Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్న కొడుకులు కూతుళ్ళ నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులెందరో... అలాంటి వారు వృద్ధాశ్రమాల దారులు వెతుక్కుంటున్నారు. వారందరికీ తానే బిడ్డగా మారి ఆసరా ఇస్తున్నారు... అక్కున చేర్చుకుని ప్రేమా, ఆప్యాయతలను పంచుతున్నారు... ఆ నిలువెత్తు మానవతామూర్తి రాజేశ్వరి. ఆ సేవా మూర్తి పరిచయం నేటి మానవిలో...
జనగామ పట్టణంలోని గిర్నిగడ్డలో ఉంది రాజేశ్వరి సేవాసదన్. రోడ్డు పక్కన, బస్టాండ్లలో, నాలుగు కూడళ్ళ మధ్య దీనంగా, ఆకలి ముఖాలతో కనిపించే వారిని ఆమె కళ్ళు వెంటనే గుర్తుపట్టేస్తాయి. ఆత్మీయ పలకరింపుతో ''మీకు ఎవరూ లేరా అమ్మా!'' అంటూ... ఎందుకు ఇలా రోడ్డుపై కూర్చున్నావని అడుగుతారు. ''ఉన్నారు... కానీ పిడికెడు మెతుకులు పెట్టడం లేదు'' అని వారి సమాధానం. అలాంటి వారెం దరినో రాజేశ్వరి తన అక్కున చేర్చుకుంటుంది ఆపద్బాంధవిలా...
వారి బాధలు సహించలేక
సేవాసదన్ ప్రారంభించడానికి ఏదైనా కారణం ఉందా? ఎందుకు స్థాపించాలి అనుకున్నారు? అని అడిగితే తను దగ్గర బంధువులు ఎందరో పిల్లలు సరిగా చూడక, ఆహారం వేళకు అందించక, అవసరాలు గుర్తించకపోవడం వల్ల, నిర్లక్ష్యాన్ని భరించలేని తల్లిదండ్రులను ఆమె చూశారు. వారి బాధలు సహించలేని రాజేశ్వరి ''అయ్యో! మరీమానవత్వం మంటగలిసి పోతున్నదే'' అని హృదయం ద్రవించి, వృద్ధులకు సేవ చేయాలనే తలంపుతో ''రాజేశ్వరి వృద్ధుల శరణాలయం'' 2008 డిసెంబరు 8న స్థాపించారు.
మానసిక వికలాంగులకు...
ఎవరూ లేని వారికి ఎలాగూ సేవాసదన్ తలుపులు తెరిచే వుంటాయి. కానీ రాజేశ్వరి మాత్రం సంతాన ఉండీ, అనాధరణకు గురై కష్టపడుతున్న తల్లిదండ్రులను సైతం చేరదీస్తున్నారు. వారికి కడుపు నిండా తిండి పెట్టాలన్నదే ఆమె లక్ష్యంగా సాగుతున్నారు. అందులో మానసికంగా ఎదుగుదల లేని రోగులు కూడా ఉన్నారు. వారు మానసిక వైకల్యంతో ఎంత చికాకు కలిగించినా, బట్టలను చింపు కున్నా, ఇతరులను కొట్టడం లాంటివి చేసినా ఎంతో ఓపిగ్గా కన్నతల్లి వలె కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
ఫలితం మాత్రం శూన్యం
ఎవరైనా దాతలు ముందుకు వచ్చి స్థలం ఇస్తే ప్రభుత్వ సహాయంతో సొంత ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటామంటు న్నారు రాజేశ్వరి. తన బాధకాలను వివరిస్తూ జిల్లా కలెక్టర్, స్థానిక పాలకులకు ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం మాత్రం శూన్యం. కనీసం పాత బిల్డింగ్ ఇప్పించినా అద్దెకట్టే భారం తప్పేది. కానీ ఏ అధికారి స్పందించలేదని ఆమె వాపోతున్నారు. కనీసం ఈ సేవా సదనంలో సేవలు పొందే వారి బంధువులైనా ఏమైనా సహాయం చేస్తే బాగుండేది. కానీ ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారంతా ఆర్థిక స్తోమత లేనివారే. ఇద్దరు ముగ్గురికి వృద్ధాప్య పెన్షన్లు వస్తే వారి మందులు వారి సొంత అవసరాలకు కొంత వరకు ఉపయోగించుకుంటున్నారు.
