Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీల్ మేకర్ గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలో వంట చేయాల్సి వచ్చినప్పుడు వంటింట్లో గృహిణిని ఆదుకునేది వచ్చినప్పుడు వంటింట్లో గృహిణిని ఆదుకునేది ఇదే. దీంతో చేసిన వంటకాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నాన్‌వెజ్‌కు అంతగా ఇష్టపడని వారు దీన్ని మరింత ఇష్టంగా తింటారు. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువేనని అంటున్నారు నిపుణులు. అలాంటి మీల్మేకర్తో కొన్ని రుచికరమైన వంటలు మీ కోసం...
ఖీమా హల్వా
కావల్సిన పదార్థాలు: మీల్ మేకర్ ఖీమా - అర కిలో, చక్కెర - కప్పు, క్యారెట్ లేదా బీట్రూట్ తురుము - ఒక కప్పు, నెయ్యి - వంద గ్రాములు, ఇలాచీ పొడి - చిటికెడు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష - 25 గ్రాములు, పాలు - రెండు కప్పులు.
తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్లో కొద్దిగా ఉప్పు వేసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి జార్లో ఖీమా బ్లేడ్ పెట్టి ఖీమాలాగా చేసిపెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన బెట్టుకోవాలి. క్యారెట్ తురుము వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో పాలు పోసి బాగా వేడి చేసి అందులో చక్కెరె, వేయించిన క్యారెట్ తురుము, ఉడికించిన ఖీమా వేసి తిప్పుతూ బాగా మెత్తగా ఉడకనిచ్చి ఇలాయి పొడి వేసి నెయ్యి తేలేలాగా దగ్గర కానివ్వాలి. దించే ముందు వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి దించాలి. ఇది కొద్దిగా చల్లారాక సర్వ్ చేసుకోవాలి. వెరైటీగా, రుచిగా ఉంటుంది.
పులావ్
కావల్సిన పదార్థాలు: మీల్ మేకర్ - 250 గ్రాములు, బాస్మతి బియ్యం - 250 గ్రాములు, నెయ్యి లేదా నూనె - వంద గ్రాములు, ఉప్పు - ఒక టేబుల్ స్పూను, దాల్చిన చెక్క - ఒక ముక్క, అల్లం - 25 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - ఒక గుప్పెడు, యాలకులు - మూడు, లవంగాలు - పదిహేను, బిర్యానీ ఆకులు - రెండు, పుదీనా - నాలుగు రెబ్బలు, కొత్తిమీర - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - నాలుగు, ఉడికించిన గ్రీన్‌పీస్ - 50 గ్రాములు, ఆలుముక్కలు - చిన్న కప్పు, ఉల్లి తరుగు - చిన్న కప్పు.
తయారు చేసే విధానం: ముందుగా ఆలు ముక్కలు, గ్రీన్ పీస్, మీల్మేకర్ విడివిడిగా ఉడికించుకోవాలి. స్టవ్‌పై చిన్న కుక్కర్ పెట్టి నెయ్యి, నూనె పోసి కొద్దిగా వేడి చేయాలి. ఇలాచి, దాల్చిన చెక్క, సగం అల్లం, సగం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అందులోనే బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, ఉల్లితరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత మిగతా అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన, రంగు, రుచి వచ్చేదాకా వేయించి, గ్రీన్ పీస్, ఆలు ముక్కలు, మీల్మేకర్ ముక్కలు ఉడికించినవి వేసి వేయించి తగినంత నీరు (రెండు కప్పులు), ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మంచి సోయా పులావ్ రెడీ. దీన్ని మీల్మేకర్ ఖుర్మా, లేదా బఠానీ ఖుర్మా లేదా పుదీన చట్నీతో తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వండడం కూడా చాలా తేలియక.
పకోడి
కావల్సిన పదార్థాలు: మీల్ మేకర్ గ్రాన్యూల్స్ - అరకప్పు, ఉల్లిగడ్డలు - మూడు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి - ఐదు (సన్నగా తరగాలి), కొత్తిమీర - కట్ట, కరివేపాకు - నాలుగైదు రెబ్బలు, జీలకర్ర - చెంచా, కందిపప్పు పొడి - పావుకప్పు కన్నా ఎక్కువ, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: మీల్ మేకర్ గ్రాన్యూల్స్‌ని ఉడికించి నీళ్లు పిండేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కూడా చల్లుకోవాలి. ఈ మిశ్రమాన్ని పకోడీల్లా వచ్చేలా కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. బాగా వేగాక తీసుకుంటే సరిపోతుంది.
దాల్చా
కావల్సిన పదార్థాలు: మీల్ మేకర్ - వంద గ్రాములు, కందిపప్పు - 50 గ్రాములు, కొబ్బరి - చిన్న ముక్క, కొత్తిమీర - నాలుగు రెమ్మలు, టమాటాలు - నాలుగు, చింతపండు రసం - ఒక కప్పు, ఉల్లి తరుగు - అర ఉల్లిగడ్డ, ఉప్పు - అర టీ స్పూను, కారం - ఒక టీ స్పూను, ధనియాల పొడి - మూడు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు.
తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ ఉడికించి పెట్టుకోవాలి. అలాగే కందిపప్పు కూడా ఉడికించుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ చిన్నగా పెట్టి ఉడికించిన ఖీమా, ఉప్పు, పసుపు, రెండు రెమ్మల కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం సన్నని సెగ మీద తిప్పాలి. ఆ తర్వాత టమాట ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. కొబ్బరి మిశ్రమం, కంది పప్పు, చింతపండు రసం వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే కమ్మని మీల్మేకర్ దాల్చా రెడీ. ఇది అన్నం, రోటీ, పూరీ ఎందులోకైనా రుచిగా ఉంటుంది. ఆయిల్ లేకుండా కూడా దీన్ని వండవచ్చు.