Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్టార్ రెజ్లింగ్ క్రీడాకారులు మూడు నెలలుగా చేస్తున్న న్యాయ పోరాటానికి అర్థమే లేకుండా పోయింది!.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని మల్లయోధులు పట్టుబట్టగా..
భాజపా ఎంపీని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కమిటీ పేరుతో కాలయాపన చేస్తోంది.
- డబ్ల్యూఎఫ్ఐ మే 7 ఎన్నికల షెడ్యూల్ రద్దు
- రెజ్లింగ్ సమాఖ్యకు అడ్హాక్ కమిటీ ఏర్పాటు
- ఒలంపిక్ సంఘానికి క్రీడాశాఖ మార్గనిర్దేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మరో కమిటీని నియమించేందుకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) సోమవారం కేంద్ర క్రీడాశాఖ ఓ లేఖ రాసింది. రెజ్లింగ్ సమాఖ్యలో నిధుల దుర్వినియోగం, అధ్యక్షుడు సహా కోచ్‌ల లైంగిక వేధింపులు, వ్యక్తిస్వామ్యం పట్ల విచారణ జరిపిన ఎంసీ మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీ సమర్పించిన నివేదికను బయటపెట్టడంతో పాటు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భారత రెజ్లర్లు రెండు రోజులుగా జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5న మేరీకోమ్ కమిటీ నివేదిక అందజేసినా, రెజ్లింగ్ ఫెడరేషన్ వ్యవహారాలను తిరిగి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆధీనంలోకి వెళ్లినా.. ఇప్పటివరకు నోరుమెదపని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా రెజ్లర్లు మళ్లీ ఆందోళన బాట పట్టడంతో మరో కమిటీ ఏర్పాటుకు ఆదేశించారు. రెజ్లర్ల డిమాండ్లను నెరవేర్చకుండా క్రీడాశాఖ మరో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం పట్ల మల్లయోధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియన్, సోమ్‌వీర్ రాటి, జితేందర్ కిన్హా సహా పలువురు రెజ్లింగ్ క్రీడాకారులు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు.
అడ్హాక్ కమిటీ వేయండి :
ఏప్రిల్ 5న ఎంసీ మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీ విచారణ నివేదికను అందజేసింది. నివేదిక చేతికంది సుమారు మూడు వారాలు కావస్తున్నప్పటికీ ఆ విషయంలో క్రీడాశాఖ అధికారులు ఎటువంటి ఆసక్తి చూపించలేదు. పర్యవేక్షణ కమిటీలోని సభ్యులు బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు అనుకూలంగా వ్యవహరించా నే ఆరోపణలు వచ్చినప్పటికీ క్రీడాశాఖ పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. విచారణ నివేదికను క్రీడాశాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, ఈ లోగా నివేదికలోని ప్రాథమిక అంశాల ఆధారంగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు ఓ లేఖ రాసింది. అందులో పలు అంశాలను ప్రస్తావించింది. విచారణ నివేదిక ఆధారంగా భారత రెజ్లింగ్ ఫెడరేషన్లో ఫిర్యాదులకు ఓ వ్యవస్థ లేదు. లైంగిక వేధింపుల పరిష్కారానికి సైతం రెజ్లింగ్ సమాఖ్యలో వ్యవస్థీకృత యంత్రాంగం లేదు. రెజ్లింగ్ ఫెడరేషన్‌కు క్రీడాకారులకు మధ్య కమ్యూనికేషన్, పారదర్శకత లోపించింది. నివేదిక అందజేయగానే మేరీకోమ్ కమిటీ గడువు ముగిసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మే 7న ఎన్నిక ల షెడ్యూల్ ప్రకటించినట్టు మీడియా, వెబ్సైట్ ద్వారా తెలిసింది. ఆ ఎన్నిక షెడ్యూల్‌ను రద్దు చేస్తున్నాం. రెజ్లింగ్ సమాఖ్య భారత ఒలింపిక్ సంఘంలో భాగం. అందుకే, ఆ స్పోర్ట్స్ ఫెడరేషన్ వ్యవహారాలను చూసేందుకు ఐఓఏ ఓ కమిటీని నియమించాలి. ఆ కమిటీ ఏర్పాటైన 45 రోజుల్లో ఎన్నికలను నిర్వహించాలి. ఈ సమయంలో రెజ్లింగ్ సమాఖ్య టోర్నీలు, ట్రయల్స్ నిర్వహణ, క్రీడాకారుల ఎంపికి బాధ్యతలు అడ్హాక్ కమిటీ చూసుకోవాలి. ఈ దిశగా భారత ఒలింపిక్ సంఘం చర్యలు తీసుకో వాలని లేఖలో క్రీడాశాఖ కార్యదర్శి కోరారు. ఈ విషయాన్ని ఐఓఏ అధ్యక్షురాలు పి.టి ఉష ట్విట్టర్లో వెల్లడించింది. అడ్హాక్ కమిటీ ఏర్పాటు సహా పలు అంశాలను ఏప్రిల్ 27న జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చిస్తామని తెలిపింది.
