Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాడుకు చెందిన సుజాత కాంతన్‌కు జ్వరం వచ్చినప్పుడు వయసు కేవలం ఒకటిన్నర సంవత్సరాలు. ఆ జ్వరం కేవలం రెండు గంటలు మాత్రమే ఇబ్బంది పెట్టింది. కానీ అదే పోలియోకి కారణమైంది. జీవితాంతం వికలాంగురాలుగా మిగిలిపోయింది. ఇప్పుడు 42 సంవత్సరాల వయసులో సుజాత అక్క (ఆమెను ముద్దుగా పిలుస్తారు) వికలాంగ హక్కుల ఛాంపియన్‌గా, న్యాయవాదిగా తమిళనాడు చుట్టుపక్కల ఉన్న వందలాది మంది వికలాంగుల జీవితాలను మార్చేస్తుంది. తన రాష్ట్రంలో వికలాంగ మహిళల హక్కుల కోసం పనిచేసే ట్రస్ట్ నడుపుతూ వికలాంగ మహిళల అభివృద్ధి వేదిక వ్యవస్థాపకురాలిగా ఉంది.
''నేను ఆరోగ్యకరమైన బిడ్డగా పుట్టాను. నా మొదటి పుట్టినరోజుకు ముందు నడవడం ప్రారంభించాను. బట్ట ఊయలలో నుండి బయటకి రాలేక మళ్లీ నిలబడలేక పడిపోయిన ఆ రోజును మా నాన్న గుర్తు చేసుకున్నారు. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ నాకు పోలియో ఉన్నట్లు నిర్ధారణ అయింది. నా కుడి కాలు పని చేయలేదు'' అని సుజాత అంటున్నారు.
తీవ్ర ఆవేదనతో...
చెన్నైలోని థౌజండ్ లైట్, క్రీమ్స్ రోడ్, తీదీర్ నగర్లో పెరిగిన తొమ్మిదేండ్ల సుజాతకు వరుస శస్త్రచికిత్సలు జరిగాయి. పాఠశాల కోసం ధరించే ప్రత్యేక షూలను అమర్చారు. మిగిలిన పిల్లలు నేలపై కూర్చోగా, ఆమెకు ఎక్కువ స్థలం అవసరం కావడంతో విడిగా కూర్చునేది. తన కాలు పని చేయడం లేదని ఇంట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేది. తన బూట్లను విసిరేసి సపోర్టుతో నడవడం ప్రారంభించింది. అలా 10వ తరగతి పూర్తి చేసింది. ''నాకు లెక్కలంటే చాలా కష్టం. దాంతో పరీక్షల్లో ఫెయిలయ్యాను. దాంతో చదువును వదులుకోవాలని నిర్ణయించుకున్నాను'' అని ఆమె నవ్వుతూ చెప్పింది. చదువు మానేసిన తర్వాత సేల్స్‌పర్సన్‌గా పని చేయడం ప్రారంభించింది.
హక్కుల న్యాయవాదిగా...
''నేను PCOని నిర్వహిస్తున్నప్పుడు వారి హక్కులు, ప్రభుత్వం నుండి వారు పొందగల ప్రయోజనాల గురించి పెద్దగా అవగాహన లేని చాలా మంది వికలాంగులను నేను సంప్రదించాను'' అని ఆమె చెప్పింది. అలా వికలాంగుల హక్కుల న్యాయవాదిగా సుజాత ప్రయాణం మొదలైంది. వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆమె వారికి సహాయం చేసేది. వారి తరపున ఫారమ్‌లను నింపి, తహశీల్, కలెక్టర్ కార్యాలయానికి వారితో పాటు వెళ్లేది. ప్రతి నెలా డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు వారిని బ్యాంకుకు తీసుకెళ్లేది. ''నా కుటుంబం, స్నేహితుల ప్రేమ, మద్దతుతో నేను సాధారణ జీవితాన్ని గడిపాను. పింఛను అందజేసే రోజంతా నేను బిజీగా ఉంటాను. మిగిలిన సమయంలో నేను నా పనిపై దృష్టి సారిస్తాను. ప్రజలకు అవసరమైనప్పుడు సహాయం చేస్తాను'' అంటుంది సుజాత.
