Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవి తను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పాలంటే ఆ కవి లోలోపల ఎంత మదనపడి మండితే అంత కవిత్వం బయటకు వస్తోంది. అందులో ఒక విషయాన్ని సెటైరికల్‌గా చెప్పడంలో ఎంతో పరిణితి అవసరం. తెలుగు కవిత్వంలో సెటైరికల్ కవి అనగానే మనకు గుర్తు వచ్చే పేరు 'మహా కవి పెడి తెరేష్ బాబు'. ఆ వరసలో ఇప్పుడు పదునైన సెటైర్స్ వేస్తూ కవిత్వాన్ని పరుగులెట్టిస్తున్నాడు 'కవి నేలపూరి రత్నాజీ' ''ఒకే గొంతు'', ''నెత్తుటి మరకలు'' కవితా సంపుటి ద్వారా కవితా లోకానికి సుప్రసిద్ధుడు సోషల్ మీడియాలో తనదైన శైలిలో అప్పటికప్పుడు కవిత్వం రాయడంలో దిట్ట. ఇప్పుడు తను 'రాజ్యమేలే తాళం చెవి' కవితా సంపుటిని సాహిత్య ప్రపంచంలోకి వదిలారు.
మొత్తం 35 కవితలు వున్నాయి. ఒక్కొక్క కవిత ఒక్కో ఆలోచన బహుజన సమాజానికి అందిస్తుంది. క్కో డైనమేట్ పేల్చాడు రాజ్యాంపై అని చెప్పడంలో సందేహం లేదు.
ఇందులో మొదటి కవిత 'కత్తిడాల్'
కత్తి డాల్ సిద్ధంగా వున్నారు / ఒక విజేత మరణాన్ని కీర్తిస్తూ / విద్రోహపు తలలను ఖండించి / విజయ హాసంతో మీ వైపుకు చూస్తూ / సిద్ధ పడులే...../ .............. /మాల - మాదిగ / చాకలి -మంగలి / గౌడ - శాలి / డక్కలి - రెల్లి / ఎరుకల -యానాది అనేకమంత... / కత్తిడాల్ సిద్ధంగా వున్నారు / విజయహాసంతో మీ వైపుకు చూస్తున్నారు !
అంటూ బహుజన మహానీయుల అడుగుజాడల్లో, బహుజన కులాలు చైతన్యమై, బహుజన పోరాట స్పూర్తిని నింపుకుని, బహుజన రాజ్యం కోసం, బహుజనులంతా కలిసి బహుజన రాజ్యం చేపట్టాలని అందుకు మహానీయుల ఆదర్శంగా కదలాలని కవిత ద్వారా తెలియజేసారు.
'బోధించు' కవితలో... నడిచొచ్చింది పట్టపుటేనుగు/ అంబారీపైకెగిరి కూర్చోరా తమ్ముడా / ఆలస్యం అలసత్వం అసలు చేయకు / నీలి రెప్పలా నీడలో / బహుజన కులాల కలయిక / అన్వయం కుదిరిందా ....75 ఏళ్లుగా నమ్ముకున్న దేశం మనకేమిచ్చింది/ హరిజనులనే ఆపకీర్తి తప్ప !..... .......ఓటు దుడ్డు కర్ర పుచ్చుకో / పైనా ఏటారం గాళ్ళను చావ చితకదన్ని .... ఓటున్న.... నారన్నా... కోటి రూకల మాట చెబుతా విను / మన నీలి రాజ్యాన్నే కలలు కను...
అంటూ కవితలో భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చిందీ కానీ అది ప్రజలకు కాదు ఆధిపత్య కులాలకు, ఓటు ఆయుధం వుపయోగించి నీ నీలి రాజ్యం నువ్వు సాధించుకో ఓ ఓటరన్నా ఈ దుస్థితి మారుతుంది అంటాడు.
మరో కవిత 'దశమ భాగం' పాట కవిత.... మాట ... ఏదో ఒకటి , శిల్పం... గేయం ... కావ్యం ఏదైనా, ఎదో ఒకటి చేయాలి .... నీ జాతికి అంకితమివ్వాలి ....... ......... అంబేడ్కర్నీ ఎలా మర్చిపోయావురా, నా సహోదరుడా.... విగ్రహం ముందు నిలబడి నీ దోషత్వాన్ని కడుక్కో, నీ దశమ భాగాన్ని జాతి చైతన్యానికి మళ్ళించు అని అర్ధ్రంగా, ఆవేదనగా, బాబాసాహెబ్ అంబేడ్కర్ కలలు కన్న రాజ్యాన్ని అందరూ అందులో కొందరు ఉద్యోగాలు వచ్చిన తర్వాత అంబేడ్కర్‌ను తన సమాజాన్ని పూర్తిగా మర్చిపోయి అసలు అంబేడ్కరంటే ఎవరూ అనే పరిస్థితుల్లోకి బహుజన ప్రజలున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. దశమ భాగం ఇవ్వాల్సింది దేవుడకు కాదు ఈ దేశంలో బతకడానికి స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి, హక్కులు కల్పించిన మహానీయుడు అంబేడ్కర్ కు అని ఈ కవితలో స్పష్టంగా చెప్పాడు కవి.