రెజ్లర్ల అసంతృప్తి :
బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా.. అతడికి అనుకూలంగా నివేదికను తొక్కిపెట్టడం, మరో కమిటీ ఏర్పాటు చేయటం పట్ల రెజ్లింగ్ క్రీడాకారులు అసంతృప్తితో ఉన్నారు. మూడు నెలలు క్రితం క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. తాజాగా, క్రీడాశాఖ మరోసారి రెజ్లర్ల డిమాండ్లను పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని మల్లయోధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 ఏండ్లు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్ నిబంధనల ప్రకారం ఈ సారి ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత కోల్పోయాడు. దీంతో అతడి కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ ఈసారి అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకోసం బ్రిజ్‌భూషణ్ ఇప్పటికే యంత్రాంగం సిద్ధం చేశాడు. క్రీడాశాఖ మంత్రి, విచారణ కమిటీలో పలువురు సభ్యులపై ఆందోళన చేస్తున్న రెజ్లర్లు విశ్వాసం కోల్పోయారని తెలుస్తోంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సైతం రెజ్లర్ల ఆందోళనపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు మళ్లీ రెజ్లింగ్ సమాఖ్య బాధ్యతలు ఐఓఏకు అప్పగించారు. ఏర్పాటు కాబోయే అడ్ హాక్ కమిటీలోనూ అధికార బిజెపికి చెందిన సభ్యులే అధికంగా ఉండనుండటంతో సహజంగానే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను కాపాడటమే వారి ప్రథమ కర్తవ్యంగా ఉంటోంది. ఇప్పటికే మేరీకోమ్ కమిటీలో ఈ పరిస్థితిని రెజ్లర్లు చవిచూశారు. దీంతో రెజ్లర్లు ఆందోళన కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.
ఫిర్యాదు అందినా చర్యలేవీ :
ఇక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బిజెపి ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని జాతీయ మహిళా కమిషన్‌కు సైతం తెలియజేశారు. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రెజ్లర్లు కోరుతున్నా ఢిల్లీ పోలీసులు చర్యలకు సిద్ధపడటం లేదు. మరోవైపు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భజరంగ్, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌లు సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేశారు. ఎంసీ మేరీకోమ్ నివేదిక ఆధారంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఫిర్యాదుపై ముందుకెళ్తామని ఢిల్లీ పోలీసులు ఆ నివేదిక కోసం క్రీడామంత్రిత్వ శాఖను సంప్రదించినట్టు తెలుస్తుంది.
ఇక కదం తొక్కుదాం!
- అందరి మద్దతు కోరిన రెజ్లర్లు
రెజ్లర్లు వర్సెస్ బాహుబలి, పోడియం టూ ఫుట్‌పాత్.. ప్లకార్డులతో మల్లయోధులు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. జనవరిలో తొలిసారి బ్రిజ్‌భూషణ్ నియంతృత్వ ఆగడాలపై గళమెత్తిన మల్లయోధులు.. అప్పుడు రాజకీయ పార్టీలు, రెజ్లింగ్యేతర క్రీడాకారులు మద్దతు అందించినా.. నిరాకరించారు. లైంగిక వేధింపుల అంశాన్ని రాజకీయం చేయటం ఇష్టం లేదని, రెజ్లర్లమే న్యాయ పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. మూడు నెలల్లోనే రెజ్లర్ల స్వరం మారింది. న్యాయం చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం.. మాట నిలబెట్టుకోలేదు. ఎవరి వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగామో.. వారి కనుసన్నల్లోనే మరో దశాబ్ద కాలం రెజ్లింగ్ సమాఖ్య పగ్గాలు వెళ్తున్న సంకేతాల నేపథ్యంలో రెజ్లర్లు ఆందోళన పథం మార్చారు.
ఈసారి అన్ని రాజకీయ పార్టీలు, రెజ్లింగ్యేతర క్రీడాకారులు సహా అంతర్జాతీయ క్రీడా సమాజం నుంచి సైతం రెజ్లర్లు మద్దతు కోరుకుంటున్నారు. అధికారం అండతో రెచ్చిపోతున్న వ్యక్తిపై పోరాటంలో సత్యం, నిజాయితీ మాత్రమే సరిపోవని ఇంకా శక్తి కావాలని రెజ్లర్లు భావిస్తున్నారు. అందుకోసం వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలు సోషల్ మీడియా వేదికగా అన్ని వర్గాల మద్దతు కోరుతున్నారు. రైతుల నుంచి మహిళల వరకు ఎవరైనా రెజ్లర్ల న్యాయ పోరాటంలో భాగస్వామ్యమై కదం తొక్కవచ్చని సాక్షి మాలిక్ కోరింది.
అంతర్జాతీయ వేదికపై భారత్ గర్వపడే విజయాలు సాధించిన స్టార్ రెజ్లర్లు రోడ్డుమీదకు వచ్చినా కేంద్ర ప్రభుత్వం చలించటం లేదు. దీంతో మల్లయోధులు రాత్రి జంతర్‌మంతర్ వద్దే నిద్రకు ఉపక్రమించారు. ఈ దృశ్యాలను చూసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవటం శోచనీయం. దేశానికి పతకాలు సాధించిన మహిళా అథ్లెట్ల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినా ఎటువంటి చర్యలు లేకపోతే.. ఇక దేశంలో సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉందో ఊహించగలమని మల్లయోధులు ఆవేదన వ్యక్తం చేశారు.