Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెలక్షన్ కమిటీలో ప్రస్తుతం నలుగురే
- దృష్టి సారించని భారత క్రికెట్ బోర్డు
న్యూఢిల్లీ : ఐసీసీ టోర్నమెంట్లకు భారత క్రికెట్ జట్టు ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతోంది. గత ఆసియా కప్, గత రెండు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లకు పూర్తి స్థాయి సెలక్షన్ కమిటీ లేకుండానే జట్లను ఎంపిక చేశారు. తాజాగా ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ముంగిట సైతం సీనియర్ సెలక్షన్ కమిటీకి సారథి లేకుండా పోయాడు. ఓ టెలివిజన్ చానెల్ స్టింగ్ ఆపరేషన్ ఫలితంగా చేతన్ శర్మ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో చేతన్ శర్మ రాజీనామా ఆమోదించిన బీసీసీఐ కార్యదర్శి జై షా ఆమోదించారు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీకి నూతన చైర్మెన్‌ను ఎంపిక చేసే బాధ్యతను బోర్డు విస్మరించింది.
ఆసియా కప్ ముంగిటే! : ఈ ఏడాది జూన్ తొలి వారంలో ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. లండన్‌లోని ది ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు డబ్ల్యూటీసీ గద కోసం పోటీపడనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 7 తుది గడువు. బీసీసీఐ మే 7న భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. మే 22 వరకు జట్టులో మార్పులు చేర్పులకు ఐసీసీ అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ బిజీలో ఉన్న భారత క్రికెట్ యంత్రాగానికి చీఫ్ సెలక్టర్ ఎంపిక ఇప్పుడు ప్రాధాన్యత అంశంగా కనిపించటం లేదు. దీంతో సెప్టెంబర్‌లో ఆసియా కప్‌కు ముందు మాత్రమే చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక చేసేందుకు అవకాశం కనిపిస్తోంది. చేతన్ శర్మ రాజీనామాతో శివ్ సుందర్ దాస్ తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా కొనసాగుతున్నారు. శివ్ సుందర్ దాస్ ప్యానల్ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు జట్టును ఎంపిక చేయనుంది. 'సరైన సమయంలో చీఫ్ సెలక్టర్ ఎంపికపై నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు దానిపై తొందర లేదు. టెస్టుల్లో భారత్‌కు కుదురైన జట్టు ఉంది. ప్రస్తుత సెలక్షన్ కమిటీకి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టును ఎంపిక చేసే సామర్థ్యం ఉంది. గాయాలు, ఫిట్నెస్, ఫామ్ ఇలా అన్ని అంశాలపై ప్రస్తుత ప్యానల్‌కు పూర్తి అవగాహన ఉందని' బీసీసీఐ ఆఫీస్ బేరర్ ఒకరు తెలిపారు.
చరిష్మా ఉన్నవారేరీ? : కొంతకాలంగా భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ పదవి చేపట్టే వ్యక్తుల అర్హతలపై చర్చ నడుస్తోంది. చీఫ్ సెలక్టర్ స్థాయి వ్యక్తులు పదవిలో ఉండటం లేదని క్రికెట్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అందుకు బీసీసీఐ చెల్లిస్తున్న వేతనమే కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. బీసీసీఐ సెలక్టర్లకు రూ.90 లక్షల వేతనం దక్కుతుండగా, చీఫ్ సెలక్టర్ రూ.1 కోటి అందిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో విశేష అనుభవం కలిగిన మాజీ క్రికెటర్లకు ఐపీఎల్ వ్యాఖ్యాతలుగా మూడు నెలల్లోనే ఇంతకంటే ఎక్కువ ఆదాయం దక్కుతోంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సైతం వ్యాఖ్యాతలుగా ఆకర్షణీయ మొత్తం ఆర్జిస్తున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌కు అందిస్తున్న వేతనంలో మార్పు చేయకుంటే.. చరిష్మా కలిగిన మాజీ క్రికెటర్లు ఎవరూ ఆ పదవిపై ఆసక్తి చూపరని గతంలో హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించారు. విరుద్ద ప్రయోజనాల నిబంధన సైతం కొందరి విషయంలో అడ్డుగా కనిపిస్తుందనే వాదన వినిపిస్తోంది.