Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెపాక్‌లో తొలి విజయంపై హైదరాబాద్ గురి
- నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్ పోరు
నవతెలంగాణ-చెన్నై
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలకడలేని ప్రదర్శన ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. వరుస విజయాలతో ఊపందుకున్న ఆరెంజ్ ఆర్మీ.. సొంతగడ్డపై మరో ఓటమితో నిరాశపరిచింది. ఐదు మ్యాచుల్లో రెండు విజయాలే సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు కీలక పరీక్షకు సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం స్పిన్ సవాల్ ఎదురు చూస్తుంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెపాక్‌లో మూడు మ్యాచులు ఆడింది. ఆ మూడు మ్యాచుల్లో హైదరాబాద్‌కు పరాజయమే ఎదురైంది. దీంతో ఎం.ఎ చిదంబరం స్టేడియంలో అగ్ర జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌పై తొలి విజయంపై కన్నేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ నేడు ముఖాముఖి తలపడనున్నాయి.
స్పిన్ వర్సెస్ స్పిన్
చెపాక్ పిచ్ స్పిన్ స్వర్గధామం. ఇక్కడ చెన్నై సూపర్‌కింగ్స్‌కు తిరుగులేని రికార్డుంది. ఈ సీజన్లో ధోనీసేన చెపాక్‌లో రెండు మ్యాచులే ఆడింది. అందులో ఓ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. స్పిన్ పోరులో రాయల్స్ ముగ్గురు ప్రపంచ శ్రేణి స్పిన్నర్లను ప్రయోగించింది. అశ్విన్, చాహల్, ఆడం జంపాలు సూపర్‌కింగ్స్‌ను మాయ చేసేందుకు చూశారు. ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లను ఆడించినా చివరి బంతి ఉత్కంఠకు దారితీసిన మ్యాచ్‌లో రాయల్స్ కేవలం 3 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. హైదరాబాద్ తరఫున వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండె, ఆదిల్ రషీద్, అకీల్ హోసేన్ స్పిన్నర్లు. వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్లో 11 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ పడగొట్టలేదు. మయాంక్ మార్కండె ఆకట్టుకుంటున్నాడు. ఆదిల్ రషీద్ జట్టు కూర్పులో భాగంగా బెంచ్‌కు పరిమితం అయ్యాడు. స్పిన్ టెస్టు కోసం హైదరాబాద్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకుంటుందా? లేదా అనేది ఆసక్తికరం. ఈ సీజనోల చెపాక్‌లో స్పిన్నర్లు 8.13 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టగా.. 10.66 ఎకానమీతో పేసర్లు 11 వికెట్లే తీసుకున్నారు.
ఇక సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ స్పిన్ కష్టాలు సూపర్‌కింగ్స్‌కు బాగా తెలుసు. కోల్‌కతపై శతకం సాధించినా.. స్పిన్నర్లపై బ్రూక్ ఆధిపత్యం చూపించలేదు. దీంతో బ్రూక్ కోసం పవర్‌ప్లేలోనే స్పిన్నర్లను బరిలోకి దింపేందుకు సూపర్‌కింగ్స్ సిద్ధమవుతోంది. రవీంద్ర జడేజా, మోయిన్ అలీలకు తోడు మహీశ్ తీక్షణ.. అవసరమైతే మిచెల్ శాంట్నర్ మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పవర్‌ప్లే ప్రదర్శన సైతం ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. పవర్‌ప్లేలో 7.13 రన్‌రేట్‌తో సన్‌రైజర్స్ చెత్త గణాంకాలు నమోదు చేయగా.. 9.86 రన్‌రేట్‌తో సూపర్‌కింగ్స్ టాప్‌లో నిలిచింది. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానెలు చెన్నైకి కీలకం కానుండగా.. కెప్టెన్ ఎడెన్ మార్క్రామ్, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్‌లు సన్‌రైజర్స్‌కు కీలకం.