Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరకుమార్ గుండెపంగు, 99485 41711
కవిగా, కథకునిగా, పరిశోధకునిగా, వాగ్గేయకారునిగా, జర్నలిస్టుగా, దళిత, తెలంగాణ ఉద్యమాల నాయకుడిగా ఎన్ని పాత్రల్లోకి ఒదిగినా అతడిది అంబేద్కర్ తాత్విక దృక్పథమే. పసునూరి పల్లె నుంచి పట్టణాల వరకు ఆధునిక సామాజిక అంతరాల సమాజంలో వివక్ష ఎలా రూపాంతరం చెందుతున్నా, అనేక విషయాలను స్వీయ అనుభవ పూర్వకంగా రాసిన యదార్థ బతుకు కథలే ఈ 'కండీషన్స్ అప్లరు' కథలు.
దళిత జీవితాల్లోని ఒక్కో పార్శ్వాన్ని ఒక్కో కథలో క్షుణ్ణంగా రాయడమే కాకుండా, దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను ధిక్కార స్వరంతో నొక్కి చెప్పడం మనకు స్పష్టంగా కన్పిస్తుంది. దేశం అభివృద్ధి పథంలో వెలిగిపోతోంది. డిజిటల్ ఇండియాగా మారిపోతోంది. ప్రపంచ దేశాలకు ధీటుగా ఆర్థిక స్వావలంబన సాధించి ధనిక దేశాల సరసన నిలబడి వున్నదని చెప్పే అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ... తినేందుకు తిండిలేక ఆకలిని తట్టుకోలేక ఆకులుతినే ఒక వ్యక్తి రోదన చుట్టూ జరిగే వాస్తవిక జీవితాన్ని ఈ ప్రపంచం ముందుంచాడు. ఇందులోని 'లీఫ్ మ్యాన్' కథ చదువుతున్నంతసేపు ఈ దేశ ఆకలి నిజస్వరూప తిప్పలెన్నో కళ్ల ముందే కన్పిస్తుంటాయి. ఒక సర్వే సంస్థ 122 దేశాలలో చేపట్టిన సర్వేలో ఆహార సూచిలో నూటయేడవ స్థానంలో నిలిచింది మన దేశం. ఈ దౌర్భాగ్యాన్ని చెప్పుకోలేని పాలకుల దాపరిక పాలన మనది. ఆకలి కోసం రొట్టె ముక్కను దొంగిలించిన మధు అనే కేరళ యువకుడు ఈ దేశంలో ఆకలికి ఈ పాలకులు తెగేసి నరికిన శిల్పంలా కన్పిస్తాడు. ఇదే కోవలో 'లీఫ్ మ్యాన్' కథలో ఆకలి తట్టుకోలేక ఆకులు తినే పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని సమాజం మాత్రం అలమటించే వాడిని దేవుణ్ణి చేస్తుంది. ఇది ఈ దేశ వైవిధ్య తనానికి సంకేతం.
కులాంతర ప్రేమ ఈ దేశంలో దళిత యువతీ యువకుల పట్ల పెనుభూత సవాలే. ప్రేమించినందుకే ఎంతో భవిష్యత్తు ఉన్న దళిత బిడ్డలు నడిరోడ్ల పైన నరకబడ్డారు. ఇవి కనిపించినవే. ఇంకా కనిపించని, బయటపడని దారుణాలెన్నో ''పులి అడుగు దెబ్బ'' కథలో అద్భుతంగా చిత్రించాడు రచయిత. ఎందరో కులపిచ్చి విటులకు పడక సుఖంలో కనిపించని కులం, పెళ్ళి వద్దకు రాగానే కుల కంపు వాసనలు గుప్పుమంటాయి. ఇలాంటి కులోన్మాదుల ప్రేమ పైశాచికంపై తాను కోల్పోయిన ఆత్మ గౌరవాన్ని, తన అస్థిత్వానికి కేంద్రమైన సూర్యుని వంటి తోలు డప్పుపైన పునీతురాలై, ఈ కథలో ఆత్మగౌరవ పులి అడుగు దరువులను కొడుతుంది రాజవ్వ.
ఈ దేశం నలుమూలల్లో పిల్లులను పొడుసుక తినేటోళ్లు, ఎలుకల్నీ, పాములని తినేటోళ్ళు, తాబేలు మొదలు చేపలను తినేటోళ్ళు ఉన్నారు. అలాగే పందులను నుంచి గాడిదల వరకు స్వేచ్ఛగా తినేటోళ్ళు ఉన్నారు. మరి ఎవ్వరి తిండిలో లేని మహత్మ్యం ఈ దేశ దేవుళ్ళంతా కొలువై వున్నదల్లా దళితులు తింటున్న గొడ్డులోనే అంటా. ఇదెక్కడి చిత్రమో ఏమో అనిపిస్తుంది గానీ, ఇదే అతిపెద్ద కుట్ర! వేదకాలంలో యజ్ఞంలో బలిచ్చిన పశువుల సంగతే ఇప్పుడు అప్రస్తుతం, కానీ దేశం నలుమూలల రోజుకోక వార్త అత్యధిక జన సమూహం ఆరగించే బలిష్టమైన ఆహరం పైననే. ఇంగ్లీష్ చదువులు చదువుకుంటున్నా సరే ఆధునీకరణకు అలవాటు పడినా సరే మతం ఉచ్చులో పడినోడు పశువుల ఉచ్చనే పరమతీర్థంలా భావించి ఎదుటోడి తిండిపైన దాడులకు తెగ బడినపుడు ఈ దేశంలో ఒక్కో దళితుడు నాన్-వెజిటేరియన్ కథలోని ఏకాంబ్రం అవతారమెత్తుతాడు.
