Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సముద్రతీర ప్రాంతాల్లో కొబ్బరి, తాటి చెట్లు విపరీతంగా పెరుగుతాయి. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగమూ మనకు ఉపయోగపడేదే. అనారోగ్యంగా ఉన్నప్పుడు కొబ్బరినీరే పుష్టికరమైన ఆహారం. కొబ్బరి గుజ్జును ఇంట్లోని ఆహార పదార్థాలన్నింటిలో ఉపయోగిస్తారు. కొబ్బరి చెట్టు కాండాన్ని ఇంటి కలపగా ఉపయోగిస్తారు. కొబ్బరి ఆకుల్ని పందిళ్ళు వేయడానికి, ఆకులోని ఈనెల్ని చీపుర్లుగా వాడుకోవడానికి ఉపయోగిస్తారు. ''కోకాస్ న్యూసిఫెరా'' అనే శాస్త్రీయనామం కలిగిన కొబ్బరి చెట్టులోని కొమ్మరెమ్మ ఆకు కాయ అన్నీ ప్రజలు వాడుకునేవే. కొబ్బరి చెట్టు ముప్పైమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సముద్ర ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో నాలుగైదు కొబ్బరి చెట్లుంటాయి. కొబ్బరి నీళ్ళలో పొటాషియం, సోడియం వంటి ఖనిజాలుంటాయి. డయేరియా వంటి జబ్బుల్లోనూ, శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడినప్పుడు కొబ్బరి నీరు ఎక్కువగా వాడతారు. భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరి కాయల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నది.
మా ఇంట్లో నాలుగు కొబ్బరి చెట్లుండేవి. మా చిన్నతనంలో కొబ్బరి ఆకులతో బూరలు, వాచీలు, ఉంగరాలు తయారు చేసి పెట్టుకునే వాళ్ళం. మా బంధువులందరి ఇళ్లలోనూ కొబ్బరి చెట్లుండేవి. పిల్లలందరికీ వీటితో బొమ్మలు చెయ్యటమే పని. కొబ్బరి చెట్టు ఆకుల మధ్యలో మెత్తగా పొడిలాంటిది అతుక్కుని ఉండేది. దాన్ని తీసుకొని నెమలి ఫించాలకు మేత అని పుస్తకాలలో పెట్టుకునే వాళ్ళం. ఆ మేత తిని నెమలి ఫించం పెద్దగా పెరుగుతుందని నమ్మకం. మా అమ్మ, పెద్దమ్మలు కొబ్బరాకులతో చిలకలను తయారు చేసేవారు. అదే తయారీని చూసి పిల్లలంతా వైరుతో చిలకలను అల్లేవాళ్ళం. సరే ఇప్పుడు కొబ్బరాకులతో కొన్ని బొమ్మలు తయారు చేద్దాం..
చిలకమ్మను చేద్దాం
కొబ్బరాకులలో ఈనెను వదిలి ఆకును కత్తిరించుకోవాలి. మధ్య ఈనెను వదిలేస్తే రెండు కొబ్బరాకులు వస్తాయి. ఆ రెండు ఆకులను ఉపయోగించి చిలకను చెయ్యాలి. ఒక ఆకును మడిచి క్రాస్‌గా పట్టుకుని రెండో ఆకును క్రాస్ చుట్టూతా తిప్పి కిందకున్న తోకలు మధ్యలో నుంచి దూరిస్తే ఒక ముడి వలె వస్తుంది. అయితే దాన్ని గట్టిగా లాకుండా కొద్దిగా వదులుగా ఉంచితే చిలక శరీరం తయారవుతుంది. శరీరానికి వెనక వైపున్న ఆకుల్ని తోకలా సన్నగా కత్తిరించి మిగతాది తీసేయాలి. శరీరానికి ముందు వైపున్న దాన్ని తలలా కత్తిరించి కన్ను గీసుకోవాలి. ఇలా కొబ్బరాకుల చిలకను చేయవచ్చు.
అమ్మాయి, అబ్బాయి బొమ్మ
కొబ్బరాకులతో చాపలు, బుట్టలు, ద్వారానికి తోరణాలు ఇలా ఎన్నో చేసేవారు. గతంలో పెండిండ్లకు అంటే కొబ్బరాకుల పందిళ్ళదే హవా. కొబ్బరాకుల స్తంభాలు కట్టి పైన కొబ్బరాకులు కప్పి నాలుగు వైపులా చిలకలు, బాతులతో తోరణాలు వేలాడదీసి అద్భుతంగా అల్లేవారు. ఆడపిల్లలయితే పెండ్లి కూతురు పెండ్లి కొడుకు బొమ్మలు తయారు చేసి బొమ్మల పెండ్లి చేస్తూ ఆనందపడే వారు. మా అమ్మ, మా నాయనమ్మ కొబ్బరాకుల బుట్టలు చిన్నవి తయారు చేసి ముగ్గులేసుకునే నాము పెళ్ళలు పెట్టి గూట్లో పెట్టేవారు. నేను పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు బొమ్మలు చేసి ఆటలాడుకున్నాను. ఆ బొమ్మలే ఈ తరానికి పరిచయం చేద్దాం. కొబ్బరాకులోని ఈనెను తీసేసి పొడుగ్గా ఉన్న ఆకును పక్కనుంచుకోవాలి. మధ్యలోని ఈనెను తీసేస్తే రెండు ముక్కలు అవుతాయి. రెండు ముక్కలు ఒకదానికొకటి క్రాస్‌గా పెట్టి వెనక్కి ముందుకి చుట్టాలి. కొద్దిగా చుట్టాక పొడుగైన ఆకును పైకి పోనిచ్చి తల భాగాన్ని తయారు చేయాలి. కిందికి కాళ్ళను చేయాలి. అడ్డంగా ఉన్న ఆకుతో చేతులు పెట్టాలి. ఇది అబ్బాయి బొమ్మ అమ్మాయి బొమ్మకైతే జడ పెట్టాలి అంతే. తల భాగంలో కండ్లు, ముక్కు, నోరు పెట్టాలి. ఇంట్లో మిగిలిన వస్త్రపు ముక్కలతో అమ్మాయికి చీర, జాకెట్టు చుట్టాలి. అబ్బాయికి పంచె, కండువా కట్టాలి. రెండింటినీ పెట్టి పెండ్లి వేడుక చేసి సంతోషపడేవారు. బాగున్నాయా..!
