Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజృంభించిన భువనేశ్వర్ కుమార్
- ఢిల్లీ క్యాపిటల్స్ 144/9
నవతెలంగాణ-హైదరాబాద్ : వాషింగ్టన్ సుందర్ (3/28) మ్యాజిక్ చేశాడు. ఐపీఎల్16లో ఆరు మ్యాచుల్లో ఒక్క వికెట్ పడగొట్టని వాషింగ్టన్ సుందర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాయజాలం సృష్టించాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్ సుందర్ ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్ (2/11) సైతం నిప్పులు చెరగాడు. దీంతో సోమవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులే చేసింది. మనీశ్ పాండే (34, 27 బంతుల్లో 2 ఫోర్లు), అక్షర్ పటేల్ (34, 34 బంతుల్లో 4 ఫోర్లు), మిచెల్ మార్ష్ (25, 15 బంతుల్లో 5 ఫోర్లు) ఢిల్లీ క్యాపిటల్స్‌కు గౌరవప్రద స్కోరు అందించారు.
ఢిల్లీ ఢమాల్ :
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు సన్‌రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన భువనేశ్వర్ కుమార్.. క్యాపిటల్స్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. కానీ తర్వాత మార్కో జాన్సెన్ ఓవర్లో మిచెల్ మార్ష్ (25) బౌండరీల మోత మోగించాడు. జాన్సెన్ ఓవర్లో 19 పరుగులు పిండుకున్న మార్ష్ ఢిల్లీకి ధనాధన్ ఆరంభం అందించాడు. జోరుమీదున్న మార్ష్‌ను నటరాజన్ రివ్యూ సాయంతో ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపించగా.. ఢిల్లీకి దిమ్మతిరిగే షాక్ వాషింగ్టన్ సుందర్ ఇచ్చాడు. సీజన్లో తొలి సిక్సర్ వాషింగ్టన్ సుందర్‌పై బాదిన డెవిడ్ వార్నర్ అతడిపై స్లాగ్ షాట్‌కు వెళ్లి వికెట్ కోల్పోయాడు. అదే ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్ (10) స్వీప్ షాట్‌తో, ఆమన్ హకీమ్ ఖాన్ (4) స్లాగ్ షాట్‌కు ప్రయత్నించి డగౌట్ బాట పట్టారు. సీజన్లో ఇప్పటివరకు ఒక్క వికెట్ పడగొట్టని వాషింగ్టన్ సుందర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒకే ఓవర్లో మూడు వికెట్లతో మెరుపు మాయ ప్రదర్శించాడు. వాషింగ్టన్ మాయజాలంతో ఢిల్లీ క్యాపిటల్స్ విలవిల్లాడింది. 62/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న క్యాపిటల్స్‌ను మనీశ్ పాండే (34), అక్షర్ పటేల్ (34) ఆదుకున్నారు. పాండే, పటేల్ ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. మార్కండె ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన అక్షర్ పటేల్ డెత్ ఓవర్లలో ఇన్నింగ్స్‌కు ఊపుతీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అక్షర్, మనీశ్ స్వల్ప విరామంలో వెనుదిరిగటంతో క్యాపిటల్స్ కథ మొదటికొచ్చింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు ఆ జట్టు 144 పరుగులే చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లు రాణించారు. కెప్టెన్ ఎడెన్ మార్క్రామ్, ఉమ్రాన్ మాలిక్ సైతం ఆకట్టుకున్నారు.