Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ చతికిల
- 7 పరుగులతో బెంగళూర్ విజయం
- రాణించిన మాక్స్వెల్, డుప్లెసిస్
ఐపీఎల్ బ్యాటర్ల విధ్వంసక విన్యాసాల స్థానంలో బౌలర్ల మెరుపులు కనిపిస్తున్నాయి. ఐపీఎల్16లో వరుసగా బౌలర్లు స్వల్ప, సవాల్‌తో కూడిన స్కోర్లను కాపాడుకుంటున్నారు. తాజాగా బలమైన బ్యాటింగ్ విభాగం గల రాజస్థాన్ రాయల్స్‌పై 189 పరుగులను రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ నిలుపుకుంది. ఛేదనలో బౌలర్లు మెరువగా రాయల్స్ 182 పరుగులకే పరిమితమైంది. 7 పరుగుల తేడాతో రాయల్స్‌పై బెంగళూర్ రాయల్ విక్టరీ నమోదు చేసింది.
నవతెలంగాణ-బెంగళూర్
ఐపీఎల్లో బౌలర్ల అద్బుతాలు కొనసాగుతున్నాయి. 190 పరుగుల ఛేదనలో యశస్వి జైస్వాల్ (47, 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (52, 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) జోడీ 98 పరుగుల భాగస్వామ్యంతో చెలరేగారు. యశస్వి, పడిక్కల్ భాగస్వామ్యంతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ బెంగళూర్ బౌలర్లు హర్షల్ పటేల్ (3/32), డెవిడ్ విల్లే (1/26) విజృంభించారు. చివర్లో ధ్రువ్ జురుల్ (34 నాటౌట్, 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం దక్కలేదు. 7 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూర్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. డుప్లెసిస్ (62, 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ మాక్స్వెల్ (77, 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. విరాట్ కోహ్లి (0) సున్నా పరుగులకే నిష్క్రమించి నిరాశపరిచాడు. గ్లెన్ మాక్స్వెల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
యశస్వి, పడిక్కల్ మెరిసినా.. : రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 190. ఓపెనర్, స్టార్ బ్యాటర్ జోశ్ బట్లర్ (0) అవుటైనా.. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (47, 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (52, 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ దంచికొట్టారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. పడిక్కల్ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్ (22), షిమ్రోన్ హెట్మయర్ (3)లు కీలక సమయంలో వికెట్లు కోల్పోయారు. ధ్రువ్ జురెల్ (34 నాటౌట్, 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా అశ్విన్ తొలి మూడు బంతులకు 4, 2, 4తో మ్యాచ్‌ను రక్తి కట్టించాడు. కానీ నాల్గో బంతికి అశ్విన్ నిష్క్రమించగా.. మ్యాచ్ బెంగళూర్ వైపు మొగ్గింది. చివరి రెండు బంతులకు రాజస్థాన్ రెండు పరుగులే చేసింది. ఫామ్‌లో ఉన్న బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు చివరి ఓవర్లో స్ట్రయిక్ లభించలేదు. కరీబియన్ ఆల్‌రౌండర్ జేసన్ హౌల్డర్ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రాలేదు. వ్యూహాత్మక తప్పిదాలకు రాజస్థాన్ రాయల్స్ తగిన మూల్యం చెల్లించుకుంది. హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. డెవిడ్ విల్లే మెరుపు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
మాక్స్వెల్, డుప్లెసిస్ దూకుడు : తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు ఇన్నింగ్స్ తొలి బంతికే గట్టి ఎదురుదెబ్బ. కెప్టెన్ విరాట్ కోహ్లి (0) ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్ట్ నిష్క్రమించాడు. నం.3 బ్యాటర్ షాబాజ్ అహ్మద్ (2) సౌతం నిరాశపరిచాడు. విరాట్, షాబాజ్ అవుటైనా.. డుప్లెసిస్ (62), గ్లెన్ మాక్స్వెల్ (77) రెండో వికెట్‌కు 127 పరుగుల శతక భాగస్వామ్యం నమోదు చేశారు. ఇటు డుప్లెసిస్, అటు మాక్స్వెల్ ధనాధన్ దంచికొట్టడంతో బెంగళూర్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. పవర్‌ప్లేలో 62 పరుగులు జోడించిన బెంగళూర్.. డుప్లెసిస్, మాక్స్వెల్ నిష్క్రమణ తర్వాత లయ తప్పింది. మాక్స్వెల్ ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 27 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. డుప్లెసిస్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. 10 ఓవర్లలో బెంగళూర్ 100 పరుగులు సాధించింది. కానీ ఆ తర్వాత బెంగళూర్ బ్యాటర్లు పరుగుల వేటలో విఫలమయ్యారు!. మహిపాల్ (8), దినేశ్ కార్తీక్ (16), వానిందు హసరంగ డిసిల్వ (6), డెవిడ్ విల్లే (4 నాటౌట్), సిరాజ్ (1 నాటౌట్) అంచనాలను అందుకోలేదు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (2/41), సందీప్ శర్మ (2/49), అశ్విన్ (1/36), చాహల్ (1/28) రాణించారు.
స్కోరు వివరాలు :
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : విరాట్ కోహ్లి (ఎల్బీ) బౌల్ట్ 0, డుప్లెసిస్ (రనౌట్) 62, షాబాజ్ అహ్మద్ (సి) యశస్వి (బి) బౌల్ట్ 2, గ్లెన్ మాక్స్వెల్ (సి) హౌల్డర్ (బి) అశ్విన్ 77, మహిపాల్ (సి) పడిక్కల్ (బి) చాహల్ 8, దినేశ్ కార్తీక్ (సి) బట్లర్ (బి) సందీప్ శర్మ 16, ప్రభుదేశారు (రనౌట్) 0, వానిందు హసరంగ (రనౌట్) 6, డెవిడ్ విల్లే నాటౌట్ 4, విజరు కుమార్ (సి) హెట్మయర్ (బి) సందీప్ శర్మ 0, మహ్మద్ సిరాజ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 189.
వికెట్ల పతనం : 1-0, 2-12, 3-139, 4-156, 5-163, 6-163, 7-180, 8-184, 9-184.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-0-41-2, సందీప్ శర్మ 4-0-49-2, అశ్విన్ 4-0-36-1, చాహల్ 4-0-28-1, జేసన్ హౌల్డర్ 4-0-32-0.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్ (సి) కోహ్లి (బి) హర్షల్ పటేల్ 47, జోశ్ బట్లర్ (బి) మహ్మద్ సిరాజ్ 0, దేవదత్ పడిక్కల్ (సి) కోహ్లి (బి) విల్లే 52, సంజు శాంసన్ (సి) షాబాజ్ (బి) హర్షల్ పటేల్ 22, షిమ్రోన్ హెట్మయర్ రనౌట్ 3, ధ్రువ్ జురెల్ నాటౌట్ 34, అశ్విన్ (సి)ప్రభుదేశారు (బి) హర్షల్ ఫటేల్ 12, అబ్దుల్ బసిత్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182.
వికెట్ల పతనం : 1-1, 2-99, 3-108, 4-125, 5-155, 6-180.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 4-0-39-1, డెవిడ్ విల్లే 4-0-26-1, విజరు కుమార్ 2-0-24-0, గ్లెన్ మాక్స్వెల్ 2-0-25-0, హర్షల్ పటేల్ 4-0-32-3, వానిందు హసరంగ 4-0-32-0.