Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
- ఛేదనలో హార్దిక్ పోరాటం వృథా
నవతెలంగాణ-అహ్మదాబాద్ : పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న జట్టు పోరు. సహజంగానే అగ్రజట్టు విజయం సాధిస్తుందనే అంచనాలు ఉంటాయి. అందుకు తగినట్టుగానే తొలి 20 ఓవర్ల ఆట సాగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమే చేసింది. 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి 130 పరుగులు నమోదు చేసిన వార్నర్‌సేన.. ఐపీఎల్ చరిత్రలోనే ఛేదనలో అత్యుత్తమ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 131 పరుగుల ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (59 నాటౌట్, 53 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో చివరి వరకు క్రీజులో నిలిచినా.. జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు. చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన సమయంలో నోకియాపై రాహుల్ తెవాటియ (20, 7 బంతుల్లో 3 సిక్స్‌లు) హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ను టైటాన్స్ వైపు తిప్పాడు. కానీ చివరి ఓవర్లో ఇషాంత్ శర్మ (2/23) 12 పరుగులను కాపాడుకుని, క్యాపిటల్స్‌కు సీజన్లో మూడో విజయాన్ని అందించాడు. టైటాన్స్ సైతం ఛేదనలో 32/4తో కష్టాల్లో పడినా హార్దిక్ పాండ్య తోడుగా అభినవ్ మనోహర్ (26) జట్టును ఆదుకున్నాడు. సాహా (0), గిల్ (6), విజరు శంకర్ (6), డెవిడ్ మిల్లర్ (0) విఫలమయ్యారు. అంతకముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు టైటాన్స్ పేసర్ మహ్మద్ షమి (4/11) చుక్కలు చూపించాడు. షమి దెబ్బకు ఆ జట్టు 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. సాల్ట్ (0), వార్నర్ (2), గార్గ్ (10), రౌసో (8), మనీశ్ పాండే (1) విఫలమయ్యారు. అక్షర్ పటేల్ (27), ఆమన్ హకీమ్ ఖాన్ (51), రిపాల్ పటేల్ (23) పోరాటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేయగల్గింది.