Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితాల్లో భాగంగా మనకు అప్పుడప్పుడూ ఎదురయ్యే సమస్యలు మనలో మానసిక ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం అందరి జీవితాల్లోనూ సర్వసాధారణంగా మారిపోయాయి. అందుకే వీటి నుంచి బయటపడడానికి చాలామంది వ్యాయామం, ధ్యానం.. వంటివి చేయడంతో పాటు వారికి నచ్చిన పనులు చేయడం.. వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా అనుసరిస్తున్నారు. అయితే ఇంట్లో మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే కొన్ని మొక్కలు కూడా మనలో ఉండే మానసిక ఆందోళనల్ని దూరం చేస్తాయి. కొన్ని మొక్కలు మన మూడ్‌ని ప్రభావితం చేయడమే కాదు.. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించి తిరిగి మనల్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఇంతకీ ఆ మొక్కలేంటో తెలుసుకుందాం...
తులసి: మన చుట్టూ ఉండే ఆకుపచ్చని మొక్కలు కంటికి ఇంపుగా కనిపించడమే కాదు.. వాటి నుంచి వెదజల్లే సువాసనలూ మనలోని ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాంటి వాటిలో తులసి కూడా ఒకటి. దీనిలో ఉండే లినాలూల్ అనే సమ్మేళనం సువాసనల్ని వెదజల్లుతుంటుంది. దీన్ని పీల్చడం వల్ల ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే ఉపశమనం కలుగుతుందట. ఇలా తులసి ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసి మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
రోజ్మేరీ: ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగంగా చాలామంది దీన్ని ఇంటి అలంకరణకు ఉపయోగిస్తుంటారు. ఇలా ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఈ మొక్క మానసిక సమస్యల్ని సైతం దూరం చేసి సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. కారణం దీన్నుంచి వెలువడే సువాసనే. అంతేకాదు దీని నుంచి తయారుచేసిన నూనెను సౌందర్యపరంగా ఉపయోగించడం, వంటకాల్లో వాడడం వంటివి మనకు తెలిసిందే. ఇలా ఇటు ఆరోగ్యాన్నీ, అటు అందాన్ని కూడా పెంపొందిస్తుందీ మొక్క.
గులాబీ: గులాబీ మొక్కతో మనలోని ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయి. ఓ అధ్యయనం ప్రకారం.. ఒత్తిడితో సతమతమవుతున్న వారు ఈ పూల మొక్క వైపు కాసేపు తదేకంగా చూస్తే చాలు వారి ఒత్తిళ్లన్నీ మాయమై మనసంతా సంతోషంతో నిండిపోతుందట. మరి మీ మూడ్ కూడా సంతోషంగా మారిపోవాలంటే గులాబీ మొక్కపై మీరూ ఓ లుక్కేయండి.
లావెండర్: పర్పుల్ కలర్లో కంటికి ఇంపుగా కనిపించే పూల మొక్క లావెండర్. చాలా అరుదుగా కనిపించే ఈ మొక్క ఖరీదు కూడా చాలా ఎక్కువే. ఇది వెదజల్లే సువాసనలు మనలోని మానసిక ఆందోళనల్ని దూరం చేసి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. కాబట్టి ఇంత ఖరీదైన మొక్కను ఇంట్లో పెంచుకునే అవకాశం లేనప్పుడు లావెండర్ ఫ్లేవర్‌తో తయారుచేసిన సెంటెడ్ క్యాండిల్స్, రూమ్ ఫ్రెష్నర్స్.. మొదలైన వాటిని ఇంట్లో భాగం చేసుకోవాలి. దాంతో కూడా ఆందోళనగా ఉన్నప్పుడు మన మూడ్‌ని సంతోషంగా మార్చుకునే వీలు ఉంటుంది.