Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు వెలుపల అదుపులోకి తీసుకున్న రేంజర్లు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. గతేడాది పదవీచ్యుతుడై నప్పటి నుండి ఆయనపై పెండింగ్‌లో వున్న పలు కేసుల్లో ఒక కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన సమయంలో ఆయనను కోర్టు వెలుపల పేరా మిలటరీ రేంజర్లు అరెస్టు చేశారు. ఖాదిర్ ట్రస్టు అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారని ఇస్లామాబాద్ పోలీసుల ట్విట్టర్ ఖాతా పేర్కొంది. కాగా ఇస్లామాబాద్‌లో 144వ సెక్షన్‌ను విధించినట్లు తెలిపింది. ఆ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆయన అరెస్టును పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కూడా ధృవీకరించింది. ఖాన్‌పై నమోదైన కుట్ర కేసులో మే 3 వరకు తొలుత సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. సీనియర్ ఆర్మీ అధికారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఖాన్‌పై సైన్యం విమర్శలు చేసిన మరుసటి రోజే ఈ అరెస్టు చోటు చేసుకుంది. తనను చంపేసేందుకు సైన్యం కుట్ర పన్నుతోందంటూ ఇమ్రాన్ ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను వేధిస్తున్నారని పార్టీ ఆరోపించింది కానీ ఆ ఆరోపణలు వాస్తవమా కాదా అనేది వెల్లడి కాలేదు. అరెస్టు గురించి తెలియగానే వందలాదిమంది పార్టీ కార్యకర్తలు ఇస్లామాబాద్ వ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు. అల్లర్ల తరహా పరిస్థితులను సృష్టించారు. అయితే ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని పోలీసులు చెప్పారు. లాహోర్‌లో కూడా నిరసనలు చోటు చేసుకున్నాయి. లాహోర్ నుండి ఇస్లామాబాద్‌కు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ కోర్టు వెలుపల బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తుండగా, గ్లాస్ విండోను ఛేదించుకుని వచ్చిన రేంజర్లు తొలుత ఖాన్ భద్రతా సిబ్బందిపై, లాయర్లపై చేయి చేసుకున్నారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారని పార్టీ సీనియర్ నేత షిరీన్ మజారి తెలిపారు. ఇమ్రాన్ కారును చుట్టుముట్టారని పిటిఐ ఉపాధ్యక్షుడు ఫవద్ చౌదరి ట్వీట్ చేశారు. రియల్ ఎస్టేట్ నుండి కోట్లాది రూపాయిలను ఇమ్రాన్ ఆయన భార్య ముడుపులుగా తీసుకున్న కేసులో ఈ అరెస్టు జరిగి నట్లు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
120కి పైగా కేసులు
పాక్ మాజీ ప్రధానిపై దేశవ్యాప్తంగా 121 కేసులు వున్నాయి. దేశద్రోహం, దైవ దూషణ, హింసకు, తీవ్రవాదానికి పాల్పడడం, రెచ్చగొట్టడానికి సంబంధించిన కేసులే ఇవన్నీ. రాజధానిలో 31కేసులు నమోదవగా, లాహోర్‌లో 30 కేసులు, కాల్ అప్ నోటీసులు జారీ అయ్యాయని ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టుకు అందచేసిన జాబితా పేర్కొంది. తీవ్రవాదానికి సంబంధించిన కేసుల్లో 12 కేసులు లాహోర్‌లో, 14 కేసులు ఫైజలాబాద్‌లో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల మరో 22 కేసులు వున్నాయి.