Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా రేపు మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతున్నాం. ప్రతి ఏటి లాగానే ఈ ఏడాది కూడా ఎక్కడ చూసినా కూడా లింగ సమానత్వంపై దృష్టి పెడదాం అంటున్నారు. 2023వ సంవత్సరంలో కూడా ఇంకా లింగ సమానత్వంపై దృష్టి పెట్టండి అని అంతర్జాతీయంగా అంటున్నారు అంటే ఈ ఒక్క కోట్ చాలు మహిళల స్థితి సమాజంలో ఎలా ఉందో తెలుసుకునేందుకు. ఇంకా లింగ వివక్షతకు ఎంత గురవుతుంది అని చెప్పడానికి.
మహిళ తనకంటూ ఒక వ్యక్తిత్వం కోసం పోరాటం చేయకుండా ఇంటికి మాత్రమే అది కూడా స్పెషల్‌గా వంటింటికి మాత్రమే పరిమితమై పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడమే తన జీవిత పరమావధిగా సాగింది ఒకప్పుడు. అక్కడి నుంచి మొదలై తన ప్రయాణాన్ని భూతలం నుంచి విస్తరించి గగనతలం వరకు.. ఎన్నో ఎన్నెన్నో రంగాలలో విస్తరింపజేసుకుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుని నేటి మహిళ - మేటి మహిళగా మారింది. ఈ రూపాంతరంలో స్త్రీ చేసిన పోరాటాలు, త్యాగాలు, మానసిక, శారీరక హింసలు, బలిదానాలు చరిత్రలో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. కానీ తను అనుకున్నంతగా ప్రగతి సాధించగలిగిందా అనేది ఓ ప్రశ్న.
మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నారా..?
నేటి సమాజంలో స్కవెంజర్ లేదా రోడ్లు ఊడ్చే వనిత నుంచి కలెక్టర్ లేదా దేశాధినేతల వరకు ఉన్న యే మహిళకైనా సరే పూర్తి సాధికారత లభించిందా? లింగ సమానత్వం ఏర్పడిందా..? అన్నది మాత్రం ఇప్పటికీ మిలియన్ డాలర్ క్వశ్చన్ గానే ఉంది. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను.. ఒక సంస్థకు ఎవరైనా ఒక మహిళ అధికారి ఉంటే ఎంత మంది పురుషులు ఆమెను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి..! పురుషుడి కన్నా స్త్రీ ఎక్కువ సంపాదిస్తూ, సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతుంటే అలాంటి వారిని ఎంత మంది భర్తలు తమ భార్యలకు సపోర్ట్ చేస్తున్నారు...? చాలా కొద్ది మంది మాత్రమే అలా ఉన్నారని చెప్పొచ్చు. ఇది పురుషుల మీద ద్వేషంతో కాకుండా బాధతో చెబుతున్నటువంటి విషయం.
పురుషాధిక్యతే కారణం
ఇప్పటికీ అమ్మాయిలు అన్నదమ్ములతో సరి సమానంగా అన్ని విషయాలను, అన్ని అవకాశాలను తమ హక్కులను అధికారాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. అలా వాళ్ళు వినియోగించకుండా అడ్డుపడేది కూడా వాళ్ళ ఇంట్లో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది తల్లే. దానికి కారణం సమాజంలో ఉన్నటువంటి అత్యంత హేయమైనటువంటి, దుర్భరమైనటువంటి పురుషాధిక్య పరిస్థితులే. భార్యా భర్తలిద్దరూ ఉన్నత ఉద్యోగస్థులై సంపాదిస్తున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులలో భార్యకు చేదోడువాదోడుగా ఎంతమంది భర్తలు ఉంటున్నారో పరిశీలించాలి.
మనమేం చేద్దాం..?
డియర్ మహిళా...! చీరల కోసం, నగల కోసం, సీరియల్ కోసం కాదు నువ్వు చేయాల్సిన పోరాటం. అవి కాదు నీకు నిజమైన అలంకరణ నిచ్చేది ''ది బెస్ట్ బ్రాండ్ యు కెన్ వేర్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఐడెంటిటీ''. డియర్ గర్ల్....! క్యాట్ వాక్‌లు కాదు నీకు కావాల్సింది. కాన్ఫిడెంట్ వాక్‌లు కావాలి. ఆత్మవిశ్వాసం తొణికిసలాడే చూపులూ, నింగిలోనే కాదూ అన్నింటా సగం అని తెలిపే ధీర నడక కావాలి. సమానత్వం నీకు ఒకరు ఇచ్చేది కాదు.. అది నీ జన్మ హక్కు అంటూ నిరూపించుకునేలాగా నీ ప్రతి కదలికలో నీ జ్ఞానం ప్రతిబింబించేలాగా నీ ప్రతి అడుగు ముందుకు సాగాలి. దానికోసం నీవు చేయాల్సింది చాలా చిన్న విషయమే.
ఆరోగ్యం చాలా అవసరం
ఒక మహిళ జీవితం పరిపూర్ణంగా ముందుకు సాగాలన్నా.. ప్రథమంగా కావాల్సింది ఆరోగ్యవంతమైన శరీరం. ప్రతి ఇంట్లో కూడా సహజంగా ఆరోగ్యాన్ని విస్మరించి కుటుంబం కోసం యంత్రంలా పనిచేస్తూ అనారోగ్యం పాలు అయ్యే వాళ్ళల్లో మొదటి స్థానంలో ఉండేది మహిళే. దీనికి కారణం తనకు తన శరీరం మీద ధ్యాస లేకపోవడం. చిన్ననాటి నుంచి ఒక ఆడపిల్లకు తన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం ఎంత అవసరమో నేర్పించాలి. ఆరోగ్యంవంతమైన శరీరం ఉంటేనే ఆరోగ్యవంతమైన మనసు ఏర్పడుతుంది. సమాజంలో, ముఖ్యంగా మన సమాజంలో స్త్రీలకు ఈ స్పృహ కొరవడిందని కచ్చితంగా చెప్పవచ్చు.