పెన్షన్ నిలిపివేస్తే...
2017లో మొత్తం కమ్యూనిటీ పెరుంబాక్కంలో పునరావాసం పొందవలసి వచ్చింది. సుజాత ఆ ప్రాంతంలో దాదాపు 300-350 మంది వికలాంగులను గుర్తించారు. వారి తొలగింపు, పునరావాసం తర్వాత పెన్షన్ ఒక సంవత్సరం పాటు నిలిపివేశారు. ఎందుకంటే వారు మళ్లీ దరఖాస్తు చేయడానికి ముందు వారి చిరునామాను మార్చవలసి వచ్చింది. ''పింఛను రూ. 1,000 మాత్రమే అయినప్పటికీ వీరికి అది పెద్ద మొత్తం. దాంతో పెన్షన్ ఆగిపోవడంతో ఎంతో నిరాశ చెందారు. వికలాంగులకు మాత్రమే కాకుండా వితంతువులు, ఇతరులకు పింఛను పునరుద్ధరించడానికి నేను చాలా కష్టపడ్డాను'' అని ఆమె పంచుకున్నారు.
మహమ్మారి సమయంలో...
సుజాత వికలాంగులకు సహాయం చేస్తున్న ఎన్జీఓల గురించి, వారు తన కమ్యూనిటీకి ఎలా సహాయం చేయగలరు అనే సమాచారాన్ని కూడా సేకరించారు. వసంతం ఫౌండేషన్ ద్వారా తమిళనాడు వ్యాప్తంగా 50 మందికి వీల్ చైర్ల పంపిణీని ఆమె సులభతరం చేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో చిన్న దుకాణాలు లేదా పుష్కరాలను నడుపుతున్న వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వారికి మద్దతు ఇవ్వడానికి, వారి వ్యాపారాలను పునఃప్రారంభించటానికి, ఆదాయాన్ని సంపాదించడానికి, సహాయం చేయడానికి ఆమె ఎన్జీఓలను సంప్రదించింది. చాలా మంది వికలాంగులు, వారి కుటుంబాలు రోజువారీ కూలీ కార్మికులు.
వ్యాపారాలు చేసుకునేలా...
''వికలాంగులకు ఉపాధి చాలా అరుదు. మా పిల్లలకు స్కాలర్షిప్లు లేవు. నేను 10 మంది కళాశాల విద్యార్థులకు (అందరూ వికలాంగుల పిల్లలే) రూ. 2 లక్షల విలువైన స్కాలర్షిప్లు వచ్చేలా చేయగలిగాను'' అని ఆమె జతచేస్తుంది. నిధుల రూపంలో సహాయాన్ని రూపొందించడం, పంపిణీ చేయడంతో పాటు, సుజాత వికలాంగులను వారి ఇళ్ల నుండి బయటకు రావడానికి, నమ్మకంగా ఉండటానికి, వ్యాపారాలను కూడా నిర్వహించేలా ప్రేరేపిస్తుంది. తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన షీలా అనే వికలాంగ మహిళ ఉదాహరణను పంచుకుంటూ ''షీలా తన ఇంటి నుంచి బయటకు రాలేదు. నేను ఆమెతో కలిసి గంటల తరబడి కూర్చునేదాన్ని. ఆమెని బయటకు వెళ్లి ఏదైనా చేయమని ప్రోత్సహించాను. ఆమె కోసం ఒక చిన్న గార్మెంట్స్ దుకాణాన్ని తెరిచాను. తర్వాత ఆమె ఆ దుకాణాన్ని విజయవంతంగా నడపడం ప్రారంభించింది. ప్రభుత్వం నుండి స్కూటీ పెప్ కూడా ఇప్పించగలిగాను'' అని ఆమె జతచేస్తుంది.
