Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్-16లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది.. గుజరాత్ టైటాన్స్ గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ ముందుంచిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి ఓవర్లలో చాకచక్యంగా ఆడి గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో కెఎల్ రాహుల్ (68 పరుగులు, 61 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించినా ఫలితం లేకుండాపోయింది. కైల్ మేయర్స్ (24), కృనాల్ పాండ్య (23) మెరుపులు వృథా అయ్యాయి. నికోలస్ పూరన్ (1) విఫలమయ్యాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్, మోహిత్ శర్మ చెరో రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా (47 పరుగులు, 37 బంతుల్లో 6 ఫోర్లు), హార్దిక్ పాండ్య (66 పరుగులు, 50 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. శుభ్‌మన్ గిల్ (0), అభినవ్ మనోహర్ (3), విజరు శంకర్ (10), మిల్లర్ (6) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య, స్టొయినిస్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ ఒక్కో వికెట్ తీశారు.