Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాపారవేత్తలంటే పెద్ద పెద్ద చదువులు చదివి నేర్చుకున్న నైపుణ్యాలను వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించే వారే అనుకుంటారేమో! అంటే మీరు తప్పులో కాలేసినట్లే! అవును మరి.. ఏ మాత్రం చదువు రాని ఒక మహిళ తన స్వయంకషి, పట్టుదలతో పైకెదిగిన క్రమం మిమ్మల్ని ఆశ్చర్య చకితుల్ని చేయకమానదు. ఆమే పశుల మంగ. భారతదేశంలో 400 సంవత్సరాలకు పూర్వం నుండి ఉన్న అరుదైన చిత్రకళ చేర్యాల(చెరియాల) నకాశీ కళను జీవనోపాధిగా ఎంచుకుంది. చదువు లేకున్నా మొక్కవోని ధైర్యంతో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఇప్పుడు లక్షలలో బిజినెస్ సాగిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో...
ఉప్పల్‌కు 12కి.మీ. దూరంలో సింగారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించింది మంగ. చదువులేకపోయినా చిన్నతనం నుండి ఎంతో చురుగ్గా, ఆత్మవిశ్వాసంతో ఉండేది. ఇంటికి చిన్న కూతురైనా తండ్రి చనిపోయినప్పుడు అక్కకు, అమ్మకు తానే ధైర్యం చెప్పింది. నిరుపేద కుటుంబం కావడం వల్ల తల్లి బిడ్డలను చదివించలేకపోయింది. దాంతో 17 ఏండ్లకే మంగ సిద్దిపేటకు చెందిన మల్లేశాన్ని పెండ్లి చేసుకొని అత్తారింటిలో అడుగు పెట్టింది. మల్లేశానిది కూడా పేద కుటుంబమే. ఇంట్లో వారు మంగను బీడీలు చుట్టడానికి రమ్మన్నారు. కానీ ఆమె అందుకు ఇష్టపడలేదు. భర్త లేపాక్షి గోల్కొండలో నేర్చుకున్న చేర్యాల చిత్రకళను తానూ నేర్చుకోవాలి అనుకుంది. ఇదే విషయాన్ని భర్తతో చెప్పింది. భార్య కోరికను, ఆమె పట్టుదలను కాదనలేకపోయాడు మల్లేశం. అతి తక్కువ సమయంలోనే ఆ కళను, అందులోని మెళుకువలను ఒంట పట్టించుకుందామె. ఈ కళలో అందమైన చిత్రాలను కాటన్ బట్టపై వేసి, బాగా ఆరబెట్టి చుట్టూ చెక్కను అమర్చి ఫ్రేంలో బిగించి చక్కగా గోడపై అమర్చేందుకు వీలుగా చిత్రపటాన్ని తయారు చేస్తారు.
అడిగి వేయించుకున్నారు
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చిత్రపటాలు వేయడం మొదలు పెట్టారు. మొదట్లో తమకు తెలిసిన వారు మాత్రమే కొంటూ ఉండేవారు. పెద్దగా ఆదాయం ఉండేది కాదు. సీజన్లో దగ్గర ఊరి వాళ్ళు తమకు కావలసిన పురాణ కథలకు, మహాభారతం వంటి ఇతిహాసాలకు సంబంధించిన బొమ్మలు అడిగి వేయించుకొనేవారు. ఆర్డర్లు ఆ సీజన్లో మాత్రమే ఉండేవి. మిగతా సమయాలలో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉండేది. తర్వాత మాస్కులుగా ధరించే కుడ్యాలు తయారు చేయడం మొదలుపెట్టారు. అందమైన ముఖాలను చేసి పెయింటింగ్ వేసేవారు.
