Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్యం ఎందరితోనో మాట్లాడుతుంటాం. కానీ వారిలో ఒకరిద్దరే మనసుకు నచ్చుతారు. ఇందుకు బోలెడు కారణాలు. ఈ విషయం పక్కన పెడితే... అసలు మీరే ఓ మంచి స్నేహితురాలిగా ఉండాలంటే మాత్రం ఈ నియమాలను పాటించాలంటారు మానసిక నిపుణులు.
ఇద్దరి మధ్య స్నేహమైనా మరే బంధమైనా సరే! ఎక్కువకాలం నిలవాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. సరదాలు, సంతోషాలు, కష్టసుఖాలు... అన్నింటిలోనూ ఒకరికొకరుగా కలిసిపోవాలి. అప్పుడే మనసుకి దగ్గరవుతారు.
స్నేహం చేస్తున్నాం కదా అని ఫ్రెండ్ని గుడ్డిగా నమ్మేయమని కాదు. వారి భావాలూ, ఆలోచనలూ, ప్రవర్తన వంటివీ గమనించండి. ఎక్కడైనా తేడా వస్తోంటే స్నేహితురాలిగా...హెచ్చరించండి. మీ ఇద్దరి మధ్య ఎంత స్నేహం ఉన్నా.. కొన్ని పనులు చేయడానికి పరిధిని పెట్టుకోవడం మరిచిపోవద్దు. లేదంటే మీకు తెలియకుండానే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.
ఫ్రెండ్ ఏదైనా సమస్యలో ఉంటే.. గుడ్డిగా సమర్థించడం, లేదంటే నేను చెప్పినా వినలేదంటూ వాదనకు దిగడం వల్ల మీ స్నేహానికి విలువ ఉండదు. స్నేహితురాలు పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. తప్పు తనవైపు లేకపోయినా ఇబ్బందిపడుతోంటే.. కచ్చితంగా మీరు తోడుండాలి. వాస్తవాలనూ, వారి భావోద్వేగాలనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీపై వారికి మరింత నమ్మకం పెరుగుతుంది.
స్నేహితుల మధ్య అపార్థాలకు అవకాశాలను ఇచ్చేది మాటల తూటాలే. మన స్నేహితురాలే అన్న నమ్మకమో లేక మేమేం మాట్లాడినా ఫరవాలేదన్న ధైర్యమో కానీ కొందరు స్నేహితులని చెబుతూనే వారిలోని లోపాలను పదే పదే ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తుంటారు. నిజంగా ఇతరుల నడవడికలో సమస్య ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నమే అయినా.. ప్రతిదానికీ హద్దులుంటాయని గుర్తించండి. లేదంటే నలుగురిలో వారు చిన్నబుచ్చుకుంటారు. ఎంత స్నేహితురాలే అయినా కొంత వ్యక్తిగత స్వేచ్ఛ అవసరమం.