Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగర్ల సత్తయ్య, 7989117415
వేల ఏండ్లుగా తెలుగు సాహితీ స్రవంతి అనేక పాయలతో ప్రవహిస్తూనే ఉంది. జానపద సాహిత్యం, పద్య సాహిత్యం, గద్య సాహిత్యం, బాల సాహిత్యం ఈ పాయలలో కొన్ని. ఇతర ప్రక్రియలతో పోల్చినప్పుడు బాల సాహిత్యం రాయడం చాలా తేలిక అనే అపోహ సాహితీవేత్తలలో ఉంది. నిజానికి బాల సాహిత్య సృజన అత్యంత కష్టమైన పని. గత రెండు దశాబ్దాలుగా తాను పనిచేస్తున్న పాఠశాలల్లో పిల్లలలో సృజనకారులను వెలికితీస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుడు కన్నెగంటి వెంకటయ్య. పిల్లల నుంచి సృజనాత్మక రచనలు రాబట్టే క్రమంలో వారికి మార్గదర్శిగా ఉంటూ బాలసాహిత్యం రాస్తున్నాడు. పిల్లల కోసం అనేక గేయాలు, కవితలు, కథలు రాశారు. తన సాహిత్యాన్ని ప్రచురించడం కంటే పిల్లల సాహిత్యాన్ని ప్రచురించడంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందే కన్నెగంటి ఇప్పుడు తన బాలగేయాలను 'చిటికెలు' పేరుతో వెలువరించారు.
బాల సాహిత్యంలో మేలుబంతి లాంటి గ్రంథం చిటికెలు. అలతి అలతి పదాలతో సరళ సుందరంగా పిల్లల మనసు దోచే గేయాలు ఇవి. చెట్టు తల్లి వంటి కథా గేయంతో పాటు పిల్లలకు ఉల్లాసాన్ని కలిగించేవి. విజ్ఞానదాయకమైన గేయాలు ముఖ్యంగా విజయమా, చెట్టు గజల్, జమిలి కన్నులు వంటి గజల్స్ పిల్లలు పాడుకునే స్థాయిలో రాయడం అభినందించదగ్గ విషయం. ఈ గేయాలలో శాస్త్రీయ దృక్పథం ఉంది. పర్యావరణ స్పృహ ఉంది. దేశభక్తి, గురు భక్తి, మాతృ భక్తీ కనిపిస్తాయి. చిన్నపిల్లల్లోనే సామాజిక స్పృహను రగిలించే గొప్ప గేయాలు ఇవి.
''రైతన్నల మేలును కోరు / మిత్రమా! నీ బ్రతుకు తీరు / నీ పాదపు ధూళి తగిలితే / పూలన్నీ పండ్లవుతాయి / పంట చేల నాశించే / పురుగులను అంతం చేసే / విషపూరిత రసాయనాలు / కసిరి కాటు వేశాయా!''
(సీతాకోకచిలుకమ్మా)
సీతాకోకచిలుక గేయం గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక పరిణతి చెందే వైనం, సీతాకోకచిలుకలు రైతులకు చేసే మేలు, నేడు సీతాకోకలు చిలుకలు అంతరించి పోతున్న దుస్థితికి కారణం మొదలైన అంశాలు అత్యంత సరళంగా పిల్లలు తేలికగా అవగాహన చేసుకునే స్థాయిలో వివరిం చారు. కాలుష్యం బారి నుంచి మానవాళిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని, పర్యావరణం పట్ల అవగాహనను కలిగించే మరొక గేయం 'అన్నా పుల్లన్నా'.
చెట్టు పరోపకార గుణాన్ని తెలియజేసే మరొక గేయ కథ 'చెట్టుతల్లి'
పొరుగుపక్షి చీదరించె /ఆదరించలేదు మనిషి /చెట్టుతల్లి చేర దీసి /పిల్లకాకులను పెంచె అనాధలైన పక్షి పిల్లలను చేరదీసి ఆదరించే గొప్ప గుణం చెట్టుకు ఉంటుం దని తెలుపుతూ పరోక్షంగా చెట్టును కాపాడుకోవాల్సిన అవ సరాన్ని చెప్పకనే చెప్పారు. చెట్టు గజల్ కూడా చెట్టు గొప్ప దనాన్ని చాటి చెప్పింది. 'చిట్టి గేయాలు' 'ముద్దుల చిన్నారి' ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించాయి.
పాఠశాల స్థాయిలో పిల్లల తరగతి గదిలో కాస్త నిరాసక్తంగా ఉండే అంశం చందస్సు బోధన. దీనిని అధిగమించడానికి చందస్సును అలవోకగా నేర్పించే వృత్త పద్య లక్షణాల గేయం రాశారు. పిల్లల మనసులో ఇవి నాటుకు పోతాయి.
బల్లి మిడతలు మింగినా, గుడ్లగూబ ఉడత కోసం చూసినా, నక్క కుందేలు కోసం చూసినా, పాము కప్ప కోసం వెతికినా, మృగం లేడీ కోసం వెతికినా, గద్ద కోడి పిల్ల కోసం చూసినా అది తన ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే. అంతేగాని మనిషి సాటి మనిషిని చంపడం అన్యాయం అంటారు ఒక గేయంలో. మనిషిని మనిషి చంపే ఆటవిక న్యాయాన్ని నిరసిస్తూ ఇతర జీవులు కూడా కేవలం ఆకలి కోసం మాత్రమే పొరుగు జీవులను చంపుతాయని సోదాహరణంగా వివరించే గేయం శాంతి సందేశం.