ఒక నకాషీ బొమ్మ చేయడానికి
వివిధ దశల్లో ఏడుసార్లు ఆరబెట్టాలి. తయారీకి ఎటువంటి రసాయనాలు వాడకూడదు. సహజ సిద్ధంగా దొరికే రంగురాళ్ల రంగులు, తిరుమని చెట్ల బంక, కిరోసిన్ దీపం మసి, శంఖంపొడి, కూరగాయల నుండి తీసిన రంగులతో ఈ చిత్రాలను బొమ్మలను తయారు చేస్తే నాలుగైదు దశాబ్దాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఆకారాన్ని దిద్దిన తర్వాత ఒకరోజు బాగా ఎండబెడతారు. బాగా ఎండిన వాటిపై కాటన్ క్లాత్‌ను డల్లాతో అతికించి ఆరిన తర్వాత దానిపైన వైట్ పెయింటింగ్ వేస్తారు. మంగ దంపతులు తయారీలో ఎక్కడా రాజీపడరు. నాణ్యత గల రంగులనే వాడతారు. వీటిని విజయవాడ నుండి తెచ్చుకుంటారు. అందులో తిరుమన్ గోంద్ అనే మంచి రకం జిగురు మాత్రమే వాడతారు. కలర్స్ వేసిన ఈ మాస్కులకు బ్లాక్ కలర్‌తో లైనింగ్ గీసి ఆ కలర్ పోకుండా ఉండటానికి, మెరుపు కోసం వార్నిష్ వేస్తారు. ఇలా బొమ్మలు చేస్తూ అడిగిన వారికి అడిగిన విధంగా అందిస్తూ వచ్చిన డబ్బులతో సద్దుకుపోతూ ఉన్నారు.
అభివృద్ధి చెందుతూ...
కొన్ని ఏండ్ల వరకు ఇదే వత్తిని జీవనాధారం చేసుకొని గడిపిన వారి కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి. తెలిసినవారు ఎవరో లేపాక్షి షోరూం వారు ఇలాంటి ప్రొడక్ట్స్ కొంటారని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. వారు కొంత స్టాక్ కొనుగోలు చేసి డబ్బులిచ్చారు. తమ దగ్గర స్టాక్ అయిపోయినప్పుడల్లా లేపాక్షి వారు మంగ దగ్గర నుండి స్టాక్ తీసుకోవడం మొదలు పెట్టారు. దాంతో కుటుంబం ఆర్థికంగా కాస్త నిలదొక్కుకుంది. ఒకసారి గొల్లలకు కథలు చెప్పేవారు 52 బొమ్మల సెట్టు కావాలంటూ వచ్చారు. వారు అడిగిన విధంగా అడిగిన సమయానికి మొత్తం తయారుచేసి ఇచ్చారు. ఇక ఆగకుండా అభివద్ధి మెట్లను ఎక్కటం మొదలుపెట్టారు మంగ. మొట్టమొదటగా గోల్కొండ డిసిహెచ్ వాళ్లు 20 మంది మహిళలకు ట్రైనింగ్ ఇప్పించి స్టైఫండ్ ఇచ్చారు. గోల్కొండ ఎంపోరియం వారు ఎన్నో విధాలుగా మద్దతు ఇచ్చారు. ఏ రకంగా ముందుకు వెళ్లాలో కూడా తెలిపారు. ఒకసారి లలిత కళా అకాడమీ వారు అద్భుతమైన ఈ చిత్రకళను గుర్తించి వీరిని మెక్సికోకి పంపించారు. అక్కడ వర్క్ షాప్ చేయించి రోజుకి 5,000/- వరకు అందించేవారు.
కరోనా కబళించింది
అంతా సజావుగా సాగితే అనుకునే వాళ్ళు ఎవరుంటారు. నెలరోజుల తర్వాత వచ్చిన పెరూ ఎగ్జిబిషన్ కోసం నెట్మా వాళ్లు పెరు ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్తామన్నారు. ఆ ప్రదర్శనకు తెలంగాణ నుండి నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేశారు. అందులో చేర్యాల పెయింటింగ్స్ కూడా ఎంపికవడం విశేషం. వాళ్లు మొదట మీ అకౌంట్లో డబ్బు పెట్టుకోవాలన్నారు. తమ దగ్గర ఉన్న రెండు లక్షల స్టాకుతో పాటు, వేరే వారి దగ్గర మరో రెండు లక్షల స్టాక్‌ను కొనుక్కొని నాలుగు లక్షల స్టాకు ట్రాన్స్‌పోర్ట్‌లో వేశారు. బయలుదేరేటప్పుడు ఇంకో లక్ష రూపాయల స్టాక్ తీసుకువెళ్లారు. కష్టమనేది చెప్పి వస్తుందా? అక్కడికి వెళ్లి ఒక్కరోజు అయిందో లేదో కరోనా వచ్చి ట్రాన్స్‌పోర్ట్‌లు ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. స్టాకు ఆగిపోవడంతో పాటు మంగ భర్త కూడా అక్కడే ఆగిపోయారు. ఆ సమయంలో ట్రాన్స్‌పోర్ట్‌లో ఆగిపోయిన ఐదు లక్షల స్టాకు జాడ లేకుండా పోయింది. ఎట్టకేలకు ఎన్నో అగచాట్లు పడి భర్త ఇంటికి చేరినా కరోనా పై అవగాహన లేని చుట్టుపక్కల వారి మాటలు బెంబేలెత్తించేవి. మంగ ఆ గడ్డు పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంది. ఒక పక్క స్టాకు కోల్పోవడంతో మళ్లీ ఎక్కడైతే మొదలుపెట్టారో వారి పరిస్థితి అక్కడికే చేరుకుంది. కరోనా కారణంగా మరో సంవత్సరం కూడా వారి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడవలసి వచ్చింది.
