Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రస్థానంపై రాయల్స్, జెయింట్స్ గురి
- నేడు రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో ఢీ
నవతెలంగాణ-జైపూర్
రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్.. ఐపీఎల్16లో ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించిన అగ్ర జట్లు. ఇటు రాయల్స్, అటు జెయింట్స్ నాలుగేసి విజయాలు సాధించినా.. రెండు జట్ల శైలి పూర్తి భిన్నం. విరుద్ధ మ్యాచ్ ప్రణాళికలతో విజయవంతంగా విజయాలు నమోదు చేస్తున్న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ నేడు అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి. నెట్ రన్‌రేట్‌తో ప్రస్తుతం రాయల్స్ నం.1గా కొనసాగుతున్నప్పటికీ.. నేటి మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో స్పష్టమైన నం.1ను నిర్ణయించనుంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ నేడు ముఖాముఖి తలపడనున్నాయి.
పైచేయి ఎవరిదో? : ఐపీఎల్15 రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లోనూ అదరగొట్టే ప్రదర్శనలు చేస్తుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు, స్పిన్నర్లు ఆ జట్టు విజయాల్లో కీలక భూమిక వహిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ టాప్-4 బ్యాటర్ల స్ట్రయిక్‌రేట్ దాదాపు 150గా ఉంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోశ్ బట్లర్ ధనాధన్ ఆరంభాలు ఇవ్వటంలో నిలకడ చూపిస్తున్నారు. కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. షిమ్రోన్ హెట్మయర్ సంచలన ఇన్నింగ్స్ జోరుమీదున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆశలు ఆవిరైన వేళ హెట్మయర్ అసమాన బాదుడు రాయల్స్‌ను విజేతగా నిలిపింది. ఈ ఉత్సాహంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను నిలువరించటం లక్నోకు కష్టసాధ్యమైన సవాలే. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, ఆడం జంపా, యుజ్వెంద్ర చాహల్‌ల 12 ఓవర్లను ఎదుర్కొవటం లక్నోకు అతి పెద్ద సవాల్. చెన్నై సూపర్‌కింగ్స్‌పై చివరి ఓవర్లో ఒత్తిడిని అధిగించిన సందీప్ శర్మ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ట్రెంట్ బౌల్ట్‌తో కలిసి సందీప్ శర్మ మరోసారి కొత్త బంతిని పంచుకునేందుకు సిద్ధమవుతున్నాడు.