Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో మహిళలు లేకపోతే దేశ అభివృద్దే ఉండదు. అలాంటి స్త్రీలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని CSW - 67 (కమీషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ విమెన్) 2023 థీమ్ DigitALL : ''ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ''. దీన్ని అమలులోకి తీసుకురావాలని, డిజిటల్ ప్రదేశాలలో మహిళలు, బాలికల హక్కులను రక్షించడం, ఆన్లైన్ , ఐసీటీ - సదుపాయం కల్పించి లింగ ఆధారిత హింసను పరిష్కరించడం అనే ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. నేడు 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా డిజిటల్ ప్రపంచంలో మహిళల పాత్ర ఎలా ఉందో తెలుసుకుందాం...
దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా భాగం పంచుకుంటున్నారు. అయినప్పటికీ చాలా దేశాల్లో మగవారితో సమానమైన గౌరవం, అవకాశాలు స్త్రీలకు లభించడం లేదు. కొన్ని దేశాల్లో మహిళలు కటుంబం అనే నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్నారు. లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. తల్లిగా లాలిస్తూ.. చెల్లిగా తోడుంటూ.. భార్యగా బాగోగులు చూస్తూ.. సేవకురాలిలా పనిచేస్తూ.. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళలకు చాలా దేశాలు క్రీడా, రాజకీయ, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక రంగాలంలో ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నా అవి పూర్తి స్థాయిలో అమలులోకి రావడం లేదు.
డిజిటల్ ప్రపంచంలో మహిళలు
ప్రస్తుతం డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఈ డిటిటల్ యుగంలో ఇంటర్నెట్ సౌకర్యం నిషేదించిన దేశాల్లో కూడా మహిళలు డిజిటల్ వ్యవస్థను విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బాల బాలికలకు, మహిళలకు కుటుంబ నేపథ్యంలో ప్రాథమిక వినియోగం కూడా ఉండడం లేదన్నది యుఎన్ ఉమెన్స్ జెండర్ స్నాప్ షాట్ 2022 నివేదిక ప్రకారం తెలుస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మహిళలు లేకపోవడం వల్ల గత పదేండ్లలో తక్కువ, మధ్య ఆదాయ దేశాల స్థూల దేశీయోత్పత్తి వి1 ట్రిలియన్ తగ్గిందనీ దీనిపై దృష్టి పెట్టకపోతే ఈ నష్టం 2025 నాటికి వి1.5 ట్రిలియన్లకు పెరుగుతుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
అసమానతలు తగ్గించాలి
మహిళలు, బాలికలు వారి హక్కులు, ప్రజల నిత్యావసరాల గురించి అవగాహనను ఆవిష్కరణలో సాంకేతికత, డిజిటల్ విద్యకు లింగ బేధం లేకుండా స్పందించే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చి డిజిటల్ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా స్థూల ఆదాయాన్ని పెంచవచ్చు. ఈ డిజిటల్ లింగ అంతరం ఫలితంగా మహిళలు వెనుకబడిపోవడంతో, డిజిటల్ టెక్నాలజీలతో యాక్సెస్, ప్రావీణ్యం పరంగా పురుషులు, మహిళల మధ్య పెరుగుతున్న అసమానతలను తగ్గించాలి. డిజిటల్ టెక్నాలజీ పురోగమనాలు మానవతావాద, అభివృద్ధి సమస్యలను పరిష్కరించడానికి, 2030 ఎజెండాలో నిర్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అపారమైన అవకాశాలను అందిస్తున్నాయి.
సరైన ఆలోచన ఉంటే
గీతాంజలి రావు... టైమ్ మ్యాగజైన్ మొట్టమొదటి కిడ్ ఆఫ్ ది ఇయర్'. పదిహేనేండ్ల శాస్త్రవేత్త, ఆవిష్కర్త అయిన గీతాంజలి రావు టైమ్ మ్యాగజైన్ మొట్టమొదటి 'కిడ్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికైంది. ఈమె కలుషితమైన తాగునీటి నుండి ఓపియాయిడ్ వ్యసనం, సైబర్ బెదిరింపు వరకు సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను ఉపయోగించారు. మన చుట్టూ అంతర్జాల ప్రపంచం విస్తరించి ఉన్నా... ఆర్థిక రంగంలో మాత్రం అంతగా ఉపయోగించడం లేదు. సరైన ఆలోచన ఉంటే కొద్ది అవగాహనతోనే మన చేతిలో వున్న ఫోన్ ద్వారానే మనం ఏ విద్య నైనా అభ్యసించ వచ్చు.
