Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం గర్వపడే విజయాలు సాధించిన రెజ్లర్లు న్యాయం కోసం నేడు రోడ్డుమీదకు వస్తే ప్రధాన మంత్రి, ప్రభుత్వ యంత్రాంగం, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిందితుడిని రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. యావత్ దేశం, ప్రజానీకం మల్లయోధులకు మద్దతిచ్చి, న్యాయం జరిగే వరకు అండగా నిలబడేందుకు సిద్ధమని భరోసా కల్పిస్తుండగా రెజ్లర్ల ఆందోళన ఏడో రోజుకు చేరుకుంది. రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేసిన బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను కాపాడుతున్న కేంద్ర ప్రభుత్వం, బిజెపిపై ఢిల్లీ సిఎం, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కేంద్ర ప్రభుత్వం, బిజెపిపై కేజ్రివాల్, ప్రియాంక గాంధీ ఆగ్రహం
- రెజ్లర్లకు మద్దతు తెలిపిన ఢిల్లీ సిఎం, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి
- జంతర్‌మంతర్ వద్ద ఏడో రోజు రెజ్లర్ల నిరసన
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆగడాలపై భారత స్టార్ రెజ్లింగ్ క్రీడాకారుల ఆందోళన ఏడో రోజుకు చేరుకుంది. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దే 24 గంటల నిరసన దీక్షలో కూర్చున్న మల్లయోధులు.. బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను జైలుకు పంపించే వరకు దీక్ష స్థలి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్ భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా.. బిజెపి ఎంపీని అరెస్టు చేయటంపై ఢిల్లీ పోలీసులు ఆసక్తి చూపించటం లేదు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను జైలుకు పంపటంతో పాటు లైంగిక వేధింపులు, ఇతర ఆగడాలకు అతడికి ఊతం అందిస్తున్న అధికారాన్ని సైతం దూరం చేయాలని మల్లయోధులు పట్టుబడుతున్నారు. రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు ఉధృత రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, జాతీయ కాంగెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం రెజ్లర్లను జంతర్ మంతర్ వద్ద కలిసి మద్దతు ప్రకటించారు.
బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు కాపాడుతున్నారు?!
శనివారం ఉదయమే జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌తో సుదీర్ఘంగా మాట్లాడింది. ప్రియాంక వెంట రాజ్యసభ ఎంపీ దీపెందర్ హుడా ఉన్నారు. ఈ విషయంలో రెజ్లర్లకు ప్రధాన మంత్రి నరెంద్ర మోడి న్యాయం చేస్తాడనే అంచనాలు ఏమాత్రం లేవన్న ప్రియాంక.. నిందితులను కేంద్ర ప్రభుత్వం, బిజెపి ఎందుకు కాపాడుతున్నాయని ప్రశ్నించారు. 'ఈ అమ్మాయిలు (రెజ్లర్లు) పతకాలు సాధించినప్పుడు నాతో సహా అందరం ట్వీట్ చేస్తాం. రెజ్లర్లు దేశానికి గర్వకారణమని పొగుడుతాం. కానీ ఇప్పుడు అదే రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డు మీదకు వచ్చారు. ఈ సమయంలో రెజ్లర్ల ఆవేదన ఎవరూ వినటం లేదు. రెజ్లర్లు దేశానికి ఎంతో చేశారు. రెజ్లర్ల తరఫున నిలబడకుండా.. కేంద్ర ప్రభుత్వం బ్రిజ్ భూషణ్‌ను రక్షిస్తుంది. మన అమ్మాయిలను మనం కాపాడకపోతే.. మనం దేశం గురించి ఏమంటారు?!. ప్రధాన మంత్రి మోడికి ఏమాత్రం చలనం ఉన్నా.. ఇప్పటికే రెజ్లర్లకు కనీసం ఫోన్ చేసి మాట్లాడేవారు. పతకాలు సాధించినప్పుడు టీ టాక్‌కు పిలిచే ప్రధాన మంత్రి.. సమస్యల్లో ఉన్నప్పుడు కూడా పట్టించుకోవాలి. మహిళా రెజ్లర్లు ఎంతో ధైర్యశాలులు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం రెజ్లర్ల పక్షాన నిలువకపోయినా.. యావత్ దేశం, ప్రజలు రెజ్లర్ల తరఫున ఉన్నారు. బ్రిజ్‌భూషణ్ అధికారంలో ఉన్నంతకాలం రెజ్లర్లను ఒత్తిడికి గురి చేస్తాడు. కెరీర్ నాశనం చేసేందుకు ప్రయత్నిస్తాడు. బ్రిజ్‌భూషణ్ అధికారంలోనే కొనసాగితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేసినా ఏం ఉపయోగం? ప్రభుత్వ యంత్రాంగం దేశ క్రీడాకారులను కాకుండా ఓ నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని' ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
దేశం చూస్తోంది!
