Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాధ్యతలు కొందరికి భారంగా అనిపిస్తే, ఆ బాధ్యతలే కొందరిలో ఉత్తమ ప్రదర్శన బయటకుతీస్తాయి. సూర్యకుమార్ యాదవ్ (43) విషయంలో ఇదే రుజువైంది. కెరీర్ తీవ్ర వైఫల్యంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ తొలిసారి కెప్టెన్‌గా అదరగొట్టాడు. సారథ్య బాధ్యతలు సూర్యలో పాత విధ్వంసకుడిని బయటపెట్టాయి!. ఇషాన్ కిషన్ (58) సైతం అర్థ సెంచరీతో మెరవటంతో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కోల్‌కత బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (104) శతక విధ్వంసం వృథా అయ్యింది.
- ఛేదనలో సూర్యకుమార్, ఇషాన్ మెరుపులు
- వెంకటేశ్ అయ్యర్ శతక విధ్వంసం వృథా
- కోల్‌కతపై ముంబయి ఇండియన్స్ గెలుపు
నవతెలంగాణ-ముంబయి
ముంబయి ఇండియన్స్ మరో విజయం సాధించింది. జోరుమీదున్న కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 186 పరుగుల ఛేదనలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (58, 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (43, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (30, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కదం తొక్కారు. 17.4 ఓవర్లలోనే ముంబయి ఇండియన్స్ లాంఛనం ముగించి సీజన్లో రెండో విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 185/6 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ (104, 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) శతక విధ్వంసంతో చెలరేగాడు. ముంబయి బౌలర్ల దెబ్బకు కోల్‌కత బ్యాటర్లు చేతులెత్తేసినా.. వెంకటేశ్ అయ్యర్ వన్ మ్యాన్ షోతో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు మంచి స్కోరు అందించాడు.
మెరిసిన సూర్య, కిషన్ : 186 పరుగుల ఛేదనలో ముంబయికి మెరుపు ఆరంభం దక్కింది. రోహిత్ శర్మ (20), ఇషాన్ కిషన్ (58) పవర్‌ప్లేలో ధనాధన్ జోరు చూపించారు. ఓపెనర్ల మెరుపులతో ఆరు ఓవర్లలోనే ముంబయి 72 పరుగులు పిండుకుని, ఈ సీజన్లోనే పవర్‌ప్లేలో ఉత్తమ ప్రదర్శన చేసింది. ఇషాన్ కిషన్ ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతోనే 50 పరుగులు పూర్తి చేశాడు. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (43) ఫామ్‌లోకి వచ్చాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో మెప్పించాడు. తెలుగు తేజం తిలక్ వర్మ (30, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సూర్య.. ముంబయి ఇండియన్స్ విజయాన్ని లాంఛనం చేశాడు. చివర్లో సూర్య, తిలక్ నిష్క్రమించినా.. టిమ్ డెవిడ్ (24 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మరో 14 బంతులు మిగిలిఉండగానే ముంబయికి విజయాన్ని అందించాడు. కోల్‌కత బౌలర్లలో సుయాశ్ శర్మ (2/27) రాణించాడు.
అయ్యర్ అదుర్స్ : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కత నైట్‌రైడర్స్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ ఎన్.జగదీశన్ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. మరో ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ (8) క్రీజులో నిలిచినా.. పరుగుల వేటలో నిరాశపరిచాడు. వెంకటేశ్ అయ్యర్ (104) వన్ మ్యాన్ షోతో కోల్‌కత ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పవర్‌ప్లే అనంతరం కోల్‌కత 57/2తో నిలువగా.. అందులో సింహాభాగం పరుగులు వెంకటేశ్ అయ్యర్ సాధించినవే!. ఓ వైపు సహచర బ్యాటర్లు ముంబయి బౌలర్లకు దాసోహం అవుతుండగా.. మరో ఎండ్‌లో వెంకటేశ్ అయ్యర్ భిన్నమైన ప్రదర్శన చేశాడు. ముంబయి బౌలర్లపై పంజా విసిరిన అయ్యర్ నాలుగు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. వెంకటేశ్ అయ్యర్ దూకుడుతో కోల్‌కత నైట్‌రైడర్స్ భారీ స్కోరు దిశగా సాగుతున్నప్పటికీ.. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం కొరవడింది. కెప్టెన్ నితీశ్ రానా (5), శార్దుల్ ఠాకూర్ (13), రింకూ సింగ్ (18) నిరాశపరిచారు. ఒంటరి పోరాటం చేసిన వెంకటేశ్ అయ్యర్ ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 49 బంతుల్లోనే శతకం సాధించాడు. ఈ సీజన్ ఆరంభం నుంచీ గొప్ప ఫామ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ కెరీర్లో తొలి వంద పరుగుల ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు. మూడంకెల స్కోరు అందుకోగానే వెంకటేశ్ అయ్యర్ నిష్క్రమించాడు. చివర్లో అండ్రీ రసెల్ (21 నాటౌట్, 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన ముగింపు అందించాడు. మంబయి ఇండియన్స్ బౌలర్లలో హృతిక్ షోకిన్ (2/34) రెండు వికెట్లతో మెరువగా.. డ్యూన్ జాన్సెన్ (1/53) ధారాళంగా పరుగులు సమర్పించాడు. 20 ఓవర్లలో 6 వికెట్లకు కోల్‌కత నైట్‌రైడర్స్ 185 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 203.92 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేయగా.. మిగతా కోల్‌కత నైట్‌రైడర్స్ బ్యాటర్లు అందరూ కలిసి 97 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించారు.
