Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సయ్యద్ సాల్వా ఫాతిమా... భారతదేశంలో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన కొద్దిమంది ముస్లిం మహిళల్లో ఒకరు. ఆమె శిక్షణ సమయంలో ఎల్లప్పుడూ హిజాబ్ ధరించే ఉండేది. ఒక ముస్లిం మహిళా ఇలాంటి వృత్తిని చేపట్టడంతో మన భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఫాతిమా 34 ఏండ్ల మొదటి మహిళా వాణిజ్య పైలట్. ఆమె రెండు సీట్ల సెస్నాలో ఆకాశానికి ఎగిరింది. అయినప్పటికీ ఆమె ఎయిర్ బస్ 320లో గ్లోబల్ ఎయిర్ ట్రాఫిక్‌ను నావిగేట్ చేస్తుంది. 550 గంటలు ఎగురుతూ తన గమ్యాన్ని చేరుకుంది. ఫాతిమా బేకరీ ఉద్యోగి సయ్యద్ అష్ఫాక్ అహ్మద్ కుమార్తె. ఫాతిమా పాతబస్తీలోని మొఘల్‌పురాలోని నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఈమెకు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ఆర్థిక సమస్యల కారణంగా మలక్‌పేటలోని నియో స్కూల్ ఐజ్జాలో చదువుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ అలీఫియా హుస్సేన్ ఆమె చదువు కోసం రెండేండ్ల పాటు స్పాన్సర్ చేశారు. తర్వాత ఆమె సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాల, మెహదీపట్నం నుండి ఇంటర్మీ డియట్ కోర్సును పూర్తి చేసింది.
ఐదేండ్ల కఠిన శిక్షణ...
ఫాతిమా విజయానికి పేదరికం అడ్డుకట్ట వేయలేదు. తనకు చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే కోరిక బలంగా ఉండేది. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంజనీరింగ్‌లో చేరింది. అక్కడే ఆమె కల గురించి అడిగారు. వెంటనే పైలట్ కావాలన్నది తన కల అని చెప్పింది. ఫాతిమా 2007లో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీలో అడ్మిషన్ పొందింది. ఐదేండ్ల కఠిన శిక్షణ తర్వాత కమర్షియల్ పైలట్, ప్రైవేట్ పైలట్ డ ఫ్లైట్ రేడియో టెలిఫోన్ ఆపరేటర్ లైసెన్స్ పొందింది. శిక్షణ మొత్తంలో ఫాతిమా తన 123 గంటల సోలో ఫ్లైట్‌తో సహా సెస్నా 152, 172లో 200 గంటలు ప్రయాణించింది. కానీ ఆమె కల నెరవేరడానికి ఇది సరిపోలేదు. ఆమె ఇప్పుడు బోయింగ్ లేదా ఎయిర్‌బస్ వంటి పెద్ద విమానాలలో శిక్షణ పొందవలసి ఉంది. ఈ శిక్షణ కోసం ఆమెకు 30-35 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది.
ప్రభుత్వ సాయంతో...
ఫాతిమా నైపుణ్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. న్యూజిలాండ్‌లో ఆమె శిక్షణ కోసం ప్రభుత్వం రూ.36 లక్షలు మంజూరు చేసింది. న్యూజి లాండ్లో తన శిక్షణ సమయంలో ఫాతిమా 5 గంటల పాటు బహుళ-ఇంజిన్ విమానాన్ని నడిపింది. అలాగే 10 గంటలపాటు సిమ్యు లేటర్‌పై శిక్షణ పొందింది. బహ్రె యిన్‌లోని గల్ఫ్ ఏవియేషన్ అకా డమీలో ఎయిర్‌బస్‌లో టైప్ - రేటింగ్‌కు అర్హత సాధించింది.
ప్రతి అమ్మాయికి స్ఫూర్తి..
ప్రస్తుతం ఫాతిమా ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తుంది. తాను కచ్చితంగా పైలట్ కావాలని కలలు కన్నానని, అయితే ఈ కల నెరవేరుతుందని ఎప్పుడూ అనుకోలేదని ఉప్పొంగిన ఫాతిమా చెప్పింది. అయితే ఆమె తన కల నెరవేర్చుకోవడానికి ఎన్నో సమస్యలను, అసమానతలను ధైర్యంగా ఎదుర్కొంది. అందుకే ఫాతిమా జీవితం కేవలం ముస్లిం సమాజానికే కాకుండా జీవితంలో సమస్యలను ఎదుర్కొనే ప్రతి భారతీయ అమ్మాయికి కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది.