Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాడంతే
అజ్ఞానధారి!
శాస్త్రీయంలో
మూసిన కళ్ళు మూసిన ముక్కు మూసిన చెవులు
ముంచి
అశాస్త్రీయ నోరు తెరుస్తాడు
జన్యుస్థిరత్వం ధిక్కరించి
శ్రమపాత్ర దొంగిలించి
మానవుడి నుండి కోతైయ్యేందుకు
వెనక్కి నడుస్తుంటే
వాడి ప్రేమల 'దేవుడి సృష్టి'
దేశంమీద పడి ఏడుస్తోంది
జీవపరిణామక్రమం
సూర్యుని చుట్టూ తిరిగొస్తుంటే
చీకటి చుట్టూతిరుగుతున్న మతం!
లేలేత మెదడు కొమ్మల్లో
వెలుగు నింపడానికి
చంపడానికి
మధ్య
ఒక యుద్ధం జరుగుతోంది
కాషాయఫాసిస్టు ప్రణాళిక మనుస్మృతి!
మనమధ్య వేలాడ్తున్న మధ్యయుగమొకటి
మనతో దాగుడుమూతలాడ్తోంది
ఒక ఆటవిక పులిపంజా
మనల్ని గురిచూస్తోంది
మంత్రాలకు
చింతకాయలు రాల్తేకదా!
నేలమీద నిలబడ్డ
డార్విన్ను చూసి
దేవుడు భయపడ్తున్నాడు
నిలబడ్డానికి
కాళ్ళులేక
- వడ్డెబోయిన శ్రీనివాస్