కంటిపాపలా చూసుకుంటున్నారు
విచిత్రమేమిటంటే పెద్దపెద్ద అధికారులు కూడా వచ్చి సేవాసదన్ చూసి, పండ్లు పంచి పెట్టి పోవడం తప్ప ఎలాంటి ఆర్థిక సాయం చేయడంలేదు. ఆర్థిక సాయం ఎలా పొందాలో
తమ ఇంటికి పోమంటారు
తోవ కూడా చూపించడం లేదు. అయినా రాజేశ్వరి మాత్రం వృద్ధులను కంటి పాపలాగా చూసుకుంటు న్నారు. వారికి ప్రథమ చికిత్స చేస్తూ... కాలికి గాయాలైతే వాటిని శుభ్రం చేసి, మందు వేసి కట్లు కూడా స్వయంగా కడుతున్నారు. ఎవరెవరికి ఎలాంటి చికిత్సలు చేయాలో అవి చేస్తూ వారికి ఉపశమనం కలిగిస్తున్నారు.
తమ వారికి సేవలు చేయడమనే భాద్యతలు మర్చిపోతున్న వారెందరో ఉన్న ఈ కాలంలో రాజేశ్వరి మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేని వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఆమెనే కాదు ఆమె భర్త కూడా ఈ సేవలో భాగం పంచుకుం టున్నారు. న్యాయ సంబంధిత అధికారులు ఎప్పుడైనా సేవా సదనం వచ్చి చూసినప్పుడు వారు ఇచ్చే సలహా ఏమిటంటే... కొడుకులు బిడ్డలు ఉన్న వారి మీద కోర్టులో కేసులు వేయమని, అలా కేసులు వేస్తే మెయింటినెన్స్ ఇస్తారని అంటారు. లేదా తమ వారిని ఇంటికి తీసుకుని వెళ్తారని చెప్తారు. కానీ వృద్ధులు మాత్రం తమ ఇంటికి పోమని కచ్చితంగా అంటారు. పాత అవమానాలు, తిండి పెట్టక మలమల మాడిన విషయం జ్ఞాపకం వచ్చి భయపడతారు. ఇంకొంతమంది తల్లి దండ్రులు తమ పిల్లలపై కేసు వేయడానికి అస్సలు ఇష్టపడరు. మరికొంతమంది నువ్వు కోర్టు చుట్టూ తిరిగినా వాళ్ల నుండి ఒక్కపైసా కూడా రాదు.. కేసులు వేయడం అనవసం అంటారు. ఇవన్నీ సదనం సందర్శనలో బయటపడ్డ నగసత్యాలు...
నెలకు నలభై, యాభై వేలు
రాజేశ్వరి కూడా ఇలాంటి చిక్కులు పడడం ఇష్టం లేక వదిలేశారు. ఎంత కష్టమైనా తానే భరిస్తూ వారిని ఇండ్లకు పంపించకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఆశ్రమం పరిసరాలు పరిశీలిస్తే శుభ్రమైన వాతావరణం, చక్కటి గాలి, వెలుతురు, వంట చేసేవారిద్దరు, సెక్యూరిటీ ఇద్దరు, ఇద్దరు పని వాళ్ళు వెరసి నెలకు నలభై యాభై వేలు ఖర్చు వస్తుంది. ఇవి కాకుండా సదనంలో ఉండేవారందరికీ సాన్నం సబ్బులు, బట్టలుతికే సబ్బులు, షాంపూలు మొదలైన అదనపు ఖర్చు ఉండనే ఉన్నాయి. అప్పుడప్పుడు సందర్శకులు పెళ్లిరోజులు, పుట్టిన రోజులు, వర్ధంతులకు వచ్చి సేవా సదనంలో భోజనాలు, పండ్లు ఇలా ఎవరికి తోచినవి వారు ఏర్పాటు చేసి ఆ రోజు గడుపుతారు. అలా కొన్ని రోజులు భోజనం ఖర్చు కలిసి వస్తుంది. కొందరు రైస్ మిల్లర్లు బియ్యం పంపించి తమవంతు సహాయం చేస్తున్నారు. కొందరు చద్దర్లు, బట్టలు ఇస్తారు. ఇలా చిన్నచిన్న సహాయాలు అందుతున్నాయి. ఇవి అప్పటికప్పుడు తెలియకుండా ఏవో ఖర్చులు వస్తూనే ఉంటాయి.
