Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతకాలంలో జుట్టు రాలే సమస్య అందరినీ వేధిస్తుంది. అయితే డెలివరీ అయిన తర్వాత ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అప్పటి వరకు ఒత్తుగా, పొడవుగా ఉండే జుట్టు.. డెలివరీ తర్వాత ఊడిపోవటం చూసి కొందరు భయపడి పోతుంటారు. కానీ ఈ సమస్యతో అంతగా భయపడాల్సిన పనిలేదు. ఇది పూర్తిగా సాధారణం. గర్భధారణకు ముందు, డెలివరీ తర్వాత మీ జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే హార్మోన్ హెచ్చు తగ్గుల కారణంగా కొందరిలో ఇలా జరుగుతుంటుంది. కానీ ఇది శాశ్వత సమస్య మాత్రం కాదు. ప్రసవం తర్వాత మొదటి కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు యధాస్థితికి చేరుకుంటుంది.
గర్భధారణ తర్వాత శరీరాన్ని తిరిగి బలోపేతం చేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రసవానంతర విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న పోషకాహారాన్ని తినాలి. జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడంలో ఇవి చాలా సహాయపడతాయి.
అలాగే హైడ్రేటెడ్‌గా ఉండటానికి రోజంతా పుష్కలంగా ద్రవాలను తీసుకోవటం ఉత్తమం. అలాగే వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. మెడిటేషన్ చెయ్యడం వలన ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఇది హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
డెలివరీ తర్వాత మీరు ఎక్కువ పోషక పదార్ధాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే జుట్టు రాలి పోవడం సమస్య తగ్గిపోతుంది. ఆకు కూరలు, మోరంగడ్డలు, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఆహారంతో పాటుగా హెయిర్ కేర్ ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా మంచి పద్దతి. ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, మంచి నిద్ర పొందడం కూడా చాలా ముఖ్యం. మంచి నిద్రతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.