Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు
- సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసుల్లో కదలిక
- మే 4న కేసు పురోగతిపై సుప్రీంకోర్టు విచారణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంట్ సభ్యుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు, 40 వరకు క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత రెజ్లర్లు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో బిజెపి ఎంపీపై కేసు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు అంగీకారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నాం సుప్రీంకోర్టు ఆదేశించగా.. ఢిల్లీ పోలీసులు శుక్రవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సుప్రీం పర్యవేక్షణ! : భారత రెజ్లింగ్ క్రీడాకారుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున ది సోలిసిటర్ జనరల్ (ఎస్జి) తుషార్ మెహతా ధర్మాసనం ముందు హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ నరసింహలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం రెజ్లర్ల పిటిషన్‌ను విచారించింది. ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చట్టపర చర్యలు తీసుకునేందుకు వీలుగా ధర్మాసనం పోలీసులను ఆదేశించాలని కపిల్ సిబల్ కోరారు. 'బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు బెయిల్‌కు వీలులేని నేరంగా ఢిల్లీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని' ఎస్జి తుషార్ మెహతా తెలిపారు. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని కపిల్ సిబల్ కోరగా.. ఆ సంగతి ఢిల్లీ పోలీసులకు వదిలేయాలని ఎస్జి వాదించారు. మే 4 న కేసు పురోగతి సమీక్షిస్తామని, విచారణ నివేదికతో వచ్చే శుక్రవారం సిద్ధంగా ఉండాలని ధర్మాసనం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. పిటిషనులో పేర్కొన్న మైనర్ రెజ్లర్, ఇతర ఆరుగురు రెజ్లర్ల పేర్లను గోప్యంగా ఉంచాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజరు అరోరాను సుప్రీంకోర్టు ఆదేశించింది.
భద్రత కల్పించండి : బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో పిటిషను దాఖలు చేసిన వారికి పూర్తి రక్షస్త్రణ కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ ఆదేశించారు. మైనర్ రెజ్లర్‌కు తక్షణమే పూర్తి భద్రత ఇవ్వండి. పిటిషనులోని మరో ఆరుగురు రెజ్లర్లకు ఉన్న ముప్పుపై ఓ అవగాహనకు వచ్చి తగు విధంగా భద్రత కల్పించాలని పోలీసులను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. బ్రిజ్ భూషణ్ కేసును స్వయంగా పర్యవేక్షించాలని సుప్రీంకోర్టును కపిల్ సిబల్ కోరగా.. అందుకు ఎస్జి తుషార్ మెహతా విభేదించారు. 'ఆర్టికల్ 32 ప్రకారం ప్రతి కేసులోనూ సుప్రీంకోర్టును ఆశ్రయించటం, విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణ కోరటం పరిపాటిగా మారింది. న్యాయస్థానం పర్యవేక్షణకు వ్యతిరేకం కాదు. కానీ ఇతర మార్గాలు ఉన్నప్పటికీ ప్రతి కేసులోనూ ఇలా కోరటం అలవాటైందని' తుషార్ మెహతా వాదించారు. 'బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఐపీసీ 302 (బెయిల్‌కు ఆస్కారం లేని) సహా ఇతర సెక్షన్ల కింద 40 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. లైంగిక వేధింపులపై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని' కపిల్ సిబల్ గుర్తు చేశారు. అయితే, మే 4న ఈ కేసు విచారణ పురోగతిని సుప్రీంకోర్టు ముందుంచాలని ఢిల్లీ పోలీసులను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదుతో ఢిల్లీ పోలీసులు చేతులు దులుపుకునే పరిస్థితి లేకుండా పోయింది.
' రెజ్లర్లు ఒలింపిక్ పతకాలు సాధించి దేశానికి వన్నె తెచ్చినప్పుడు మనం అందరు సంబురం చేసుకున్నాం. ఇప్పుడు రెజ్లర్ల న్యాయ పోరాటంలో అండగా నిలబడి మద్దతు తెలుపుదాం. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను పారదర్శకంగా విచారణ జరిపి, న్యాయం జరిగేలా చూడాలి'
- కెటిఆర్, రాష్ట్ర మంత్రి