కమ్యూనిటీ ఛాంపియన్‌గా
వికలాంగుల హక్కుల ఛాంపియన్‌గా చేస్తున్న కృషికి తోడుగా ఆమె డెవలప్మెంట్ ఫోరమ్ ఫర్ ఉమెన్ విత్ డిసేబిలిటీని ప్రారంభించింది. ఇది భారతదేశం నలుమూలల నుండి 300 మంది సభ్యులతో ఒక ట్రస్ట్‌ను ప్రారంభించింది. దీనితో పాటు డిప్రైవ్డ్ అర్బన్ కమ్యూనిటీస్ కోసం ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్స్ సెంటర్ స్థాపకురాలు వెనెస్సా పీటర్. గత ఆరు నెలలుగా సుజాత ఇండస్ యాక్షన్ సమాజ్/సముఘం 3.5శాతం కార్యక్రమంలో యాక్టివ్ ఛాంపియన్‌గా ఉంది. మరో ఇద్దరు తోటి ఛాంపియన్లతో కలిసి వారి ప్రాంతంలో RTE 12 (1) (c)పై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 A ప్రకారం 6 నుండి14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు ఉంది. ఈ హక్కును అమలు చేయడానికి, ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, సాధారణంగా విద్యా హక్కు (RTE) చట్టం 2009 అని పిలుస్తారు. ఇది 2009లో రూపొందించబడింది. 2010లో అమలులోకి వచ్చింది. వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందించడం, ఒక్కో తరగతిలో కనీసం నాలుగింట ఒక వంతు వికలాంగ పిల్లలను చేర్చుకోవాలని ఇందులో పొందుపరిచారు. సుజాత తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని తన జట్టు సభ్యులకు మద్దతుగా, వారు ఎదుర్కొన్న సవాళ్లను పరిష్కరించడానికి ఉపయోగిస్తుంది.
భవన నిర్మాణ కార్మికులకు అండగా
ప్రస్తుతం సుజాత బృందం అసంఘటిత రంగ కార్మికుల జీవనోపాధి హక్కుపై కూడా దృష్టి సారిస్తోంది. తమిళనాడులోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన అవగాహన కల్పించడం, 50 మంది నిర్మాణ కార్మికులకు పథకాలను చేరువ కావడం ఈ కార్యకలాపాలలో భాగంగా ఉంది. వారు కనీసం 90శాతం మంది భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులు పొందడానికి సహాయం చేస్తున్నారు. ఇ-సేవాయిపై ఇండస్ యాక్షన్ నిర్వహించిన పైలట్ అధ్యయనం ఫీల్డ్ టీమ్‌లో సుజాత కూడా భాగం, ఇ-సేవాయి ఆపరేటర్లు, పౌరులతో వారి విధులు, దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఆరు నెలలు సుజాత జీవితాన్ని గణనీయంగా మార్చేశాయి.
ప్రభుత్వ పథకాలపై అవగాహన
''నేను Google డాక్స్, డ్రైవ్, మీట్ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. సమావేశాలను ప్లాన్ చేశాను. చివరకు నా సోమరితనాన్ని వదిలించుకున్నాను. నేను చాలా కాలంగా ఫీల్డ్‌లో ఉన్నాను'' అని ఆమె చెప్పింది. సౌత్ జోన్ ఆపరేషన్స్, ఇండస్ యాక్షన్ అసోసియేట్ అయిన జయసుందరి.ఎస్ మాట్లాడుతూ ''మొదటి బృందంలోని ఐదుగురు కమ్యూనిటీ ఛాంపియన్ల శిక్షణలో ప్రభుత్వ పథకాల అవగాహన, డాక్యుమెంటేషన్, దరఖాస్తు ప్రక్రియపై దృష్టి సారిస్తుంది. ఇందులో శిక్షణ, భాగస్వామ్య పద్దతి, దీర్ఘకాలంలో వారు సంఘం నాయకులుగా మారడం వంటివి ఉంటాయి. ఇది వాటాదారుల పరస్పర చర్యలు, ప్రభుత్వ అనుభవాలు, అనుభవపూర్వక శిక్షణను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ట్రస్ట్ కార్యకలాపాల్లో భాగంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం పట్ల సుజాత ఉత్సాహంగా ఉన్నారు. చివరగా ఆమె ''నేను స్కూటర్ నడపడం ప్రారంభించాను'' ఆమె గర్వంగా చెప్పి తన మాటలు ముగించింది.
- సలీమ