Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యం ఆమెకు ప్రాణం. తెలుగంటే అంతులేని అభిమానం. సమాజ మార్పులో సాహిత్యం అత్యంత శక్తివంతమైన సాధనమని బలంగా నమ్మిన వ్యక్తి. రాసే ప్రక్రియ ఏదైనా సామాజిక స్పృహ తప్పని సరి అంటారు. తన రచనల్లోనూ అదే కనబరుస్తారు. ఓ రచయితగా సమాజాన్ని, ఓ తల్లిగా ఇంటిని, ఓ ఉపాధ్యాయిని విద్యార్థులను తీర్చిదిద్దుతూ సాహిత్య రంగంలో కొనసాగుతున్నారు. ఆమే పులి జమున. ఆమె చేస్తున్న సాహితీ సేద్యం గురించి నేటి మానవిలో...
జమున హన్మకొండలో జన్మించారు. తల్లిదండ్రులు బొజ్జ అమృతాదేవి, కనకరాజ్. ఈమెకు నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు. తండ్రి చదువుకున్నది కేవలం ఆరో ఫారమైనా స్వయంకృషితో ఎలక్ట్రానిక్స్ పుస్తకాలు చదివి రేడియో, టీ.వీ., కెమెరా వంటి వాటిపై అవగాహన పెంచుకుని వరంగల్‌లో తొలి ఎలక్ట్రానిక్స్ షాపు పెట్టారు. అదే వారి కుటుంబానికి ఆధారం. వరంగల్‌లో ''ఫాదర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్సు''గా పేరు గడించారు. ఇక తల్లి కూడా పేరుకు తగ్గట్టు అమృతమూర్తి.
సాహితీ ప్రముఖుల వద్ద
జమున స్కూల్ చదువు మొత్తం హన్మకొండలోని లష్కర్ బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాలలో రెండుసార్లు మెరిట్ స్కాలర్ షిప్ పొందారు. ఇంటర్మీడియట్ వరంగల్‌లోని క్రిష్ణాకాలేజ్లో, డిగ్రీ వడ్డేపల్లి ఉమెన్స్ కాలేజ్‌లో పూర్తి చేసారు. ఎం.ఏ. తెలుగు సాహిత్యాన్ని కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అక్కడే సాహితీ ప్రముఖుల వద్ద ఆమె విద్యనభ్యసించారు. ఎం.ఏ.లో తెలుగు సాహిత్య చరిత్ర, సంస్కృతి అంశానికి గాను కాకతీయవిశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని అందుకున్నారు. ఇది ఆమె జీవితంలో మరవలేని మధుర స్మృతిగా ఆమె చెబుతారు.
పదేండ్ల తర్వాత...
తెలుగు పండిత శిక్షణ పూర్తి కాగానే సత్యనారాయణ రాజుతో వివాహం జరిగింది. ఆ తర్వాత బాబు సాయి చరణ్, పాప తన్మయిల పుట్టారు. పిల్లల పెంపకంలో దాదాపు పదేండ్లు గడిచిన తర్వాత 2002లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను రాసి జిల్లాలో ఫస్ట్ రాంక్ సాధించి మహబూబ్‌నగర్‌లో భాషోపాధ్యాయురాలిగా వృత్తిని చేపట్టారు. తర్వాత ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజపై ''సుద్దాల అశోక్ తేజ పాటలు- ఒక పరిశీలన'' అనే అంశంపై 2010లో ఎంఫిల్ చేసారు. ప్రస్తుతం చౌడూరి గోపాలరావు సమగ్ర సాహిత్య చరిత్ర అంశంపై పి.హెచ్.డి చేస్తున్నారు.
తెలుగుపై అభిమానంతో...
జమునకు చిన్నప్పటి నుండి తెలుగు భాషంటే ఎంతో ఇష్టం. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర వంటి పుస్తకాలతో పాటు చాచా చౌదరి, ఫాంటమ్ వంటి కామిక్స్ పుస్తకాలలోని కథలను ఎంతో ఆసక్తిగా చదివేవారు. అలా వయసుతో పాటు వివిధ ప్రక్రియలపై అభిలాష కూడా పెరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయంలోఎం.ఏ.ప్రవేశ పరీక్షలో తెలుగుతో పాటు ఎకనామిక్స్‌లోనూ సీటు వచ్చినా తెలుగుపై అభిమానంతో ఆమె తెలుగు సాహిత్యం తీసుకున్నారు. అధ్యాపకుల బోధనలతో తెలుగు భాషపై మరింత అభిమానం కలిగింది. సాహిత్య రంగంలో తొలి అడుగులు వేస్తున్న తరుణంలో ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం కలిగింది. తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ కవి, రచయిత వల్లభాపురం జనార్దన, ఖాజామైనద్దీన్, పాలమూరు సాహితీ అధ్యక్షులు ప్రముఖ కవి డా||భీంపల్లి శ్రీకాంత్, ప్రముఖ కవయిత్రి, రచయత్రి కె.ఎ.ఎల్.సత్యవతి వంటి వారితో కలిసి ప్రపంచ తెలుగు మహాసభలలో పలుమార్లు పాల్గొన్నారు. అలాగే భువనేశ్వర్, ఛండీఘర్, తిరువనంతపురం, అజ్మీర్‌లో నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు.
వివిధ ప్రక్రియల్లో...
