Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భం ధరించిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. అలాగే ప్రసవానంతరం కూడా శారీరకంగా కొన్ని మార్పులు రావడం సహజం. అయితే తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన వారిలో చాలామంది ఇలాంటి మార్పులు జరగడం వల్ల కంగారు పడుతుంటారు. కానీ ప్రసవం తర్వాత జుట్టు రాలిపోవడం, కాళ్లలో వాపు, వక్షోజాల్లో పెరుగుదల.. వంటి పలు శారీరక మార్పులు సహజమేనని, అందుకు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవన్నీ కొన్ని రోజుల వరకు కొనసాగి, ఆ తర్వాత పరిస్థితి సాధారణమవుతుందంటున్నారు. మరి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి శరీరంలో జరిగే ఆ మార్పులేంటో తెలుసుకుందాం...
ప్రసవం తర్వాత కలిగే శారీరక మార్పుల్లో బ్లీడింగ్ ఎక్కువగా అవడం కూడా ఓ భాగమే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు రెండు మూడు వారాల వరకు ఎక్కువ మొత్తంలో బ్లీడింగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత అందులోని మలినాలు, మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ రక్తం రూపంలో బయటికి వెళ్లిపోయి గర్భసంచి శుభ్రపడడమే ఇందుకు కారణం. ఇక ఆ తర్వాత మళ్లీ నాలుగైదు నెలలు లేదంటే ఆరు నెలల అనంతరం మహిళల్లో నెలసరి ప్రారంభమవడం గమనించవచ్చంటున్నారు వైద్యులు. కాబట్టి ఈ సమయంలో బ్లీడింగ్ ఎక్కువవుతోందని భయపడకుండా నిపుణుల సూచనలు శ్రద్ధగా పాటిస్తే మేలని సూచిస్తున్నారు.
ప్రసవం తర్వాత మలబద్ధకం, మూత్రవిసర్జన సమయంలో మంట.. వంటి సమస్యలు కూడా చాలామందికి ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ సమయంలో నీరు, పండ్ల రసాలు, పాలు.. వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్యను సత్వరమే తగ్గించుకోవచ్చంటున్నారు.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు ఆరువారాల వరకు శరీరంలో శక్తి స్థాయులు తగ్గుతాయి. అలాగే రాత్రుళ్లు చెమటలు పట్టడం, కాస్త ఒత్తిడి.. వంటివి కూడా గమనించవచ్చు. మరి వీటన్నింటి నుంచి త్వరగా బయటపడాలంటే నిపుణుల సలహాతో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, సమతులాహారం తినడం.. వంటివి చేయడం ఉత్తమం.
అలాగే కాళ్లు, పాదాల్లో వాపు రావడం కూడా ప్రసవం తర్వాత ఎక్కువమందిలో గమనించవచ్చు. అయితే డెలివరీ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఈ వాపు నెమ్మదిగా తగ్గిపోతుంది.
గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత పొట్ట తిరిగి నాజూగ్గా తయారవడానికి కాస్త సమయం పడుతుంది. అంతవరకు పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంది. అంతేకాదు.. గర్భధారణ సమయంలో చర్మం క్రమంగా సాగుతుంది. అలాగే ప్రసవానంతరం సాగిన చర్మం ముడుచుకోకుండా స్ట్రెచ్ మార్క్స్ రూపంలో చర్మంపై కనిపిస్తాయి. కాబట్టి పొట్ట తగ్గించుకోవడానికి నిపుణులు సూచించిన బెల్టును ధరించడంతో పాటు వైద్యుల సూచనల మేరకు స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి సరైన చిట్కాలు పాటిస్తూ, తగిన వ్యాయామాలు చేయడం కూడా ఎంతో అవసరం. తద్వారా ఈ శారీరక మార్పును త్వరగా కవర్ చేసుకోవచ్చు.