Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన గిల్, మిల్లర్, మనోహర్
- ముంబయిపై గుజరాత్ గెలుపు
నవతెలంగాణ-అహ్మదాబాద్
గుజరాత్ టైటాన్స్ ఐదో విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసిన టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 208 పరుగుల భారీ ఛేదనలో ముంబయి ఇండియన్స్ చేతులెత్తేసింది. రోహిత్ శర్మ (2), ఇషాన్ కిషన్ (13), తిలక్ వర్మ (2), టిమ్ డెవిడ్ (0) విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (33, 26 బంతుల్లో 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (23, 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), నేహల్ వాదెర (40, 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఓటమి అంతరాన్ని కుదించారు. 59 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకున్న ముంబయి ఇండియన్స్ 152/9 పరుగులు చేయటమే గొప్ప!. ముంబయి ఇండియన్స్‌కు ఇది నాల్గో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 207/6 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (56, 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో చెలరేగాడు. డెవిడ్ మిల్లర్ (46, 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభినవ్ మనోహర్ (42, 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగారు.
చివర్లో చెడుగుడు
వృద్దిమాన్ సాహా (4) , కెప్టెన్ హార్దిక్ పాండ్య (13) ఆరంభంలోనే నిష్క్రమించినా.. విజరు శంకర్ (19) తోడుగా శుభ్‌మన్ గిల్ (56) నిలకడగా రాణించాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 బంతుల్లో అర్థ సెంచరీ కొట్టాడు. 13 ఓవర్లలోపే టాప్-4 బ్యాటర్లను కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాత రెచ్చిపోయింది. డెవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) ఐదో వికెట్‌కు వేగంగా 71 పరుగులు జోడించారు. రాహుల్ తెవాటియ (20 నాటౌట్) ఎదుర్కొన్న ఐదు బంతుల్లో ఏకంగా మూడింటిని సిక్సర్లుగా మలిచాడు. మిల్లర్, మనోహర్, తెవాటియ వీరవిహారంతో టైటాన్స్ చివరి ఏడు ఓవర్లలో 104 పరుగులు పిండుకుంది.
స్కోరు వివరాలు :
గుజరాత్ టైటాన్స్ : 207/6 (శుభ్‌మన్ గిల్ 56, మిల్లర్ 46, మనోహర్ 42, చావ్లా 2/34) ముంబయి ఇండియన్స్ :152/9 ( నేహల్ 40, కామెరూన్ గ్రీన్ 33, సూర్య 23, నూర్ 3/37)