Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మందిని కాల్చి చంపిన సాయుధుడు
బెల్గ్రేడ్ : సెర్బియాలో రెండు రోజుల వ్యవధిలో మూకుమ్మడి హత్యలు చోటు చేసుకున్నాయి. ఒక బాలుడు 8మంది విద్యార్ధులను కాల్చి చంపిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. సాయుధుడైన ఒక వ్యక్తి మూడు గ్రామాల్లో మొత్తంగా 8మందిని కాల్చి చంపాడని, 14మందిని గాయపరిచారని పోలీసులు తెలిపారు. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని యు.బి.గా గుర్తించామని, శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. బెల్గ్రేడ్కు దక్షిణంగా వంద కిలోమీటర్ల దూరంలో క్రజువెక్ గ్రామానికి సమీపంలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక కాల్పులు జరిగిన ఆ ప్రాంతాన్ని మూసివేశారు. వందలాదిమంది పోలీసులు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టగా తెల్లవారు జామున పట్టుబడ్డాడు. అంతకుముందు గ్రామంలో ఏదో వాదన జరిగిందని, ఆ వ్యక్తి వెంటనే ఇంటికి వెళ్ళి, తుపాకీ తీసుకుని, తిరిగి వచ్చి కాల్పులు జరిపాడని అక్కడున్న వారు చెబుతున్నారు కానీ దాన్ని తాను నమ్మడం లేదని దుబోనా వాసి మిలాన్ ప్రొకిక్ వ్యాఖ్యానించారు. అదే నిజమైతే ఆ వ్యక్తి పొరుగు గ్రామాలకు కూడా వెళ్లి ఎందుకు చంపుతాడని ప్రశ్నించారు.