సి) ధుల్ (బి) లలిత్ 50, డుప్లెసిస్ (సి) ఆమన్ (బి) మార్ష్ 22, మహిపాల్ (సి) అభిషేక్ (బి) మార్ష్ 26, మాక్స్వెల్ (సి) వార్నర్ (బి) కుల్దీప్ 24, హర్షల్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 6, షాబాజ్ అహ్మద్ నాటౌట్ 20, దినేశ్ కార్తీక్ (సి) లలిత్ (బి) కుల్దీప్ 0, అనుజ్ నాటౌట్ 15, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174.
బౌలింగ్ : నోకియా 4-0-31-0, అక్షర్ పటేల్ 3-0-25-1, ముస్తాఫిజుర్ 3-0-41-0, మిచెల్ మార్ష్ 2-0-18-2, లలిత్ యాదవ్ 4-0-29-1, కుల్దీప్ యాదవ్ 4-1-23-2.
ఢిల్లీ క్యాపిటల్స్ : డెవిడ్ వార్నర్ (సి) కోహ్లి (బి) విజయ్ 19, పృథ్వీ షా (రనౌట్) 0, మిచెల్ మార్ష్ (సి) కోహ్లి (బి) పార్నెల్ 0, యశ్ ధుల్ (ఎల్బీ) సిరాజ్ 1, మనీశ్ పాండే (ఎల్బీ) డిసిల్వ 50, అభిషేక్ పోరెల్ (సి) పార్నెల్ (బి) హర్షల్ 5, అక్షర్ (సి) సిరాజ్ (బి) విజయ్ 21, ఆమన్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 18, లలిత్ (సి) మాక్స్వెల్ (బి) విజయ్ 4, నోకియా నాటౌట్ 23, కుల్దీప్ నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం : 1-1, 2-1, 3-2, 4-30, 5-53, 6-80, 7-98, 8-110, 9-128. లబౌలింగ్ : సిరాజ్ 4-0-23-2, పార్నెల్ 4-0-28-1, విజయ్ 4-0-20-3, షాబాజ్ 1-0-11-0, హసరంగ 3-0-37-1, హర్షల్ 4-0-32-1.