Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు కమిటీలు ఏర్పాటు
- భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- రెజ్లింగ్ క్రీడాకారుల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేసే వరకు జంతర్‌మంతర్ నుంచి కదిలేది లేదని ఆందోళనలో కూర్చున్న రెజ్లింగ్ క్రీడాకారులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై బెయిలుకు వీలులేని సెక్షన్ల ప్రకారం రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంపై రెజ్లర్లు మండిపడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై దేశం గర్వపడే విజయాలు సాధించిన మహిళా అథ్లెట్ల ఆవేదన ప్రధానమంత్రి నరెంద్ర మోడికి పట్టడం లేదని, సొంత పార్టీ ఎంపీని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని క్రీడాకారులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు.
న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లింగ్ క్రీడాకారుల ఆందోళన 14వ రోజుకు చేరుకుంది. ఒలింపియన్లు జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగినా.. కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం కనిపించటం లేదు. లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చట్టపర చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఆసక్తి చూపటం లేదు. దీంతో రెజ్లింగ్ క్రీడాకారులు దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి సారించారు. జంతర్‌మంతర్ వద్ద దీర్ఘకాలిక ఆందోళనకు రూపొందించాల్సిన కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు రెండు కమిటీలు ఏర్పాటు చేశారు.
ఈ మేరకు అగ్రశ్రేణి రెజ్లర్ బజరంగ్ పూనియా శనివారం తెలిపారు. 'న్యాయపరంగా ముందుకెళ్లాల్సిన మార్గాలపై న్యాయ బృందంతో వినేశ్ ఫోగట్ చర్చలు జరుపుతోంది. ఆ విషయాలు త్వరలోనే వెల్లడిస్తాము. జంతర్‌మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాల రూపకల్పనకు రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. 31 మందితో కూడిన తొలి కమిటీలో కాప్ పంచాయతీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, వ్యవసాయ సంఘాలు సహా వివిధ వర్గాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నిరసన కార్యక్రమాల రూపకల్పనపై మార్గనిర్దేశనం చేస్తుంది. 9 మందితో మరో కమిటీ ఏర్పాటు చేశాం. రెండో కమిటీ పూర్తిగా రెజ్లింగ్ ఆటపై దృష్టి పెడుతుంది. ఈ రెండు కమిటీలు తీసుకునే నిర్ణయాలతో ఇక నుంచి ఆందోళన ముందుకు సాగుతుంది. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. బ్రిజ్‌భూషణ్ జైలుకు వెళ్లే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని' బజరంగ్ పూనియా వెల్లడించారు.