Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమెతో పరిచయం ఉన్న వేలాది మందికి ఆమె ఓ ప్రేరణ... చివరి శ్వాస వరకు న్యాయం కోసం పోరాడిన ధీర... పోరాట మార్గమే నిజమైన విముక్తి దారి తీస్తుందని నమ్మిన వ్యక్తి. ఎక్కడా రాజీపడద్దు... లక్ష్యం వైపు సాగుతూనే ఉండాలనే బతుకుబాటను నేర్పిన వీర వనిత... పుట్టింది సంపన్నుల కుటుంబమైనా నడిచింది ముళ్లబాట... ముక్క పచ్చలారని బాల్యంలోనూ తొంభై పడిలోనూ ఆమెది ఒకటే మాట... పీడితుల పక్షాన పోరాటం చేయడంలో ఆమెది అదే బాట... అటువంటి ధీశాలి మనల్ని వదిలి అప్పుడే ఏడాది గడిచింది... కానీ ఆమె పోరాట పటిమ మాత్రం అందరి మదిలో అలా పదిలంగా నిలిచిపోయింది... కొందరు మరణించినా జనం గుండెల్లో చిరకాలం జీవించే ఉంటారు... అలాంటి వారిలో మల్లు స్వరాజ్యం ఒకరు... ఈ రోజు ఆమె మొదటి వర్థంతి. ఈ సందర్భంగా ఆమెతో తమ అనుభవాలను కొందరు మహిళా నాయకులు ఇలా మానవితో పంచుకున్నారు.
సేకరణ: సలీమ
ధీర వనిత ఆవిడ
వ్యవస్థను విమర్శించడంలో ఖంగుమన్న ఆవిడ గొంతు విన్నవారినందరిని ఉత్తేజితుల్ని చేసేది. ఆలోచనల్లోని స్పష్టత, విశ్లేషణా శక్తితో నిండిన ఆవిడ ఉపన్యాసాలు అందరిని ప్రశ్నించేలా ప్రేరితుల్ని చేసేవి. భూస్వామ్య, రాచరిక వ్యవస్థపై తిరుగుబాటు చేసిన మార్క్సిస్టు మహిళే మల్లు స్వరాజ్యం. ప్రజస్వామ్య పరిరక్షణకు, పౌరహక్కుల కోసం చివరి క్షణం వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ధీర వనిత ఆవిడ. రాజ్యం చేసే అన్యాయాన్ని ఎదిరించడానికి దుందుడుకు తనం కాదు, సుషిక్షితులయిన ఉద్యమకారుల కార్యాచరణ అవసరం అని ఉద్యమంలోనే జీవితాన్ని గడిపింది. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యునిస్టులు సాగించిన సాయుధ తిరుగుబాటులో నాయకురాలిగా యుద్ధం చేసింది. దొపిడీకి వ్యతిరేకంగా, ప్రజల మీద దొరలూ, సంస్థానాదీసులు సాగిస్తున్న అమానుష దాడులను ఎదరించింది. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె ఏనాడూ తన ఉద్యమంలో నీరసించలేదు. మనసును కుళ్ళబొడిచే కుటుంబ సమస్యలు, రహస్యోధ్యమ జీవితం, రాజ్య హింసల నడుమ కుంగిపోక ధైర్యంతో అన్ని పీడల మెడలు వంచి ముందుకు నడవడానికే ప్రయత్నించారావిడ. జీవితం పట్ల ప్రేమను, జీవించడంలో స్వతంత్రతను, అన్యాయం పట్ల అసహనాన్ని, ప్రజల పక్షాన నిలబడే విధానాన్ని మనకందించిన మల్లు స్వరాజ్యం జీవిత చరిత్రను ఉత్తేజితులమయి పండుగలా జరుపుకోవాలి. గణతంత్ర దేశంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గాన ప్రజల ఆకాంక్షల సామాజిక స్థితిని సాధించడానికి, అప్రజాస్వామిక శక్తులను ఎండ కట్టడంలో ఆమె ప్రదర్శించిన ధైర్యం, చూపిన చొరవ, ప్రజల పక్షాన నిలబడ్డ ఆ గొంతు ముందు నేను సగౌరవంగా నిలబడి మరీ సెల్యూట్ చేస్తున్నా.