ద్వారానికి తోరణాలు
కొబ్బరాకు అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా! మధ్యలో పెద్ద కాడకు అటూ ఇటూ ఎన్నో సన్నని రిబ్బన్లలాగా ఉంటాయి. సన్నని రిబ్బన్ల లాంటి నాలుగు ఆకులు కోసుకుంటే చాలు. ద్వారానికి రెండు వైపులా అటు రెండు ఇటు రెండు తగిలిస్తే బాగుంటుంది. ఈ ఆకుకు మధ్య ఈనెను తీసేయకూడదు. బారెడు పొడుగున ఉండే ఈ ఆకుకు అక్కడక్కడా చిన్న గాట్లు పెట్టాలి. గాట్ల దగ్గర ఆకును చీల్చి మడవాలి. రెండు వైపుల ఆకుల్ని అటుదిటు, ఇటుదటు పోనిచ్చి ముడేయాలి. ఇలా బారెడు పొడవు పుల్లలో ఐదారు మడుల్లాగా వస్తాయి. ఇలా కాకుండా మొదటనే ఈనె మొత్తం తీసేసి ఆకులు విడిగా చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడీ ముక్కలకు చివర్న రెక్కలుగా కత్తిరించాలి. రెండు ముక్కలను క్రాస్‌గా పెట్టి ఈనెతో గుచ్చాలి. ఒక ఈనెకు నాలుగైదు ఆకుల పువ్వుల్ని గుచ్చి తోరణాలు చేయాలి. ఈ ఆకు పచ్చని తోరణాలను వాకిలికి అమర్చుకుంటే బాగుంటుంది.
మిడతను చేద్దాం
కొబ్బరి చెట్లు వంద సంవత్సరాలు బతికి ఉంటాయి. ఏడు సంవత్సరాల నుంచి పూతకు వస్తుంది. కాండం పగుళ్ళు పగుళ్ళుగా, బిరసుగా ఉంటుంది. నేను ఈ కాండం మీద ఏర్పడే అనేక చిత్రాలను ఫొటోలు తీశాను. బెరడు ఊడిపోతూ, గీతలతో పగుళ్ళుతో అందమైన ఆకృతులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడతాయి వాటిలో పెద్ద పెద్ద రాజకోటలు, భవనాలు, గుహలు ఆకారాల్లో కనిపించాయి. వాటిని చక్కని ఫొటోలు తీసి ఎగ్జిబిషన్లు పెట్టాను. మనం మిడతను ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనిది 'ఓరిగామి'లో మడతల్ని చూసి కొబ్బరాకుతో ప్రయత్నించాను. దీనికి ఈనె తీసివేయకుండా ఉంచాలి. అటూ ఇటూ ఆకును కొద్దిగా చీల్చి అటు ఆకును ఇటువైపు, ఇటు ఆకును అటు వైపుకు పెట్టి జడ అల్లకంలా అల్లాలి. ఇది మిడత శరీరం అవుతుంది. ఈనెను మిడత కాళ్ళ వలె చూపించాలి. రెక్కలకు ఆకును చుట్టాలి. పాలల్లో చెట్ల మీద వాలే ఆకుపచ్చ మిడత తయారవుతుంది.
ఫ్లవర్ బొకే
దీని కోసం ఆరు దళాల పుష్పం లేదా హృదయాకారంలను తయారు చేసుకోవాలి. ఇలా ఐదారు చేసుకుని రంగులు వేసుకుంటే కొత్తరకంగా ఉంటుంది. ఇలా చేసుకున్న హృదయాలను పల్లకు గుచ్చి పెట్టుకోవాలి. తర్వాత ఈనె తీసేసిన కొబ్బరాకులను క్రాస్‌గా మడిచి ఉంచాలి. ఇవి రెండు మూడు చేసి ఉంచుకోవాలి. కొన్ని ఆకులను మడిచి పాములా చేసి పెట్టుకోవాలి. దీన్ని మా చిన్నప్పుడు పాము అని ఆడుకునే వాళ్ళం. కొన్ని ఆకుల్ని కొద్దిగా మెలితిప్పి ఉంచాలి. వీటన్నింటినీ కలిపి ఒక ఫ్లవర్‌వేజ్‌లో పెడితే అందమైన పూల కుండీ తయారవుతుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్