అన్నీ స్వయంగా చేస్తారు
ఆశ్రమంలో ఉంటున్న మానసిక వికలాం గులను చూసుకోవడం అత్యంత కష్టమైన పని. ఎందుకంటే వారి పనులు వారు చేసుకోలేరు. చెపితే అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఇద్దరు వికలాంగులైతే పూర్తిగా రాజేశ్వరి మీదే ఆధారపడి ఉంటారు. వారికి శారీరక పనులన్నీ ఆమె చేయాల్సిందే. ఎవరి నీ దగ్గరకు రానివ్వరు. వచ్చినా కొడతారు, తిడతారు. ఒక ఆమె వయసు 42, మరొక ఆమె వయసు 60 సంవత్సరాలు. రోజూ వీరికి వేసే నైట్ గౌన్లు చింపివేసుకుంటారు. దాంతో వారికి ప్రతి రోజు ఒక్క కొట్ట నైట్ గౌన్ వేయాల్సిందే. రాజేశ్వరి చేస్తున్న సేవ గురించి ఆ నోటా ఈ నోటా విని, తమ ఇరుగుపొరుగు వారు ఎవరైనా నిరాధరణకు గురైతే వారిని తీసుకుని వచ్చి ఈ సేవా సదనంలో చేరుస్తారు. ఇంకొందరు మానసిక రోగులను ఇంటివారే వారిని భరించలేక తీసుకొచ్చి ఈ సేవా సదనంలో చేర్చారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా...
90, 85 ఏండ్లు ఉన్న వృద్ధులకు డైపర్స్ వేయడం, బట్టలు కట్టడం స్వయంగా రాజేశ్వరే చేస్తున్నారు. అంత పెద్ద వయసు వారికి తీసుకున్న ఆహారం ఒక్కోసారి సరిపడక విరేచనాలు అవుతుంటాయి. వారికి శ్రద్ధగా మందులు వేసి, స్నానాలు చేయించడం, మిగతా అన్ని సేవలు చేయడం తానే స్వయంగా చేసుకుంటున్నారు. ఇలా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన నిర్ణయం మాత్రం ఆమె మార్చుకోలేదు. అనాధ వృద్ధులు ఎంత మంది వచ్చినా కన్న పిల్లల వలె చూసుకుంటాననే ఆత్మ విశ్వాసం ఆమె మాటల్లో చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. 100 మందినైనా చూసుకునే శక్తి నాకు ఉందని ఆమె చెప్పడంలోనే ఆమె ఈ సేవా సదనం నడపడం త్రికరణశుద్ధిగా చేస్తున్నదనిపిస్తుంది. ఏ చిన్న కష్టం వచ్చినా చేస్తున్న పనులను మధ్యలోనే వదిలేసేవారున్న ఈ రోజుల్లో ఎంత కష్టమైనా భరిస్తూ ఆమె సదనం నడపం నిజంగా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపిస్తుంది.
సొంత బిడ్డల వలె...