- శాంతా సిన్హా
అవిశ్రాంత పోరాటం ఆమె జీవితం
ఎందరికో ఉత్తేజాన్నిచ్చిన, వీరత్వాన్ని నింపిన నిండైన మనిషి ఆమె. ఆమెను తలచుకున్నప్పుడల్లా, ఆమెలా బతకడం ఎంత గొప్పో కదా అనిపించేది. నిరాడంబరమైన ఆమె దుస్తులు, కులమతాలను విసిరికొట్టిన ధీరోదాత్తత స్ఫూర్తినిస్తాయి. కత్తుల వంతెనపై నడిచిన యోధ ఆమె. మల్లు స్వరాజ్యం పేరు వినగానే అనుకోగానే ఆమె స్ఫూర్తితో ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వీర వనిత, ఎప్పుడు, ఎవరికీ తలవంచని ఆత్మ గౌరవం ఆమె సొత్తు. మనిషెంత దృఢమో, మాటంత కరుకు. ఎటువంటి స్థితినైనా ఎదుర్కొనే సాహసి. ఇలా ఎంత చెప్పినా ఆమె గురించి తక్కువే. అసలు అక్షరాలకు ఒదగని ఆత్మ విశ్వాస ప్రతీక. ఉద్యమం ఆమె ఊపిరి. సంకల్పం ఆమె వాహిక. పసిబిడ్డను దారిలో అప్పగించి ముందుకు అడుగువేసిన స్థిరచిత్త. ఒక్కమాటలో చెప్పాలంటే అడుగుల్ని ఎక్కడా ఆపని అవిశ్రాంత పోరాటం ఆమె జీవితం. అతి చిన్న వయసులోనే ఉద్యమ స్వరూపం అర్థంకాని దశలోనే ఉద్యమంలోకి వచ్చి, ఉద్యమంతోపాటు తానూ ఎదుగుతూ వచ్చానని చెప్పేవారు. తుపాకి పట్టి శత్రుసంహారాన్ని చేశారు. ఎంతో ప్రతిభావంతంగా, చాకచక్యంగా ధైర్యంగా తనకిచ్చిన బాధ్యత నెరవేర్చడం ఆమె స్వభావం. గళమెత్తి పాడినా, అందరితో కలిసి ఆడినా, ఒక ప్రభంజనం వలె మాట్లాడినా ఆమెకు ఆమే సాటి. ఎంతటి అనారోగ్య స్థితిలో కూడా ఆమె నిరాశపడలేదు. అధైర్యపడనూ లేదు. 'శరీరమొక యంత్రం. పాడైతూ వుంటుంది. రిపేర్లు చేసుకుంటపోవుడే| అన్నారొక సందర్భంలో. అంతటా బలమైన నమ్మకం ఎంతమందికుంటుంది. ఒక తరానికి దిక్సూచిలాంటి వ్యక్తి. సముద్రం మధ్యలో వెలిగే దీపశిఖ. మనందరికీ ఆదర్శం. ఉక్కుపిడికిలి ఆమె. తాను ఎదిరించదలచుకున్నపుడు, ఎదుటి వ్యక్తిది తప్పు అని నిర్ధారణ అయినప్పుడు ఎక్కడా తగ్గని స్వభావం. రాజకీయ రంగంలోనూ, సామాజిక రంగంలోనూ ఆమె చేసిన విశేషమైన కృషిని ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ దేశంలో ప్రతి మనిషీ తినే అన్నం మెతుకుపైన సమానముండాలనీ, ఆకలి కేకలు లేని స్థితి రావాలని పార్టీ ఒకటే అది సాధించగలదనే నమ్మికతో జీవితాంతం పోరాడింది. నిర్మొహమాటంగా ఎలా వుండాలో ఆమె నుంచి నేర్చుకోవచ్చు.
