Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాణి దేవులపల్లి... చిన్నతనం నుండి సాహిత్య వాతావరణంలో పెరిగాను. దాంతో చదవడం, రాయడం తన దిన చర్యలో భాగమయింది. తన అక్షరాలు సమాజంలో కొంతైనా మార్పు తీసుకొస్తాయనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. జ్ఞాపకాల చేద బొక్కెనతో జాతియ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీ ఆర్థిక స్వాలంభన తోనే పురుషాధిక్య సమాజాన్ని విజయ వంతంగా ఎదుర్కోగలదని అంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో...
మా ఊరు వంగపహాడ్, వరంగల్ జిల్లా. తాతయ్య వేంకట పాపారావు, నాయనమ్మ సామ్రాజ్యలక్ష్మి, ఒద్దిరాజు సోదరులలో ఒకరైన ఒద్దిరాజు రాఘవ రంగారావు గారి కుమార్తె. దేవులపల్లి రామానుజరావుగారు మా చిన్నతాత. వారి ఇల్లు మా ఇంటి ఎదురుగానే ఉండేది. మా అమ్మ వెంకట లక్ష్మి, నాన్న గోపాల్ కిషన్ రావు. నా ప్రాథమిక విద్యాభ్యాసం మా ఊరిలో, హైస్కూల్ చదువు మా ఊరికి అయిదు మైళ్ళ దూరంలో ఉన్న పక్క ఊరు దామెరలో పూర్తి చేశాను. ఇంటర్ వరంగల్‌లో, డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, పీజీ, పీహెచ్డీ కాకతీయ యూనివర్సిటీలో చేశాను.
చదవడం ఇష్టంగా మారింది
మాది ఉమ్మడి కుటుంబం. తాతగారు జమీందారు. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా ఆయనే పరిష్కరించేవారు. చాలా మానవీయ దృక్పథం కల వాడిగా పేరుపొందారు. మా అమ్మకు పుస్తకాలు చదివే అలవాటు. బాపు (నాన్న) అన్ని రకాల దినపత్రికలు, ఆంగ్ల సాహిత్యం, రాజకీయ పత్రికలు తెప్పించేవారు. దాంతో నాకూ చిన్నప్పటి నుండే పుస్తకాలు చదివే అలవాటు ఇష్టంగా మారింది. మొట్టమొదటి సారి నేను అయిదవ తరగతిలో ఉన్నప్పుడు ఓ పత్రికలో నేను రాసిన ఒక జోక్ అచ్చయింది. తర్వాత కొన్ని వ్యాసాలు కూడా అచ్చయ్యాయి. స్కూల్లో వ్యాస రచన, పాటలు, ఆటల పోటీల్లో నాదే ప్రథమ స్థానం. దామెర స్కూల్లో ప్రతి రోజూ ఆంగ్ల వార్తలు చదవడం మా బాపు ఆలోచనతో నేనే మొదలుపెట్టాను. హెడ్మాస్టర్, టీచర్లందరూ ప్రశంసించేవారు. డిగ్రీలో కవిత్వం, కథలు, వక్తృత్వ పోటీలలో ప్రథమ బహుమతులు అందుకున్నాను. సోషియాలజీ మాది ఫస్ట్ బాచ్ యూనివర్సిటీలో. అందులో నేను యూనివర్సిటీ టాప్ రావడం, మా రాములు సార్ ప్రత్యేకంగా బహుమతివ్వడం మర్చిపోలేని జ్ఞాపకం.
జ్ఞాపకాల చేద బొక్కెన
చిన్నప్పటి నుండే రాస్తున్నప్పటకీ నా మొదటి కవితా సంపుటి 'జ్ఞాపకాల చేద బొక్కెన' 2016లో వచ్చింది. ఇది నాకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. 2017లో ఓ పత్రికలో వచ్చిన నా 'సంపెంగల యాసంగి' కవిత చదివి స్వయానా ముఖ్య మంత్రిగారు ఫోన్ చేసి అభినందించడం ఓ గొప్ప అవార్డు. మాటలకందని అనుభూతి. ఇప్పటివరకు దాదాపు 200 వరకు కవితలు రాసాను. అలాగే 'అస్తిత్వ పరిమళాలు' (వ్యాస సంపుటి), విజరు టెండుల్కర్ పైన ఆంగ్ల పరిశోధనా గ్రంధం వచ్చింది.
తృప్తిగా ఉండేది
1990 నుండి వివిధ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో పని చేశాను. 1993లో నాకు వివాహమయింది. మా వారు ప్రభాకర్ రావు, ఆంధ్రా బ్యాంక్ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. మా బాబు భరద్వాజ్, అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. కుటుంబ సహకారంతోనే ఉద్యోగమైనా, రచనలైనా చేయగలుగుతున్నాను. మా వారు నేను రాసుకోవాలనుకుంటే అవసరమైన పనులన్నీ చేసి పెడతారు. ఇకపోతే అనుక్షణం నా రచనల గూర్చి అడుగుతూ నన్ను ప్రోత్స హిస్తూ, నా రచనలకు మొదటి శ్రోత గా ఉంటాడు మా బాబు ఇంట్లో ఎంత పని చేసినప్పటికీ కాలేజీలో చెప్పి వచ్చే క్లాస్‌లతో ఎనర్జిటిక్‌గా ఫీలయ్యేదాన్ని. సామాజిక ఉత్పాద కతలో నేనూ భాగస్వామిని అను కుంటే ఎంతో తృప్తిగా ఉండేది.
