Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ స్పోర్ట్స్ కోడ్‌ను గౌరవిస్తాను
- బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్
గోండా (ఉత్తరప్రదేశ్) : లైంగిక వేధింపులు, నిధుల దుర్వినియోగం, హత్యాయత్న బెదిరింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్ష పదవికి దూరంగా ఉన్న బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్.. రాబోయే ఫెడరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనని వెల్లడించారు. ఎంసీ మేరీకోమ్ సారథ్యంలోని డబ్ల్యూఎఫ్ఐ పర్యవేక్షణ కమిటీ ఇటీవల విచారణ నివేదికను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు అందజేయగా.. నివేదికలోని అంశాలను మంత్రిత్వ శాఖ కార్యాలయం బయటకు వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఆదివారం భారత రెజ్లింగ్ సమాఖ్య అత్యవసర జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమాఖ్య ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయగా.. 12 ఏండ్లుగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయనని ప్రకటించారు.
పోటీకి అనర్హుడు : బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గత 12 ఏండ్లుగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జాతీయ క్రీడా నిబంధనల ప్రకారం వరుసగా మూడు పర్యాయాలు పదవిలో కొనసాగితే మరోసారి పదవికి పోటీచేసేందుకు అనర్హులు అవుతారు. బ్రిజ్ భూషణ్ గత మూడు పర్యాయాలుగా 12 ఏండ్లు పని చేశారు. ఆఫీస్ బేరర్‌గా పోటీ చేసేందుకు అతడు మరో నాలుగేండ్లు ఎదురు చూడాలి. అధ్యక్ష పదవికి పోటీ చేయకపోయినా.. డబ్ల్యూఎఫ్ఐ వర్గింగ్ కమిటీలో బ్రిజ్ భూషణ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బ్రిజ్ భూషణ్ తనయుడు ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు కరణ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ' రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయను. కానీ ఎన్నికల్లో పోటీ చేస్తాను. డబ్ల్యూఎఫ్ఐతో నాతో బంధం కొనసాగుతుంది. జాతీయ స్పోర్ట్స్ కోడ్‌ను గౌరవిస్తాను. నా తనయుడు సమాఖ్య నిబంధనల మేరకు పని చేశాడు. సాక్షి మాలిక్ సహా ఇతర రెజ్లర్లు నాపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదం. నేను వేధింపులకు గురి చేస్తే వారి వివాహానికి ఎందుకు ఆహ్వానించారు? నా ఇంటికి వచ్చి నా కొడుకు, కోడలుతో కలిసి ఆతిథ్యం ఎలా స్వీకరించారు?. ఒలింపిక్ సంఘం, పర్యవేక్షణ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యాను. నాలుగు వారాల పాటు పదవి బాధ్యతలకు దూరంగా ఉండాలని క్రీడాశాఖ లిఖితపూర్వకంగా కోరింది. తర్వాత మరో రెండు వారాలు కొనసాగించారు. ఆ సమయం ముగిసింది. డబ్య్లూఎఫ్ఐ అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించకుండా నన్ను ఎవరూ ఆపలేరు' అని బ్రిజ్ భూషణ్ అన్నారు.
ఈ ఏడాది మే 7న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరుగనున్నాయి. ఓవైపు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనపై నియమించిన పర్యవేక్షణ కమిటీ నివేదికను అందజేసినా.. వివరాలు బయటకు రాలేదు. క్రీడాశాఖ నుంచి డబ్ల్యూఎఫ్ఐ ఆఫీస్ బేరర్ల గురించి తదుపరి సమాచారం రాకుండానే బ్రిజ్‌భూషణ్ ఏకంగా అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశాడు. దీనిపై క్రీడాశాఖ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.