- శిలాలోలిత
వాగ్ధాటే ఆమె చిరునామా
మల్లు స్వరాజ్యం గారిని మొదటిసారి విజయ వాడలో చూసినట్లు గుర్తు. కానీ అప్పుడు మాట్లా డింది లేదు. 'మనకు తెలియని మన చరిత్ర' పుస్తకం లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆవిడ అనుభవం చదివిన తర్వాత ఆవిడ చాలా మంది కంటే భిన్నమైన వ్యక్తి అని మనకు తడుతుంది. ఆవిడ స్వభావం కూడా నిక్కచ్చిగా సవాలు చేస్తున్నట్లే వుండేది. ఏదయినా అనుకుంటే వెంటనే జరిగిపోవాల్సిందే. నవతెలంగాణలో నేను వ్యవసాయ విధానాల మీద 'తొలిపొద్దు' పేరుతో కాలమ్ రాస్తున్నప్పుడు ఎవరో కానీ వివరంగా బాగా రాస్తోంది అనుకున్నదట గానీ అది నేనని గుర్తు పట్టలేదు. ఒకరోజు ఆవిడను వేరే పని మీద కలవాలని వెళ్తే ఏం చేస్తున్నావు అంటే, రైతు ఆత్మహత్యల కుటుంబాలతో పని చేస్తున్నాను, రాస్తున్నాను అంటే 'నవ తెలంగాణ'లో కూడా ఒకావిడ ఎవరో బాగా రాస్తోంది, తెలుగావిడ కాదనుకుంటా అనేసరికి ముందు అవాక్కయి 'అది నేనే, ఎవరో అనుకోకు' అని చెప్పా. విషయం పూర్తిగా అర్థమయిన తర్వాత ఆవిడా, తనతో పాటు నేనూ ఒకళ్లని పట్టుకుని ఇంకొకరం పగలబడి నవ్వుకున్నాం కాసేపు. ఆ వ్యాసాలన్నీ కలిపి 'రైతు ఆత్మహత్యలు- మనం!?' పేరుతో ప్రచురించిన తర్వాత తన చేతుల మీదుగానే ఆవిష్కరణ చేసి అద్భుతంగా మాట్లాడింది. సభ అంతా అయిపోయాక ఈసారి వ్యాసాల్లో ఇంకా గట్టిగా నిలదీస్తూ రాయి. నేను మాట్లాడమంటే ఎంతసేపైనా మాట్లాడతా, రాయమంటే కష్టం. మా కంటే చిన్నవాళ్లు మీరు రాస్తుంటే సంతోషంగా వుంది అని అభినందించారు. ఇంకో సందర్భంలో ఆవిడను వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వున్న ఒక సమావేశానికి వక్తగా పిలిస్తే, అవకాశం వుండి కూడా ఇంగ్లీష్, హిందీ నేర్చుకోకుండా వుండటం నేను చేసిన పొరపాటు, అవే వచ్చి వుంటే ఈ అనువాదాల గోల లేకుండా మీతో నేరుగానే మాట్లాడే దాన్ని అని ఉప న్యాసం ప్రారంభించారు. ఆవిడ గల గల దూకే జలపాతం లాగా ఆపకుండా మాట్లాడేస్తుంది. ప్రతినిధులకు అర్థం కావాలని ఐదు నిముషాల తర్వాత ఆపితే ''మీరు ఇలా ఆపకండి, కావాలంటే అంతా ఒక్కసారే అనువాదం చేసుకోండి, ఆపితే నాకు మాట్లాడటం కుదరదు అని నిష్కర్షగా చెప్పేసి ధడ ధడ వో ముప్పావు గంట తన అనుభవాలు, ప్రస్తుత రాజకీయాలు, చేయా ల్సిన పోరాటం గురించీ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అను వాదం చేయలేక మేం చచ్చాం, అది వేరే విషయం. కొంతమంది వయసు రీత్యా వృద్దులైనప్పటికీ, ఎల్లప్పటికీ రక్తం మరిగే యువతరంలానే జీవిస్తారు. అదీ మల్లు స్వరాజ్యం అంటే. మీరు మాకు భౌతికంగా దూరమయ్యారు అంతే. ఎప్పుడు గుర్తు చేసుకున్నా అదే ఆవేశపూరిత వాగ్ధాటే మీ చిరునామా! లాల్ సలాంతో పాటు సాత్ రంగి కా సలాం కామ్రేడ్!