నిర్లక్ష్యం వద్దు
''హెల్తీ మైండ్ రెసిస్ట్ ఇన్ హెల్దీ బాడీ'' ఇది చాలా చాలా నిజం. స్త్రీల ఆరోగ్యం ఎప్పుడు నిర్లక్ష్యానికి గురి అవుతూ ఉంటుంది దీనికి కారణం వాళ్ల మైండ్ సెట్టింగ్స్ కూడా అని చెప్పవచ్చు. ఏ చిన్న జబ్బు వచ్చినా ఏమి జరిగినా దాచేసుకోవడం మహిళలకు చాలామటుకు అలవాటు. చెప్పడానికి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. సహకారం లేని వాతావరణం కూడా దీనికి ఓ ప్రధాన కారణం. ఒక్కసారి యవ్వనాన్ని దాటి 30- 35 ఏండ్లలోకి ఒక మహిళ వచ్చిందంటే ఆమె శరీరంలో ఎన్నో మార్పుల వల్ల ఊబకాయానికి గురవుతుంది. సరైన పోషణ ఉండడం లేదు. తనకు సంబంధించిన చిన్న విషయాలను కూడా పట్టించుకోవాలన్న ధ్యాసే ఉండకపోవడం మహిళలకు సహజంగా తనపైన తమకు ఉండే నిర్లక్ష్యం. చాలా మందికి ఇంట్లో అలాంటి వాతావరణం లేకపోవడం బాధాకరమైన విషయంగా చెప్పొచ్చు.
మీ శరీరాన్ని ప్రేమించుకోండి
అందుకే మొట్టమొదటగా నువ్వు నీ శరీరాన్ని ప్రేమించు. ఎప్పుడైతే ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉంటుందో అప్పుడు ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. ''మెదడుకూ, శరీరానికి మధ్యలో ఒక మంచి కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతుంది'' మంచి ఆలోచనలు వస్తాయి. అలా నిన్ను సృజనాత్మకంగా తీర్చిదిద్దుకుంటూ నీ లక్ష్యసాధనలో ముందుకు వెళ్లడానికి 50 ఏండ్లు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఆనందమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ లేడీస్... లవ్ యువర్ బాడీ. ఎవరైతే తన శరీరాన్ని ప్రేమించుకుంటారో తమ శరీరాన్ని అందంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోగలుగుతారు. అప్పుడు మంచి ఆలోచనలనే వస్తాయి. అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి కూడా చాలా దోహదకారిగా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యమైన, బలిష్టమైన శరీరం ఉన్నవారు తమపై జరుగుతున్న దాడులను కూడా ధైర్యంగా ఎదుర్కోగలరు. ఇటీవలె మెడికల్ విద్యార్థి ప్రీతిపై జరిగిన దుర్మరణాన్ని మనం గమనించవచ్చు. శరీరం ఆరోగ్యవంతంగా ఉంటే మనసు కూడా ఆరోగ్యంగా పనిచేసి సమస్య వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విచక్షణను, ప్రజ్ఞా స్థితిని నేర్పుతుంది. కనుక సో లవ్ యువర్ బాడీ లవ్ యువర్ మైండ్, అండ్ లవ్ యువర్ సోల్. అనేది ప్రతి మహిళా నేర్చుకోవాలి. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే మీ ఆరోగ్యం ఎడల మీరు శ్రద్ధ వహించండి. నీవు ఆరోగ్యంగా ఉండడం సమాజం కోసమే కాదు నీ కోసం కూడా.
శరీరం మాట వినండి
నీవు కనుక నిన్ను నీవు ప్రేమించుకో గలిగితే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. నీకేం కావాలి..! నీ శరీరం మాట్లాడుతుంది విను. శరీరం తనకు ఏమి కావాలో చెబుతుందని మీకు తెలుసా..! ''ఎస్.. బాడీ స్పీక్స్''. నీ శరీరానికి ఎంత శక్తి కావాలి, ఎంత విశ్రాంతి కావాలి. శరీరవయవాలు ఎందుకు సహకరించట్లేదు, ఎందుకు చిరాకు కలుగుతుంది, ఎందుకు అకారణంగా ఏడుపు వస్తుందో చెబుతుంది. దయచేసి వినండి. దానికి సరైన పోషణనిచ్చి సమయానికి మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఉండండి. ఒక తల్లి గనుక ఆరోగ్యవంతురాలయితే ఆ కుటుంబమంతా చాలా ఆరోగ్యంగా హాయిగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు కూడా నాదో విన్నపం. మీ ఇంట్లో ఉన్న మహిళల ఆరోగ్యం ఎడల, వాళ్ళ ఆలోచన ఎడల దృష్టిని నిలపండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ ఇంట్లో ఉన్న మహిళలకు మీరేదైన చేయాలనుకుంటే 'చెక్ దేర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్' ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆనందంగా జీవించే వాతావరణాన్ని ఇవ్వండి. అలాగే మీ ఆరోగ్యం కూడా.. మీ జన్మ హక్కుగానే భావించాలని మరొక్కసారి మహిళలందరి కోరుకుంటాను. చివరిగా మరోసారి నిన్ను నీవు ప్రేమించుకో అని కోరుతూ... అందరికీ మరో మారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- రమాదేవి కులకర్ణి, 8985613123