ప్రధానమంత్రి నరెంద్ర మోడి సహా ప్రభుత్వం యం త్రాంగం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను కాపాడేందుకు పని చేస్తోంది. రెజ్లర్ల ఆందోళన విషయంలో ఏం జరుగుతుందో యావత్ దేశం గమనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. 'లైంగిక వేధింపుల ఆరోపణలపై బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనా.. అతడిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతుల ఆందోళన సందర్భంగా ఏం జరిగిందో చూశాం. వాహనంతో రైతులను తొక్కించిన బిజెపి నాయకుడి కోసం ప్రభుత్వ యంత్రాంగం పని చేసింది. ఇప్పుడు రెజ్లర్ల ఆందోళనలోనూ అదే చూస్తున్నాం. దేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడు రెజ్లర్ల తరఫున నిలబడ్డాడు. రెజ్లర్లకు మద్దతుగా జంతర్‌మంతర్ వద్ద దీక్షకు తరలి రండి' అని అరవింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చారు.
చెల్లి.. దయచేసి ఆ పని చేయకు
ఓవైపు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు న్యాయ పోరాటం చేస్తుండగా.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరఫున క్రీయాశీల రాజకీయాల్లో ఉన్న మాజీ క్రీడాకారులు తమ మాటలతో అభిమానుల ఆగ్రహానికి లోనవుతున్నారు. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పోరాటంలో ముందుండి నిలిచిన వినేశ్ ఫోగట్.. తన సోదరి బబిత కుమారికి సోషల్ మీడియా వేదికగా తీయని కౌంటర్ ఇచ్చింది. 'బాధిత రెజ్లర్ల తరఫున న్యాయ పోరాటంలో అండగా నిలబడకపోతే.. బబిత చెల్లి నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను ఉద్యమాన్ని బలహీనం చేసే పని చేయవద్దు. లైంగిక వేధింపుల పట్ల మాట్లాడేందుకు, ఎదురించి నిలబడేందుకు మహిళా రెజ్లర్లకు ఏండ్లు పట్టింది. నువ్వు కూడా ఓ మహిళవే, మా బాధను అర్థం చేసుకో' అని వినేశ్ ఫోగట్ ట్వీట్ చేసింది. శనివారం ఉదయం జంతర్‌మంతర్‌కు వచ్చిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రెజ్లర్లకు మద్దతు తెలిపింది. ఆ సమయంలో ప్రియాంక వెంట ఆమె వ్యక్తిగత కార్యదర్శి సందీప్ సింగ్ సైతం ఉన్నారు. 'మహిళా రెజ్లర్లకు న్యాయం చేకూర్చేందుకు ప్రియాంక జంతర్ మంతర్ వద్దకు ఆమె వ్యక్తిగత కార్యదర్శి సందీప్ సింగ్‌తో కలిసి చేరుకుంది. కానీ ఆమె వ్యక్తిగత కార్యదర్శి ఓ దళిత మహిళను అవమాన పరిచిన, లైంగికంగా వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు' అని బబిత ఫోగట్ ట్వీట్ చేసింది. వినేశ్ ఫోగట్ అక్క, దిగ్గజ రెజ్లర్ గీత ఫోగట్ మల్లయోధుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించింది. సత్వర న్యాయం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది.
రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్ నిందలు
రెజ్లర్ల న్యాయ పోరాటానికి దేశవ్యాప్త మద్దతు లభిస్తుండగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళనను రాజకీయ-వ్యాపార మైత్రి ప్రదర్శనగా అభివర్ణించారు. నాపై లైంగిక ఆరోపణలు, రెజ్లర్ల ఆందోళన వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. ఆందోళన చేస్తున్న రెజ్లర్లు జాతీయ ట్రయల్స్‌లో ప్రాధాన్యత కోరు కుంటు న్నారని బ్రిజ్‌భూషణ్ ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యలను రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా కొట్టిపారేశారు. ' నేను ఎప్పుడూ ట్రయల్స్ మిస్ చేయలేదు. 2009 నుంచి ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే ఫిట్నెస్, ఆరోగ్య సమస్యలతో నేషనల్స్‌కు దూరంగా ఉన్నాను. ట్రయల్స్‌లో సత్తా చాటకుండా ఎన్నడూ అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లలేదు. బజరంగ్ నా కంటే పెద్ద రెజ్లర్, అయినా ప్రతి నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడ్డాడు' అని వినేశ్ తెలిపింది. 'లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ ఎవరనే సంగతి బ్రిజ్‌భూషణ్‌కు ఎలా తెలిసింది. అయినా, పోలీసులపై, కమిటీలపై విశ్వాసం ఉంచాలని ఎలా అడుగుతున్నారు? మేము లైంగిక వేధింపులపై పోరాడుతుంటే.. మీరు వేరే అంశాలను ప్రస్తావిస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమాధానం ఇవ్వండి' అని బజరంగ్ పూనియా అన్నాడు.