Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నింగిలోంచి తొలి సూర్యుడు తొంగి చూసినట్టు నేల మీది చెట్టు చివర పిట్ట కూసినట్టు
అలల జడికి కలల గీతమాలపించినట్టు
శ్రమల తోట మందారం ఎగసిపూసినట్టు
పల్లవి : ఎర్రెర్రని బావుటా ఎగిరింది నేడు
శ్రామికుల తోడుగా నిలిచిండి చూడు
అనుపల్లవి : రేపు గెలుపు నాదేనని రెపరెపరెప మెరిసింది
మేడే దారులలోనే పీడిత విముక్తి అంది!
పని గంటను తన ఇంటికి నింపుకొనేవాని
తరతరాల దోపిడికి తెరను లేపినోన్ని
చెమట చుక్క దుర్బలమని చెరపట్టిన వాన్ని
నిగ్గదీసి నిలువరించి నినదించిన రోజు
కష్టజీవి కన్నీళ్లను తుడిచి ధైర్యమిచ్చింది
కడు బాధల కారణాలు విడమరచి చెప్పింది
పిడికిళ్లు బిగపడితే తెగిపడును సంకెళ్లని
పోరులోనే శ్రమఫలాలు చేరుననీ తెలిపింది
సంపద రాశులు నింపిన సాధకులే శ్రామికులని
పంపకాల మోసాలూ ఇంకా ఇక సాగవనీ
పీడన, దౌర్జన్యాలూ ఇక సహించబోమనీ
గర్జించిన సమూహాల సంకేతమే నేననీ
మానవతను హతమార్చే మతతత్వం మనకొద్దనీ
మనిషిని మనిషిగ నిలిపే ఆశయాన్ని నింపుకొని
పెట్టుబడికి పుట్టిన అసమానత తరిమేయగ
కట్టుబడిన జన చేతన కదన శంఖారావమయి
- కె.ఆనందాచారి