నేను ఒక పిచ్చి ప్రశ్న వేశాను... మనసులో ఒకింత అనుమానంతోనే... ఇంత మంది వృద్ధులకు వారికి కావలసిన మంచాలు పడకలు ఎలా అమర్చారని? (నా అనుమానం వృద్ధు లను కింద చాపలు వేసి పడుకో పెడుతున్నది కావచ్చని) రాజే శ్వరి దానికి ఎంతో హుందాగా జవాబిచ్చారు. ఆమె మాత్రం తన సొంత బిడ్డల కోసం ఎలాగైతే తపిస్తారో అలా వారికి కావల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత హాస్టల్స్ మూసి వేస్తున్నారని తెలిసి వారి దగ్గర సగం ధరకు 30 మంచాలు కొని ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. అంతే కాదు ఒక డాక్టరు 8 మంచాలు దానం చేశారు. అవసరమైనప్పుడు సాయం చేస్తానని కూడా మాట ఇచ్చి ఆ ప్రకారం నడుచు కుంటున్నారు కూడా. మనం చేసే పని మంచిదైనప్పుడు మంచి హృదయాలు ఇలాగే స్పందిస్తాయి.
సొంత డబ్బుతోనే మందులు
లాక్ డౌన్ సమయంలో మందులు ఉచితంగా దొరికాయి కానీ తర్వాత కాస్త కష్టమైంది. సేవాసదన్‌లో ఉన్న వారికి రక్తపోటు, చక్కెర వ్యాధి, మలబద్ధకం, నీరసం, రక్తలేమి, కడుపు నొప్పి మొదలైనవాటికి మందుల అవసరం. అవి లేకపోవడంతో బాధపడ్డారు. వాటిని సమకూర్చడం కోసం చాలా కష్టపడ్డారామె. పెన్షన్ రానివారికి తన డబ్బులతోనే మందులు కొంటున్నారు. ప్రతి నెల 5వ తేదీన సబ్బులు, షాంపూలు, సర్ఫ్ మొదలైనవి సరఫరా చేస్తున్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌లు, పేస్టు, తలకు కొబ్బరినూనె ఇస్తున్నారు.
సొంత ఖర్చులతోనే...
2008 నుండి 22 మందికి తన సొంత ఖర్చులతోనే అన్ని సదుపాయాలను కల్పిస్తు న్నారు. వృద్ధుల సేవా సదనం కోసం ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ, ఆర్థికంగా ఎవరూ చేయూతనివ్వక పోయినా కొంత మంది దాతల సాయంతో సేవా సదనాన్ని నడుపుతూనే ఉన్నారు. ఆశ్రమం ప్రారంభించిన చోట మురుగునీటి పారుదల సరిగా లేదు. వృద్ధులకు సరైన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మరో చోటకు మకాం మార్చారు. ఇలా మార్చడం చాలా శ్రమ తోనూ, ఖర్చు తోనూ కూడుకున్న విషయం. మారిన చోట వసతి సరిగా లేక చలికి వృద్ధులు వణుకుతుంటే రాజేశ్వరి భరించలేకపోయారు. అక్కడ నుండి వేరే చోటకు మార్చి అన్నిటినీ సమకూరు స్తున్నారామె.
దాతలు సాయం చేస్తే...
తనకున్న దానిలోనే ఆశ్రమంలో వారి కనీస అవసరాలు తీరుస్తున్నారు. సాటి మానవు లకు సేవ చేయాలనే సంకల్పముంటే చాలు లక్షాధి కారులో... కోటీశ్వరులో కానక్కరలేదని నిరూపించారు రాజే శ్వరి. ఇప్పుడు ఎందరికో ప్రేరణ ఈమె. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మలు చుకుంటూ, తాను అనుకున్న లక్ష్యసాధనలో నిరంతరం శ్రమిస్తున్నారు. మానవత్వం చాటుకుంటున్న మహిళా రత్నం రాజేశ్వరి. ఈమె సేవలను గుర్తించి జనగామలో పురస్కారాలందించారు. ఇంకా మంచితనం మానవత్వం సమసి పోలేదని నిరూపించి 40 మందికి కూతురుగా ఉన్న రాజేశ్వరి ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. అయితే ఆమె దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా సాయం చేస్తే వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానంటున్నారు. సాయం చేయాలను కున్నవారు 7329997866 నెంబర్‌కు సంప్రదించగలరు.
- రంగరాజు పద్మజ