ముత్యాల సరాలు చందస్సులో గురుబోధ గొప్పదనాన్ని చాటే మరొక గేయం విశ్వమంత గురువు. విద్యార్థులను విజయం వైపు అడుగులు వేయించే స్ఫూర్తివంతమైన గేయం 'విజయమా'. మహనీయుల స్మరించుకునే గేయాలు కూడా ఈ సంపుటిలో కనిపిస్తాయి
అంబేద్కర్ అంటే వొక /దళిత జనుడు కాదు/ పీడిత తాడిత నరాన/ ప్రవహించే జవజీవం/ భారత రాజ్యాంగ రూపం /దారి చూపు జ్ఞాన దీపం అంటూ అంబేద్కర్ ఈ జాతికి చేసిన సేవను ఆవిష్కరిస్తుంది.
విద్యార్థులలో దేశభక్తిని ప్రోదిచేసే గేయం 'గమనదేవుళ్ళు'. బానిస బతుకుల విముక్తి కోసం తనువును సమిధగ అర్పించి వురికొయ్యలను విరిమాలలుగా చిరునవ్వులతో ధరించిరి.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవలసిన అవసరాన్ని 'వందేమాతరం.. వందేమా తరం...' తెలిపింది. ఇటువంటి మరొక గేయమే స్వాతంత్య్రం కోసం జాతీయ గీతం గొప్పదనాన్ని, గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, తిలక్ మొదలైన స్వాతంత్ర సమరయోధులను కీర్తించినది.
గోరుముద్దలతో పాటు పురాణేతిహాసాలను నూరిపోసిన అమ్మకు నమస్కరించే పాట 'అమ్మా వందనం'. అమ్మతో పాటు అమ్మ భాషను గౌరవించాలని తెలుగు ఔన్నత్యాన్ని చాటుతూ కన్నెగంటి రాసిన గేయం తెలుగు భాష. జీవనది గంగానది వంటి తెలుగు భాషలో ఎన్ని పరాయి భాషలు అయినా అలవోకగా ఇమిడిపోతాయని, తెలుగు భాష మాత్రం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుందని తెలియ జెప్పారు.
పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమంలోనైనా పాడుకోవ డానికి స్వాగత గీతాన్ని అందించారు. కాళోజీ, జాషువాలపై రాసిన స్మృతి గీతాలు ఆయా కవులపై పిల్లలకు లోతైన అవగాహన కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు.
ఆడపిల్లలపైన, స్త్రీలపైన జరుగుతున్న అఘాయిత్యాల పట్ల చైతన్య స్పృహను కలిగించే గేయం 'చెల్లెలా ఊర్మిళ..' ఇందులో స్త్రీల పట్ల జరిగే ఘోరాలకు కారణాలను తమను తాము రక్షించు కోవలసిన అవసరాన్ని చైతన్యాన్ని కవి అందించగలిగాడు. మన సంసృతి వైభవాన్ని చాటే బతుకమ్మ పాట, గ్రంథాలయ అవసరాన్ని చెప్పే గేయం ఈ సంపుటిలో కనిపిస్తాయి.
''కన్నెగంటి వెంకటయ్య చిటికెవేస్తే చాలు పాటవుతుంది. గేయమవుతుంది. గజల్ అవుతుంది. గాన ప్రవాహమవు తుంది. కొన్ని చిటికెలు వేసి పిల్లలతో రాయించారు. కొన్ని చిటికెలతో శతకం చేయించారు. తాను పనిచేసిన పాఠశాలల పిల్లల్లో ఇంద్రధనస్సులు పూయించారు. ఆయన ఏ పనైనా చిటికెలో చేస్తారు.'' డాక్టర్ సీతారాం అభిప్రాయపడ్డట్లు నిజంగానే ఇటువంటి సృజనకారులైన ఉపాధ్యాయుల అవసరం నేటి సమాజానికి ఎంతో ఉంది.
''కన్నెగంటి వెంకటయ్య ఖమ్మం కేంద్రంగా సాగుతున్న బాల వికాస యజ్ఞానికి రెండు దశాబ్దాలుగా ముందు నిలిచి నడుస్తున్న బాలవికాస కార్యకర్త. తన నేతృత్వంలో నిర్వహిం చిన కార్యశాల్లో వందలాది మంది చిన్నారి కవి గాయకులు అక్షరారంగేట్రం చేశారు''. అన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పత్తిపాక మోహన్ మాటలు బాల సాహిత్యం లో కన్నెగంటి కృషిని ప్రస్ఫుటం చేస్తున్నాయి. కన్నెగంటి కేవలం ఖమ్మం బాలవికాస యజ్ఞానికి కార్యకర్త మాత్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల బాలవికాసానికి మార్గదర్శి కూడా. రెండు దశాబ్దాలకు పూర్వమే ఈ ప్రయత్నం మొదలు పెట్టింది కన్నెగంటి వెంకటయ్య కావడం గమనార్హం.
''విద్యార్థులను సాహిత్య సృజన శీలురుగా మలచడంలో పడే శ్రమ, తపన చూసినప్పుడు ముచ్చటేస్తుంది. ఈర్ష్య కూడా కలుగుతుంది. మొత్తం ఇరవై నాలుగు గేయాలతో వెలువడిన ఈ పుస్తకంలోని గేయా లన్నీ ప్రతి పాఠశాలలో పిల్లలు విధిగా నేర్చుకో దగినవి. వీటి వల్ల జ్ఞానంతో పాటు సమాజం పట్ల అవగాహన ప్రకృతి పట్ల ఆరాధన దేశభక్తిని పిల్లల్లో రగిలించ గలం. విద్యార్థులకు కావలసిన విలువలను అందించడంలో రచయిత కృతకృత్యులయ్యారు.