యూట్యూబ్ ద్వారా...
''మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సంఘ పురోగతిని కొలుస్తాను'' అన్న బీఆర్ అంబేద్కర్ వాక్యాలని గుర్తుచేసుకుంటూ ఈ మధ్యనే విడుదలైన 'జయ జయ జయహే' సినిమానే తీసుకుంటే భర్త కొట్టె దెబ్బల నుండి తప్పించుకోవడానికి ఇంటి దగ్గర వుండి కరాటే నేర్చుకున్న అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్న సినిమా కథ మన చుట్టూ జరిగే హింస నుండి తప్పించుకోవడానికి ఓ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంత వరకు ఎందుకు ఎందరో మహిళలు యూట్యూబ్‌లో తమకు నచ్చిన వంటలు చేస్తూ, నేర్పుతూ, ఆదాయ మార్గాల్ని సృష్టించుకుంటున్నారు. డిజిటల్ విద్య ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు ఏర్పరుచుకునే దిశలు మహిళలు ఆలోచిస్తారని నేటి ఆశిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఆమె'కు చక్కని బహుమతిగా డిజిటల్ విద్య ద్వారా కొత్త ఆశయాలని అందించడమే కాకుండా మనసారా శుభాకాంక్షలు తెలియజేయండి.
- రూపరుక్మిణి.కె
మహిళకు సమానత్వం ఇవ్వాలి
మహిళ కేవలం కొన్ని పనులకే పరిమితం కాకూడదు. అన్నింటిలో సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. DigitAllఅనే ప్రాతిపదికతో ఈ సంవత్సరం కమ్యూనికేషన్ రంగంలో మన సమాన హక్కుల కోసం ఒక కూడికను ఏర్పాటు చేశారు. తద్వారా వెనకబడిన మహిళలను ముందుకు తీసుకువెళ్ళటానికి చర్యలు చేపట్టినందుకు ధన్యవాదములు. కరోనా వల్ల మహిళలకు ఇంటి పని, వంట పనే కాకుండా స్మార్ట్ ఫోన్ ఆవశ్యకత దాని, ఉపయోగాలు, దానిని వాడే తీరు తెలుసుకొని ప్రస్తుతం చాలా వరకు ఆన్‌లైన్‌పైనే ఆధారపడి పోతున్నారు. DigitAll అనేది కేవలం నినాదంలా కాకుండా డిజిటల్‌కు సంబంధించిన అన్నింటిలోనూ మహిళలు కూడా సమానంగా రాణించేలా మనం ఆ ఆధునికతో కూడిన టెక్నాలజీని నేర్చుకోవాలి. టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఎంత ఉపయోగం ఉంటుందో నేనూ ఒక ఉదాహరణే. పదిహేను సంవత్సరాలు టీచర్‌గా పని చేసాను. ఆ సమయంలో స్కూల్లో వాడా టెక్నాలజీ చాలా తక్కువ. ప్రతీది పుస్తకంలో చూసి చెప్పడమే. క్రమంగా పిల్లల మార్కులు ఆన్లైన్ చెయ్యడం, డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేయటం ప్రారంభించారు. అవి ఏర్పాటు చెయ్యడం వలన మాలాంటి వాళ్ళు ఎంతోమంది టెక్నాలజీ గురించి తెలుసుకొని, నేర్చుకొని ఇప్పటి ప్రస్తుత కాలామానానికి సరితూగుతున్నాము. అయితే టీచర్ ఉద్యోగం మానేసి ఎనిమిదేండ్ల కిందట వ్యాపారం మొదలుపెట్టాను. దాంతో కష్టమర్లతో మాట్లాడటానికి వాట్సాప్ వాడడం, మార్కెటింగ్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఫేస్బుక్, బిల్లింగ్, స్టాఫ్ట్ వేర్ వంటికి ప్రస్తుతం అనర్గళంగా వాడగలుగుతున్నాను. కాబట్టి DigitAllకు నేనే నిజమైన సాక్ష్యాన్ని. 50 ఏండ్లు పైబడిన ప్రతి మహిళ జ్ఞాపక శక్తి తగ్గి పోకుండా ఆన్లైన్ పజిల్స్, బ్రెయిన్ గేమ్స్ వంటివి ఆడడం మంచిది.