వి హబ్ సహకారంతో...
సరిగ్గా అదే సమయంలో వి హబ్ వారితో పరిచయమయింది. వారే ఫోన్ చేసి మీరు ఇందులో జాయిన్ అవుతారా అని అడిగారు. దొరికిన తీగను పట్టుకుని ముందుకు వెళ్ళడం తప్ప ఏమీ ఆలోచించలేని పరిస్థితి అప్పుడు. తనకు ఏమీ తెలియకపోయినా ప్రయత్నం అయితే చేద్దాం అని నిర్ణయించుకుంది. కరోనా కాస్త తగ్గాక విహెబ్ నిర్వహించిన మీటింగులకు ఒకటి రెండు సార్లు వెళ్ళి వచ్చింది. వారు నిర్వహించే కార్యక్రమాలన్నీ చాలా నచ్చాయి. వారు చేర్యాల ప్రొడక్ట్స్ చూసి చాలా ముచ్చటపడి తాము కొనుగోలు చేస్తామన్నారు. అలా అనడమే కాకుండా అప్పటికప్పుడే స్టాక్ అంతా కొనుక్కున్నారు.
ఒకదాని వెంటే ఒకటి
2020లో డి.సి.హెచ్ లేపాక్షి వారు 20 మందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వమని అడిగారు. ఊరిలో దగ్గరగా ఉన్నవారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు వచ్చి చాలా శ్రద్ధగా నేర్చుకున్నారు. వారిలో పదిమంది ఇప్పుడు ఏదైనా పెద్ద ఆర్డర్లు వచ్చినప్పుడు పని చేయడానికి వస్తూ ఉంటారు. ఇద్దరైతే ప్రతిరోజు వస్తూ ఉంటారు. మంగ, మల్లేశంలతో పాటు పనిచేస్తారు. ఆర్డర్ వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి మరి కొంత మందిని పిలుస్తూ ఉంటారు. ఇలా తామే కాక ప్రతిరోజు మరో ఇద్దరు, ముగ్గురికి పని కల్పించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటారు మంగ. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగయింది కదా అనుకునే తరుణంలోనే కుటుంబంలో ఒకదాని వెంట మరొక ఉపద్రవం సంభవించింది. మంగ అమ్మ, అత్తయ్య వారం రోజుల తేడాతోనే చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటయింది. అప్పుడే భర్తకు యాక్సిడెంట్ అయ్యింది. ఒకే నెలలో జరిగిన ఈ సంఘటనల వల్ల మళ్ళీ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. భర్త ఆరోగ్యం మెరుగు పడ్డా వి హబ్ వారిని సంప్రదించింది. వారు మంగ దగ్గర ఉన్న స్టాక్ కొనడానికి మళ్లీ ముందుకొచ్చారు. ఆవిధంగా నెలనెలా కొంత స్టాక్ కొనుగోలు చేస్తూ దాదాపుగా రెండు లక్షల వరకు తీసుకున్నారు. అది ఆ కుటుంబం మళ్లీ ఆర్థికంగా కోలుకోవడానికి దోహదపడింది. ''మేము మళ్లీ నిలతొక్కుకోగలిగామంంటే దానికి కారణం వి హబ్ దీప్తి గారే'' అంటారు మంగ. క్రమంగా కుటుంబం ఆదాయం కూడా కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి, విదేశాలనుండి వర్క్ షాపులకోసం ఆహ్వానాలు అందడం మొదలైంది.
