Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1500కి పైగా యుద్ధ వాహనాలు, 230 ట్యాంకులు
- నాటో చీఫ్ వెల్లడి
కీవ్ : రష్యాతో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో నాటో దేశాలు, ఉక్రెయిన్‌కు 98శాతానికి పైగా యుద్ధ వాహనాలను అందచేశాయని నాటో చీఫ్ గురువారం తెలిపారు. 1550కి పైగా సాయుధ వాహనాలతో పాటూ 230 ట్యాంకులు, ఇతర సామాగ్రిని అందచేసినట్లు నాటో సెక్రటరీ జనరల్ జేన్స్ స్టోలెన్‌బర్గ్ తెలిపారు. సభ్య దేశాలు కూడా అపారమైన మొత్తంలో మందుగుండును పంపినట్లు చెప్పారు. 9కి పైగా బ్రిగేడ్లకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కొత్త బ్రిగేడ్లలో 30వేల మందికి పైగా సైనికులు వున్నారని అంచనా. వీటిన్నంటితో ఉక్రెయిన్ బలమైన స్థితిలో వుందని, రష్యా అక్రమిత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగల పరిస్థితిలో వుందని స్టోలెన్‌బర్గ్ బ్రస్సెల్స్‌లో విలేకర్లకు చెప్పారు. ఉక్రెయిన్ మిలటరీని మరింత బలోపేతం చేసేందుకు 31నాటో దేశాలు కట్టుబడి వున్నాయని స్టోలెన్‌బర్గ్ తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సుదీర్ఘమైన ఫోన్ సంభాషణ జరిపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించిన నేపథ్యంలో నాటో చీఫ్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కాగా, జెలెన్స్కీ, జిన్‌పింగ్ ఫోన్ చర్చలకు రష్యా పెద్దగా స్పందించలేదు. కాగా, ఈ పరిణామం ఉక్రెయిన్‌లో పోరును ఆపేందుకు ఉపకరిస్తుందా అని ప్రశ్నించగా, ఘర్షణలను అంతమొందించడానికి, రష్యా నిర్దేశించిన అన్ని లక్ష్యాలను సాధించేందుకు దారి తీసే ఏ పరిణామాన్నైనా తాము స్వాగతించడానికి సిద్ధంగా వున్నామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. చైనా, ఉక్రెయిన్ నేతలు ద్వైపాక్షిక, వాణిజ్య చర్చలు జరిపారని పెస్కోవ్ తెలిపారు.