Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ట్విట్టర్ షాకిచ్చింది. శుక్రవారం ఉదయం తమ ట్విట్టర్ ఖాతాలకు ఉన్న బ్లూ టిక్‌ను కోల్పోయారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు అందుకున్న తర్వాత మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ట్విట్టర్ వెరిఫైడ్ బ్లూటిక్ కావాలనుకున్నవారు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందేనని మస్క్ తొలుత ప్రకటించారు. అయితే, ధోనీ, కోహ్లీ, రోహిత్ ఇతర ట్విట్టర్ యూజర్లు సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. ఫలితంగా వారి ప్రొఫైల్స్ నుంచి తాజాగా బ్లూటిక్ ఎగిరిపోయింది. వెరిఫైడ్ బ్లూటిక్ కోసం యూజర్లు డబ్బులు చెల్లించాల్సిందేనని, చెల్లించని వారి ప్రొఫైల్స్ నుంచి బ్లూటిక్ మార్క్‌ను తీసేస్తామని ట్విట్టర్ ఇటీవల తెలిపింది. అంతకుముందు వెరిఫికేషన్ టిక్ ఇవ్వడానికి వేరే కారణం ఉందని కూడా పేర్కొంది. కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, ఇతర క్రికెటర్లకు ఉన్న 'లెగసీ బ్లూటిక్' కారణంగా ట్విట్టర్లో వారు మరింతగా దూసుకుపోతున్నారు. అయితే, శుక్రవారం ఉదయం వారి ప్రొఫైల్స్ నుంచి అకస్మాత్తుగా అవి మాయమయ్యాయి. ట్విట్టర్ మస్క్ చేతికి చిక్కాక బ్లూటిక్ పెయిడ్ సర్వీస్‌గా మారింది. యూజర్లకు బ్లూటిక్ కావాలంటే ఇండియాలో అయితే నెలకు రూ.900 సమర్పించుకోవాల్సిందే. అదే వెబ్‌లో అయితే ఈ ఫీజు నెలకు రూ.650గా ఉంది. రూ.6,800 చెల్లించి ఏడాదిపాటు ట్విట్టర్ ప్రీమియం సేవలను పొందొచ్చు. అంటే నెలకు దాదాపు రూ.566 పడుతుంది. అయితే, ఈ ప్లాన్ వెబ్‌కు మాత్రమే పరిమితం. ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు తదితరులకు ట్విట్టర్ గతంలో తనంత తానుగానే బ్లూటిక్ ఇచ్చేది. ఇప్పుడు దానిని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. ట్విట్టర్ బ్లూ సబ్స్క్రైబర్లు 4 వేల క్యారెక్టర్ల వరకు టెక్ట్స్ పంపించుకోవచ్చు. ఇతరులు మాత్రం 280 క్యారెక్టర్లకు మించి పంపలేరు. అంతేకాదు, బ్లూ సబ్స్క్రైబర్లు 60 నిమిషాల నిడివి ఉన్న వీడియో లేదంటే 2జిబి వరకు ఉన్న వీడియోను కూడా పంపుకోవచ్చు.