రాష్ట్ర స్థాయి ఉత్తమ కళగా
నిఫ్ట్ కాలేజీ నుండి, నాగపూర్ నుండి స్టూడెంట్స్ వచ్చి ఈ చేర్యాల కుడ్య చిత్ర, శిల్ప తయారీ విధానాన్ని నేర్చుకొని వెళుతుంటారు. భారతదేశం మొత్తం మీద ఇంతటి అరుదైన చేర్యాల పెయింటింగ్ వేసే కుటుంబాలు ఏడు మాత్రమే ఉన్నాయి. వీటికి సంబంధించి అచ్చులు, ప్రింటింగ్లు తయారు చేయకూడదని గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది. ఇంతటి అరుదైన కళను రాష్ట్రస్థాయి ఉత్తమ కళగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఏణవారు అవార్డును అందజేసారు. కాటంరాజు, గంగాదేవి, గొల్లల బొమ్మలకుగాను స్టేట్ అవార్డు 80,000/- ల రూపాయలు గెలుచుకున్నారు. ఈ అవార్డును ఆమె భర్త మల్లేశం అందుకున్నారు. సిద్దిపేటలో జరిగిన ఎగ్జిబిషన్లో కూడా వీరి స్టాల్ అందరి దష్టిని ఆకట్టుకొని ప్రథమ స్థానంలో నిలిచి అవార్డును కైవసం చేసుకుంది.
షోకేసుల్లో అలంకరణగా...
మంగకు ఇద్దరు ఆడ పిల్లలు. ఇద్దర్నీ పెద్ద చదువులు చదివించాలని అనుకుంటోంది. పెద్ద పాప పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండవ పాప 9వ తరగతి చదువుతోంది. వారిద్దరూ ఖాళీ సమయంలో తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉంటారు. మాకు ఆంగ్లం అస్సలు రాదు. అర్థం కానివన్నీ మా పిల్లలే చదివి చెబుతుంటారు అంటున్నప్పుడు మంగ కళ్ళలో ఒకింత గర్వంతో కూడిన మెరుపులు కనిపిస్తాయి. మారుతున్న పద్దతులతో పాటు మన ఆలోచనను కూడా మార్చుకోవాలి. మంగ మొదట పెయింటింగ్స్‌ని ఖాదీపైనా, కాన్వాస్ పైన ఎక్కువగా వేస్తూ ఉంటారు. తర్వాత సిల్క్ క్లాత్‌ల పైన కూడా వేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు పెళ్లిళ్లలో తెరచల్లాలకు వీరు వేసిన పెయింటింగ్స్‌ని వాడుతున్నారు. చేర్యాల చిత్రకళతో ఉన్న పెన్ స్టాండులు, కీ చైన్లను, గణపతి, అర్ధనారీశ్వరుడి మాస్కులను రిటర్న్ గిఫ్టులుగా ఇస్తున్నారు. షో కేసుల్లో అలంకరించుకోవడానికి ఎంతో అందమైన కళాకతులను తయారు చేస్తున్నారు. ఆర్డర్ ఇచ్చి చేయించుకునే వారికి వారు చెప్పిన విధంగా తయారు చేసి కొరియర్ చేస్తున్నారు. మరికొందరు ఈ పెయింటింగ్‌లను తమ ఇంటి గోడల పైన వేయించుకుంటున్నారు.
తనదైన ఆత్మవిశ్వాసంతో...
అద్దె ఇంట్లో పనికి ఇబ్బంది అవ్వటం వల్ల సొంత ఇంటి కోసం సహాయం అడగగా విహబ్ వారు సమ్మతించి కొంత లోన్ మంజూరు చేసారు. ఆ మొత్తంతో సొంత ఇల్లు కట్టుకొని మరింత మందికి ఉపాధి కల్పించగలనని తనదైన ఆత్మవిశ్వాసంతో చెబుతూ ముందుకు సాగుతున్నారు మంగ. మార్కెటింగ్ నైపుణ్యాన్ని జోడించి సరికొత్త ఆవిష్కరణలతో మరింత ఉపాధి పొందుతున్నారు. నెలకు 10,000 రావడం గగనమయ్యే పరిస్థితి నుండి ఇప్పుడు నెలకు 70,000/- వరకూ సంపాదించ గలుగుతున్నారు. వి హబ్ వారి వల్ల చేర్యాల పెయింటింగ్‌కు మరింత గుర్తింపు వచ్చింది. ఎక్కువ మందికి దీని గురించి తెలిసింది. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది గుర్తు పడుతున్నారు అని సంతోషంగా చెప్తుంటారు మంగ.
- విశ్వైక,
9550183143