దాశరథి, సినారే, కాళోజి, సురవరం ప్రతాపరెడ్డి, యశోదారెడ్డి మొదలైన కవి పండితుల రచనల అధ్యయనం ఆమె సాహిత్య ప్రస్థానానికి ఎంతో స్పూర్తినిచ్చాయి. 2002 నుండి సామాజిక సమస్యలపై స్పందిస్తూ వివిధ ప్రక్రియలలో రచనలు చేస్తున్నారు. కవితలు, కథలు, వ్యాసాలు, పాటలు, ఆటవెలది, తేటగీతి పద్యాలు, సమీక్షలు, మొగ్గలు, మణిపూసలు, గజల్, ఇష్టపది, పద మంజీరాలు, కైతికాలు, ప్రపంచకాలు, రుబాయిలు, సమ్మోహనాలు, మొదలైన ప్రక్రియలలో రచనలు చేస్తున్నారు. ఈమె తొలి కవితా సంపుటి ''నీలో నేను''(మొగ్గల ప్రక్రియ), రెండవ సంపుటి ''నేత మొగ్గలు''(మొగ్గల ప్రక్రియ), మూడవది ''అమృతవర్షిణి'' (మణిపూసల ప్రక్రియ).
పిల్లల్ని తీర్చిదిద్దుతూ...
సాహిత్య రంగంలో ఇంతగా సాగిపోతున్న జమునకు భర్త, పిల్లలు ఎంతో సహకారం చేస్తుంటారని గర్వంగా చెబుతున్నారు. ఉపాధ్యాయినిగా విద్యార్థుల సృజనకు పదును పెట్టి భవితకు వెలుగులు దిద్దడానికి కృషిచేస్తున్నారు. బాలచెలిమి బాలల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఆకాడమీ ఆధ్వర్యంలో 'తెలంగాణ బడి పిల్లల కథలు' పుస్తకంలో ప్రచురించిన ''ఉమ్మడి మహబూబ్ నగర్ కథలు'' పుస్తకంలోని 13 కథలలో వీరి పాఠశాల దేవరకద్ర బాలికలు రచించిన 5 కథలకు చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన నాటక పోటీలలో వీరి విద్యార్థినులు పాల్గొని జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు. జిల్లాలో జరిగిన 'పలికెద భాగవతం' పద్య పఠన పోటీలలో విద్యార్థులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం' సందర్భంగా తెలంగాణ అక్షరయాన్ మహిళా విభాగం, షీటీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ కవితా పోటీలలో వీరి విద్యార్థినికి నగదు బహుమతి లభించినది. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలలో వీరి విద్యార్థిని ప్రథమ బహుమతి అందుకున్నది. తన విద్యార్థులను కళలు, సాహిత్యం పట్ల ఎంతటి అవగాహన కల్పిస్తున్నారో వీటిని బట్టి ఇట్టే అర్థమవుతుంది.
సమాజాన్ని ప్రభావితం చేసేలా...
వాస్తవానికి జమున ఎం.ఫిల్ పూర్తి చేయగానే పి.హెచ్.డి చేయాలనుకున్నారు. కానీ ఆమె ఆశ నిరాశే అయ్యింది. కానీ పట్టు వదలక ప్రయత్నం చేసి చివరకు పాలమూరు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి సీటు సాధించారు. పరిశోధనను కొనసాగిస్తూ, సామాజిక స్పృహతో సమాజాన్ని ప్రభావితం చేసి స్ఫూర్తినందించే రచనలు చేయాలని ఆమె కోరిక. తాను చేస్తున్న సాహిత్య సేవకుగాను జమునకు ఎన్నో పురస్కారాలు, బిరుదులు అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌చే ఉత్తమ కవితా పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే కోయిలకొండ మండలం ఉత్తమ రచయిత్రిగా నగదు పురస్కారం అందుకున్నారు. మణిపూసల ప్రక్రియలో చేసిన విశేష కృషికి మణి పూసల కవి భూషణ్, మణిపూసల తొలి కవయిత్రి పురస్కారం అందుకున్నారు.
- కవిత్వం ఓ మార్గనిర్దేశం
అంతరంగంలోని భావాలకు అక్షర రూపమే కవిత్వం. సమాజహితాన్ని కోరి సమాజాన్ని తట్టి లేపే చైతన్య కిరణమే కవిత్వం. కవి సామాన్య ప్రజల కన్నా భిన్నం. కవులను సమాజం అనుసరిస్తుంది, అనుకరిస్తుంది, ఆదర్శంగా స్వీకరిస్తుంది. కాబట్టి కవిత్వం ఒక మార్గదర్శనంగా ఉండాలి. దిశా నిర్దేశం లేని సమాజానికి కవిత్వం వేగుచుక్కలా పనిచేస్తుంది. ప్రపంచగతినే మార్చగలిగే శక్తివంతమైన సాధనం సాహిత్యం. మానవ జీవితంలోని విభిన్న కోణాలను సృజిస్తూ జీవితాన్ని చక్కగా విశ్లేషిస్తుంది. జీవన వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు, హృదయానికి హత్తుకునేటట్లు చేయగలదు. సామాజిక జీవితానికి అద్దం పడుతూ సమాజాన్ని ప్రభావితం చేయగలదు.
- సామాజిక స్పృహ వుండాలి
సమాజానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది. సాహిత్యం సామాజిక మార్పులో అత్యంత శక్తివంతమైన సాధనమని చెప్పవచ్చు. సమాజం నుండి సాహిత్యం ఉద్భవిస్తుంది. సమాజంలో మార్పు కలగడం సహజమే. దానికి అనుగుణంగా సాహిత్యం కూడా మారుతూ వుంటుంది. పద్య కవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం, కథ, వ్యాసం మొదలైన అనేక ప్రక్రియలు సృష్టించబడ్డాయి. ప్రక్రియ ఏదైనా సామాజిక స్పృహ ప్రధాన లక్ష్యంగా వుండాలి.
- సలీమ