- సజయ
అలుపెరుగని పోరాట కెరటం
నిజాం రాజరికంలో కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థ తెలంగాణాని అతలా కుతలం చేస్తూ గ్రామాలకు గ్రామాలే వెట్టి చాకిరీతో విలవిల్లాడుతోన్న సమయాన దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్య కర్తలు చట్టపరంగా ఎన్నో సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ తమ పోరాటాలను ఉధృతం చేశారు. ఆ రోజుల్లో, హైదరాబాద్లో చదువుకుంటోన్న మల్లు స్వరాజ్యంగారి సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆ కార్యక్రమాలకి ఉత్తేజితులై తెలంగాణ విముక్తి కోసం పోరాడాలనే తపనతో గోర్కీ రచించిన 'అమ్మ' నవలని తన చెల్లెళ్ళు స్వరాజ్యం, శశిరేఖలకిచ్చి చదవమని చెప్పారు. మల్లు స్వరాజ్యం తండ్రి, పినతండ్రి కూడా భూ స్వాములు. స్వరాజ్యం తండ్రి ఆవిడ ఎనిమిదో ఏటే గతించడంతో వాళ్ళన్నయ్య భీమిరెడ్డి నర్సింహారెడ్డిగారే ఊరి పెద్దగా తమ గ్రామంలో ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్ని అమలు చేసే బాధ్యతని తన భుజాన వేసుకున్నారు. ఆయన హరిజనులూ, గిరిజనులూ, గొల్లలూ, గౌడలూ తదితరులందర్నీ రహస్యంగా వాళ్ళింట్లో సమావేశ పరుస్తూ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టా ల్సిందిగా ఉద్భోదించేవారు. వారి ఉపన్యాసాలకు ఆ సమావేశాల్లో తరచుగా పాల్గొనే మల్లు స్వరాజ్యం, ఆమె సోదరి ఎంతో ఉత్తేజితు లయ్యేవారు. ప్రజలను ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యేలా చేసేవారు. అది సహించని పోలీసులు ఒకరోజు వాళ్ళన్నయ్యని అరెస్టు చేసేందుకు తెల్లవారుజామున ఇంటికొచ్చారు. ఆయన ఇంటి వెనుక నుండి తప్పించుకుంటూ సమ్మెని జయప్రదం చేయమంటూ తన చెల్లి మల్లు స్వరాజ్యానికి చెప్పి వెళ్ళారు. ఆమె వాడవాడలా తిరిగి సమ్మెను జయప్రదం చేశారు. అలా భూ స్వాముల దౌర్యన్యాలకి వ్యతిరేకంగా, మరో భూస్వామి కూతురు తమ ఇంటికి వచ్చి తమ బాగుకోసం పాటుపడపటం ప్రజలకి ఎంతో సంతోషం కలిగించేది. ఆ కాలంలో నిజాం నవాబు మిలటరీ బలగాలతో రజాకార్లని సృష్టించి గ్రామాలపై రాక్షస దాడులకు పూనుకున్నారు. ఆ సమయంలో గ్రామాల రక్షణకై ఆయుధాలను సేకరించి సాయుధ పోరాటం నడిపించాలని ఆంధ్ర మహాసభ పిలుపునందుకుని ఆమె సాయుధ శిక్షణను పొంది సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు. ఆమెని పట్టుకుంటే పదివేల రూపాయలిస్తామని నిజాం ప్రభుత్వం రివార్డుని ప్రకటించడంతో ఏడు సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారామె. ఆ రకంగా తనకి వీర తెలంగాణ పోరాటంలో పాల్గొనే అవకాశం దక్కిందంటారు ఆమె. ఎమర్జెన్సీ రోజుల్లో చంటి బిడ్డను చంకనేసుకుని పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొంటూ మల్లు స్వరాజ్యం ఎన్నో సభలూ, ఊరేగింపులూ నిర్వహించారు. ఆ క్రమంలోనే ఆమె 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన నియెజకవర్గమంతా కాలినడకనే తిరిగేవారు. మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక ఆమె మిర్యాలగూడలో పదివేల మందితో పెద్ద ఎత్తున సభ జరిపి వీర తెలంగాణ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మను సన్మానించారు. ఇరవై సంవత్సరాల పాటు ఈ సంఘానికి వీరు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ కాలంలో జరిగిన మద్య నిషేధ ఉద్యమంలో అన్ని సంఘాలనూ ఏకం చేశారు. పదివేల మందితో ప్రారంభించబడిన ఈ సంఘంలో రానురానూ ఎనిమిది లక్షల మంది సభ్యత్వం స్వీకరించారు. చనిపోయే చివరి నిమిషం వరకూ మనం ఐకమత్యంతో పోరాడాలి. స్త్రీల ఉద్యమాలు జిందాబాద్ అంటూ నినదించిన పోరాట కెరటం మల్లు స్వరాజ్యంకు కన్నీటి నివాళి.
- కొండవీటి సత్యవతి