మరో కవిత 'నీలి రాగోదయం' ....
పార్లమెంటుకు నడువ్ / నీ సొంత కాళ్ళపైనే నడువ్ / ఈ దేశ బహుజనానికి అయడో మంత్రం / రణక్షేత ప్రబోధ గీతం / దేవుడు ఊరేగింపులో.... బుద్ధుడు, ఫూలే - పెరియార్ - కబీర్- సాహు అన్నీ బహుజన బృందగానాలే / అది గాయపడ్డ వేణువు... ఓ చిగురు కొమ్మ నేలను చీల్చుకొని/ ఈ దేశ బహు జనులకు రక్షణగా భోధి వృక్షమవు తుంది.. అంటూ తరతరాల నుంచి ఈ దేశానికి చమురై, చెమటై, నెత్తురై, శ్రమ చేసింది చాలు ఇక్కనైన మనం రాజ్యం చేపట్టాలని బుధ్ధుడు, ఫూలే, పెరియార్, సాహు, అంబేడ్కర్ మహానీయుల అడుగు జాడల్లో నడిచి నీ రాజ్యాం నువ్వు సాధించుకో అని గట్టిగా చెప్పిన కవిత.
మరో కవిత 'గెలుపు'... అంబేడ్కర్ అనే, ఆశయముంది, కాన్షీరామ్ ఆచరణవుంది, మాయవతి అనే ముందడుగు వుంది, ఆశయమనే ప్రమిదలో ఆచరణ నూనె పోసి మనమంతా వొత్తులమైతే, ఆ వెలుగు మనదే అవుతోంది అంటూ బలమైన కవిత్వం ద్వారా చెప్తారు.
మరొ కవిత 'నా పేరు సెలయేరు' మనువాదానికి మరణశాసనం రాస్తున్నామదిగో అని పాడే గొంతులు హత్యలు చేయబడతాయి, అణిచివేయబడతాయి... అన్యాయం అంటే లాఠీ..... రాజ్యాం వాడికి వీరభోజ్యం ... రాజ్యం వాడి చేతిలో దండం..... మన రాజ్యాం అడుగుతున్నాం, మన ఓట్లు అడుగుతున్నాం, మన వాటా అంటున్నాం, మనం ఆత్మగౌరవ నినాదాలిస్తున్నాం.... అందుకు కదా ఈ నిర్భంధాలు.... సంకెళ్లు.... జైల్లు .... ఐనా మేం సిధ్ధంగా వున్నాం.... మా గొంతుల్ని నులమలేరు... నా పేరు సెలయేరు అంటూ మీరు మమ్మల్ని ఎన్నిసార్లు ఆటంకాలకు గురిచేసిన, ఎన్ని చిత్రహింసలకు గురి చేసిన, ఎంత హింసలు పెట్టిన మా పాట, మా కవిత, మా ఉద్యమం ఆగదు. మేం పారే సెలయేర్లు అంటూ బలమైన గొంతుతో తన కవిత్వం ద్వారా బహుజనలకు మార్గనిర్దేశం చేస్తున్న బహిరంగ జన కవి నేలపూరి రత్నాజీ .... ఈ రాజ్యమేలే తాళం చెవి కవితా సంపుటి నిండా అనేక కవితలు రాజ్యం చేసే వికృత చేష్టలు, బహుజనలపై దాడులు, బహుజనులంతా కలిసి ఐక్యంగా రాజ్యాధికారం సాధించాలని రాసిన కవితలే. మరీ ముఖ్యంగా బహుజన రాజ్యాధికారం కోసం వచ్చిన కవితా సంపుటాలలో ఇది ప్రప్రథమంగా ముందు వరసలో వుంటుంది తప్పక చదవండి కవిత్వాన్ని రాయలనుకునేవారు స్పష్టంగా ఎవరి పక్షం కవిత్వం వుండాలో తెలియజేసే కవితా సంపుటి ఈ 'రాజ్యమేలే తాళం చెవి'.
- తంగిరాల సోని, 9676609234