ఖాళీగా ఉండలేక
ఇంజనీరింగ్ కాలేజ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూనే పీహెచ్డీ ఎంట్రన్స్ రాసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాను. చాలెంజింగ్ గా తీసుకుని మూడేండ్లల్లో పరి శోధన పూర్తి చేసాను. కానీ ఉద్యోగం చెయ్యాలన్న నా కల కలగానే మిగిలిపోయింది. నా పీజీ అయినప్పటి నుండి జాబ్ నోటిఫికేషన్స్ లేవు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఇన్నేండ్లు ప్రైవేట్ కాలేజీల్లోనే పని చేసాను. కార్పొరేట్ కాలేజీల గురించి తెల్సిందే కదా... పని ఎక్కువ. వేతనం తక్కువ. అయినప్పటికీ ఇంత చదువుకొని ఖాళీగా ఉండలేక కంటిన్యూ చేసాను. ఇటు రాత్రిళ్ళు కూర్చుని చదవడం, రాయడం ద్వారా సాహితీ ప్రపంచానికి దగ్గరయ్యాను. అడ్డంకులను అధిగమిస్తూ ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాను.
సాహితీ సేద్యమే చేస్తున్నాను
పెళ్లి కాక ముందునుండే ఉద్యోగం చేస్తున్నప్పటికీ పెళ్లయ్యాక ఉద్యోగం, ఇల్లును సమన్వయం చేసుకోవడంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాను. ఇంట్లో అత్తగారు నుండి సహకారం ఆశించలేని పరిస్థితి. ఆవిడకు ఆరోగ్యం బాగోదు. కుటుంబ బాధ్యతలతో, బంధువులతో ఇల్లు ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ఉండేది. ఇటున్న పుల్ల అటు పెట్టే వారు లేక పని భారంతో ఒత్తిడికి గురయ్యేదాన్ని. దాంతో ప్రస్తుతం ఉద్యోగం చెయ్యడం లేదు. సాహితీ సేద్యమే చేస్తున్నాను.
పేరు తెచ్చిన కథలు
కవితలు వ్యాసాలతో పాటు సుమారు 20 కథల వరకు రాశాను. అందులో గురవయ్య సారు కానిగీ బడి, సిల్కు చీర, నుమాయిష్, రాగ బంధాలు, క్షమయా ధరిత్రి, ఇసు ర్రాయి, అర్న, బంగారు జడ కుప్పెలు, ఉన్నది ఒకటే జీవితం, తప్యాల చెక్క, పనిమనిషి మొదలైన కథలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని కథలు బహుమతి, పురస్కారాలు అందుకున్నాయి. అలాగే డా. మూడ నాగభూషణ గుప్త పురస్కారం, లక్ష్మీ నారాయణ జైనీ కవి పురస్కారం, సత్కారం, తెలంగాణ రాష్ట్రం గూర్చి రాసిన పాటకు ద్వితీయ పురస్కారం వీటితో పాటు అనేక సత్కారాలు పొందాను.
వివక్షను ఎదుర్కోవచ్చు
ఫ్యూడల్ వ్యవస్థ వేళ్లూనుకున్న సమాజంలో ఓమహిళగా చాలా కష్టాలే పడ్డాను. కేవలం విద్య వల్లనే కాక, స్త్రీలకు ఆర్థిక స్వావలంబన ఉంటేనే ఈ పురుషాధిక్య సమాజంలో వివక్షతను సమర్థంగా ఎదుర్కోవచ్చని నా అభిప్రాయం. రచయితల సంఘాలలో కూడా పురుషుల ఆధిక్యత కొనసాగడం బాధాకరం. సామాజిక విలువలతో కూడుకున్న సాహిత్యం మంచి ప్రభావాన్ని చూపి, సమాజ పురోగమనానికి దారితీస్తుంది. అదే విలువలు లోపించిన సాహిత్యం చెడు ప్రభావంతో సమాజ తిరోగమనానికి కారణ మవుతుందని నా బలమైన అభిప్రాయం. అయితే సంక్లిష్ట పరిస్థితులను కూడా జయించాను. నాకిది మా అమ్మా నాన్నల నుండి వచ్చింది. వాళ్ళూ అంతే. చివరగా ఒక్క మాట ''ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక'' లాగ నా రచనల ద్వారా సమాజంలో లేదా ఓ వ్యక్తిలో చిన్న మార్పు చోటుచేసుకున్నా చాలనుకుంటున్నాను.
- సలీమ