స్కోరు వివరాలు :
కోల్‌కత నైట్‌రైడర్స్ : రెహ్మనుల్లా గుర్బాజ్ (సి) జాన్సెన్ (బి) చావ్లా 8, జగదీశన్ (సి) హృతిక్ (బి) కామెరూన్ గ్రీన్ 0, వెంకటేశ్ అయ్యర్ (సి) జాన్సెన్ (బి) రిలె మెరెడిత్ 104, నితీశ్ రానా (సి) రమణ్‌దీప్ (బి) హృతిక్ 5, శార్దుల్ ఠాకూర్ (సి) తిలక్ వర్మ (బి) హృతిక్ 13, రింకూ సింగ్ (సి) నేహల్ (బి) జాన్సెన్ 18, రసెల్ నాటౌట్ 21, సునీల్ నరైన్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 185.
వికెట్ల పతనం : 1-11, 2-57, 3-73, 4-123, 5-159, 6-172.
బౌలింగ్ : అర్జున్ టెండూల్కర్ 2-0-17-0, కామెరూన్ గ్రీన్ 2-0-20-1, డ్యూన్ జాన్సెన్ 4-0-53-1, పియూశ్ చావ్లా 4-0-19-1, హృతిక్ షోకీన్ 4-0-34-2, రిలె మెరెడిత్ 4-0-40-1.
ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ (సి) ఉమేశ్ యాదవ్ (బి) సుయాశ్ శర్మ 20, ఇషాన్ కిషన్ (బి) వరుణ్ చక్రవర్తి 58, సూర్యకుమార్ యాదవ్ (బి) గుర్బాజ్ (బి) శార్దుల్ 43, తిలక్ వర్మ (బి) సుయాశ్ 30, టిమ్ డెవిడ్ నాటౌట్ 24, నేహల్ (సి) గుర్బాజ్ (బి) ఫెర్గుసన్ 6, కామెరూన్ గ్రీన్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (17.4 ఓవర్లలో 5 వికెట్లకు)
వికెట్ల పతనం : 1-65, 2-87, 3-147, 4-176, 5-184.
బౌలింగ్ : ఉమేశ్ యాదవ్ 2-0-19-0, శార్దుల్ ఠాకూర్ 2-0-25-1, సునీల్ నరైన్ 3-0-41-0, సుయాశ్ శర్మ 4-0-27-2, వరుణ్ చక్రవర్తి 4-0-38-1, లాకీ ఫెర్గుసన్ 1.4-0-19-0, అండ్రీ రసెల్ 1-0-17-0.
సూర్య సారథ్యం
పేలవ ఫామ్‌తో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్లో తొలిసారి సారథ్య పగ్గాలు అందుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడటంతో సూర్యకుమార్ యాదవ్ కోల్కతతో మ్యాచ్‌లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. వరుస వైఫల్యాలు చవిచూసిన సూర్యకుమార్ సారథ్యంతో మళ్లీ పూర్వ వైభవం దిశగా ముందడుగు వేశాడు. నైట్‌రైడర్స్‌పై మెరుపు ఇన్నింగ్స్ నమోదు చేసిన సూర్య విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.
అమ్మాయిల జెర్సీతో..
ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ముంబయి ఇండియన్స్ మహిళల జట్టు జెర్సీతో బరిలోకి దిగారు. ముంబయి ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఫౌండేషన్ బాలికల విద్య కోసం కృషి చేస్తున్న నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌కు మెన్స్ జట్టు అమ్మాయిల జెర్సీ ధరించింది. వివిధ ఎన్జీవోల ద్వారా సుమారు 19,000 మంది బాలికలు ముంబయి ఇండియన్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ మ్యాచ్‌కు హాజరయ్యారు. దీంతో కోల్కతతో మ్యాచ్‌కు సాధారణ అభిమానులకు ఎటువంటి టిక్కెట్లు అందుబాటులో ఉంచలేదు. పూర్తిగా అమ్మాయిలతో వాంఖడే మైదానం నిండిపోయింది. 2023 డబ్ల్యూపీఎల్ విజేత, ముంబయి ఇండియన్స్ మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తోడుగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్కు వచ్చారు.