- వి.ప్రతిభ
ఆన్ డిక్టేషన్ తీసుకుని
ఆడుతూ పాడుతూ ఎం.ఎ. వరకు చదివాను. కానీ ఉద్యోగ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కున్నాను. ఎప్పటికప్పుడు పాతవాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళడం, కుంగిపోకుండా ఉండడం నా మనస్తత్వం. ఏ పనైనా నేను చెయ్యగలను అని చెప్పడం, అలాగే చెయ్యడం అనేదే నన్ను ఈ రోజు డిజిటల్ ప్రపంచంలో ఒక విజేతగా నిలబెట్టింది. కంప్యూటర్ రంగంలో కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఎంతోమంది మానసికంగా కుంగిపోయిన వాళ్ళకి నేర్పించి వాళ్ళ జీవితాలు నిలబెట్టగలిగాను. కంప్యూటర్ నేర్చుకోవడం మొదలుపెట్టిన కొత్తలో చాలా కష్టపడ్డాను. పట్టుదలతో నేర్చుకున్నాను. అవసరమైన వారికి అనువుగా వర్కులు చేసిపెట్టగలడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. అమెరికా నుంచి ఆన్ డిక్టేషన్ తీసుకుని పుస్తకాలకి పుస్తకాలు తయారు చేయడం మరో విజయం. స్వయంకషితో పైకి రావడంతో ఎంతో సంతృప్తి మిగిలింది.
- దామరాజు నాగలక్ష్మి
ఆన్లైన్లోనే ఎక్కువ కోచింగ్
మా అమ్మ నాగమణి, నాన్న రాపాల వెంకటేశ్వరరావు. ఆరవ తరగతి వరకు నేను అవేరేజ్ స్టూడెంట్‌ని. మా నాన్నకి ఆక్సిడెంట్ అయ్యక కుటుంబ బాధ్యతలు అంటే ఏమిటో తెలిసొచ్చాయి. అప్పటి నుండి బాగా చదువుతూ టాప్ 3లో వుండేదాన్ని. ఫస్ట్ టైం నన్ను నేను పేపర్లో చూసుకోవడం, మధిరలో ఈ అమ్మాయికి చదువు రాదు అని చెప్పిన సర్‌తో మీరు చదువు చెప్పిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ని మార్కులు వచ్చాయా అని నాన్న అడిగారు. అప్పుడు, ఆ తర్వాత సీఏ క్వాలిఫై ఐనప్పుడు .. మా నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారు. పేరెంట్స్ హ్యాపీగా ఉంటే అది నా వల్లే కాబట్టి నాకెంతో తృప్తి నిచ్చింది. గుంటూరులోని మాస్టర్‌మైండ్ కాలేజీలో చేరి సీరియస్‌గా చదివాను. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా చూపించి ఔట్స్టేషన్ ఆడిట్స్కి అబ్బాయిలనే పంపేవారు. అలాగే కాలేజీలో అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకోకూడదు అనే రూల్ పెట్టారు. దాంతో జాబ్ చేసేటపుడు కూడా అబ్బాయిలతో మాట్లాడడానికి భయం వేసేది. ఒక్కోసారి రాత్రి ఆలస్యమైతే అమ్మ ఈ ఉద్యోగం వద్దు మానేసెరు అనేది. అయితే నేను కోచింగ్ తీసుకునేటపుడు ఆన్లైన్ క్లాసులు చూసి చాలా నేర్చుకున్నాను. ఇలా డిజిటల్ రంగం నాలాంటి అమ్మాలకు ఎంతో ఉపయోగపడింది. నీ గోల్ నీకు క్లియర్‌గా ఉంచుకో దానికి కష్టపడు. ఇంట్లో తిడతారు, ఏం చెయ్యట్లేదు, టైం వేస్ట్ చేస్తున్నావు అని అంటుంటారు. అయితే ఒక్కసారి విజయం సాధించామా అన్నీ మారిపోతాయి. నీ ఆలోచనలకు నువ్వే పెట్టుబడి తెచ్చుకోవాలి. మీ తల్లిదండ్రుల మీద ఆధారపడొద్దు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఓ లక్ష్యంగా నడిచిన ప్రయాణంలో ఇప్పుడు నేను చార్టెడ్ అకౌంట్‌గా స్థిరమైన సంపాదనతో నలుగురికీ సహాయం చేసే స్థాయికి చేరుకున్నాను.
- ఆర్.ప్రసన్న