నూట-నలభై కోట్ల జనాభా ఉన్న భారతావనిలో అడుగడుగున వెక్కిరిస్తున్న అతిపెద్ద జాతీయ సమస్య నిరుద్యోగం. ఎన్నో ఉన్నత చదువులు చదువుకున్న యువత ఫ్యాక్టరీలలో కార్మికులుగా అడ్డాలపై రోజువారీ కూలీలుగా దర్శనమిస్తున్న వైనం మనకు కన్పిస్తుంది. అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో గొంతులు చించుకోని లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడతామనే మాటలన్ని నీటిమూటలే అన్నట్లుగా వ్యవహరించే ఈ దేశ పాలకుల అలసత్వ పరాకాష్టకు ''జెజ్జనక...జెన్'' అనే కథ. ఒక సవాలుగా నిలబడి నిరుద్యోగ సమస్యకు కారకులైన పాలకుల అధికారాన్ని కూలదోసే ప్రక్రియను రగిలే గుండె గోసను డప్పు దరువుల్లో విన్పిస్తాడు.
ఈ దేశం అంటరానోడని ముద్రవేసి అనేకమైన చిత్రహంసలకు గురిచేసినా సరే, మరొక వందేళ్ల వరకు ఈ దేశంలో ఎటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, సమస్యలు తలెత్తినా సరే, ఏకైక పరిష్కారమై కనిపించే మహోన్నత శిఖరం డా.బి.ఆర్.అంబేద్కర్. ఆయనకు ఇదంతా కూడా చదువు వల్ల కల్గిన జ్ఞాన సంపద. నేటి ఆధునిక సమాజంలో కూడా పరిశ్రమలు, భూములు, అధికారాన్ని, సంపదనంతా తమ వద్దే ఉంచుకున్న ఆధిపత్య కులాలకు ధీటుగా ఎదిగి వారిని, ఎదిరించి నిలవా లంటే మనకున్న ఏకైక ఆయుధం చదువు అని తద్వారా వచ్చే జ్ఞానమే సాధనమని ఈ పుస్తకంలోని ''తలదన్నినోడు'' కథలో సవివరంగా చెప్తాడు పసునూరి.
''మీరు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికి అడ్డంగా పెనుభూతంలా నిలబడ్తుంది కుల వ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పాతరేయకుండా మీరు రాజకీయ సంస్కరణలుగానీ, ఆర్థిక సంస్కరణలు గానీ సాధించలేరనీ'' అంటారు డా.బి.ఆర్.అంబేద్కర్. అమెరికా పోయి అక్కడ ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నా సరే అక్కడకు అంతకు ముందే చేరినా తిరోగమనవాదులు మన పేరు చివర ఉన్న తోకను కూడ గుచ్చి-గుచ్చి అడగడంలో ఎంతటి సిద్ధహస్తులో ''తోకల లోకం'' అనే కథలో మనకు సవివరంగా చెప్తాడు. ఈ దేశ పట్టణాల్లో ఎత్తైన కట్టడాలలో ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఆధిపత్య కులాలు తమతో నివసించే శూద్ర, అతి శూద్ర కులాలను తెల్సుకొనుటకు ఆరాటపడే విధానాన్ని అతి స్పష్టంగా తెలియ జేయటంలో రచయిత కులపీడినానికి గురైన జీవితం అనుభవం కన్పిస్తుందీ ఆధునిక దళిత కథల్లో. ఇదే విధంగా అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఎప్పటికీ ఏకతాటిపైకి రాకుండా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను సృష్టించిన మనువాదులు నేటికీ సఫలీకృతులుగానే ఉన్నారంటే కారణాలు దళిత అనైక్యత కూడ కారణమే. దీనికి ఆధిపత్య వర్గాల కుట్రలే ఆధారమని ఋజువు చేస్తూ ''ధమ్కీ'' కథ. ఇందులో మాల మాదిగల ఐక్యతను దెబ్బ తీయాలని శతవిధాల ప్రయత్నించిన పెత్తందారులు మనకు కన్పిస్తారు.
ఫైవ్జీ టెక్నాలజీ కాలం నడుస్తున్నా సరే, కులం దీనికి పదుల రెట్ల వేగంతో తన రూపాన్ని మార్చుకుని మన చుట్టూరా వైఫై లాగే అంటిపెట్టుకుని ఉంటుందని ''వాట్సప్ స్ట్రీట్స్'' కథ ద్వారా బోధపడ్తుంది.
కులం వేసే ప్రతీ అడుగును నిత్యం గమనిస్తూ కులపీడన విధానాన్ని దాని స్వభావాన్ని తన కలంతో చిత్రీకరిస్తూ కథల రూపంలో మనముందు ఉంచాడు. స్వేచ్ఛ-సమానత్వం-సౌభ్రాతృత్వ సాధించడమే ఇతని రచనల ప్రధాన ఎజెండాగా, ''బ్రాహ్మణ భావజాలానికే తప్పా, బ్రాహ్మణులకు వ్యతిరేకిని కాదనీ'' ప్రకటించిన అంబేద్కర్ వారసుడిగా తన రచనలతో దేశ నలుమూలలకు (పలు భాషల్లోకి తన కథలు అనువదించబడడం ద్వారా) విస్తరిస్తున్నాడు కథకుడు డా. పసునూరి రవీందర్.