Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దంచికొట్టిన మేయర్స్, బదాని, స్టోయినిస్, పూరన్
- పంజాబ్ కింగ్స్‌పై లక్నో భారీ విజయం
నవతెలంగాణ-మొహాలి
లక్నో సూపర్‌జెయింట్స్ సూపర్ వేగంతో పరుగులు పిండుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు సాధించింది. 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బాదిన 263/5 రికార్డు స్కోరుకు 5 పరుగుల దూరంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (54, 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆయుశ్ బదాని (43, 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ స్కోరుకు గట్టి పునాది వేయగా.. మార్కస్ స్టోయినిస్ (72, 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (45, 19 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రికార్డు స్కోరు అందించారు. రికార్డు ఛేదనలో పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు కుప్పకూలింది. 56 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది.
దంచికొట్టారు : కెప్టెన్ కెఎల్ రాహుల్ (12) త్వరగా నిష్క్రమించినా.. ఆయుశ్ బదాని (43)తో కలిసి ఓపెనర్ కైల్ మేయర్స్ (54) దండెత్తాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 20 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు మేయర్స్. మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో బదాని సైతం పోటాపోటీగా బాదాడు. బదాని, మేయర్స్ బాదుడుకు 7.4 ఓవర్లలోనే లక్నో 100 పరుగుల మార్క్ దాటింది. మార్కస్ స్టోయినిస్ (72), నికోలస్ పూరన్ (45) పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. స్టోయినిస్ సిక్సర్లు, ఫోర్లతో దండయాత్ర చేయగా.. నికోలస్ పూరన్ సహజశైలికి భిన్నంగా బౌండరీలతోనే విశ్వరూపం దాల్చాడు. స్టోయినిస్ 31 బంతుల్లో అర్థ సెంచరీ సాధించినా.. ఆ తర్వాత మెరుపు వేగం అందుకున్నాడు. 15.5 ఓవర్లలో 200, 19.2 ఓవర్లలో 250 పరుగుల మార్క్ దాటిన లక్నో.. ఐపీఎల్ రికార్డు స్కోరు బద్దలు కొట్టేలా కనిపించింది. 14 సిక్సర్లు, 27 ఫోర్లతో 192 పరుగులు పిండుకున్న లక్నో సూపర్‌జెయింట్స్.. ఈ సీజన్లో అత్యధిక స్కోరు రికార్డు సొంతం చేసుకుంది. పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (0/29) ఆకట్టుకున్నాడు.